హొసపేటె: తుంగభద్ర బోర్డు నూతన కార్యదర్శిగా శ్రీనివాస్ బైరి నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన సీడబ్ల్యూసీ ఆర్ అండ్ డీ విభాగంలో డైరెక్టర్‌గా ఉన్న ఆయనను మండలి కార్యదర్శిగా నియమిస్తూ కేంద్ర ప్రభుత్వ జల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇంతకు ముందు ఉన్న కార్యదర్శి ఓఆర్‌కే రెడ్డి పదవీ కాలం పూర్తి కావడంతో ఆయన బదిలీ అయ్యారు. ప్రస్తుతం తుంగభద్ర బోర్డు ఇన్‌చార్జి కార్యదర్శిగా ఆస్మా ఖాటూన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలో నూతన కార్యదర్శి బాధ్యతలు చేపట్టనున్నారు.
భూ బాధిత రైతులకు న్యాయం కావాలి
రాయచూరు రూరల్: హట్టి బంగారు గనుల కోసం భూములు కోల్పోయిన రైతులకు న్యాయం జరగాలని లింగసూగూరు శాసన సభ్యుడు వజ్జల మానప్ప డిమాండ్ చేశారు. గురువారం హట్టి బస్టాండ్‌లో చేపట్టిన ఆందోళనలో రైతులకు మద్దతు పలికి మాట్లాడారు. రైతులు బ్యాంక్‌లో రుణాలు పొందాలంటే భూమి ఖాతాలో హట్టి గని స్థలమని పేర్కొనడంతో రైతులు పంటల సాగు చేయడం కష్టకరమైందన్నారు. 450 ఎకరాల భూమి గని పేరు మీద నమోదు కావడం విడ్డూరంగా ఉందన్నారు. భూములు పోగొట్టుకున్న రైతులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేపడతామన్నారు. ఆందోళనలో జిల్లాధ్యక్షుడు వీరనగౌడ, వలీబాబు, శంకరగౌడ, నారాయణప్ప, సరస్వతి, సంగీత, ఈరమ్మ, నింగప్ప, శివరాజ్, వెంకోబ, శరణప్ప, మల్లికార్జునలున్నారు.
జొన్నల డబ్బులు
ఖాతాల్లో జమ చేయండి
రాయచూరు రూరల్: జిల్లాలో ఖరీఫ్ సీజన్‌లో రైతులు విక్రయించిన జొన్నల డబ్బులు ఖాతాలోకి జమ చేయాలని కర్ణాటక రైతు సంఘం డిమాండ్ చేసింది. గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన అద్యక్షుడు అమీన్‌పాషా దిద్దిగి మాట్లాడారు. జిల్లాలో రైతుల ఆత్మహత్యల నియంత్రణకు స్వామినాథన్ నివేదికను జారీ చేయాలన్నారు. రైతులు పండించే పంటలకు మద్దతు ధరలను ప్రకటించాలన్నారు. నకిలీ పత్తి విత్తనాల విక్రయాలకు అవకాశాలు కల్పించకుండా చర్యలు చేపట్టాలన్నారు. మార్కెట్ ధరకే విత్తనాలు, ఎరువుల విక్రయాలు జరిపేలా చూడాలన్నారు. ఎరువుల కొరత రాకుండా చూడాలని కోరుతూ స్థానికాధికారికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రామయ్య, తిమ్మన్న, చెన్నప్ప, వెంకటేష్, ఖాసీం, నరసింగ్ రావ్‌లున్నారు.
డివైడర్‌కు కారు ఢీ..
డ్రైవర్‌కు తీవ్ర గాయాలు
హొసపేటె: అతి వేగంగా వస్తున్న కార్ డివైడర్‌ను ఢీకొనడంతో డ్రైవర్ కారులో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం కానాహొసళ్లి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. విజయనగర జిల్లా కూడ్లిగి తాలూకాలోని ఆలూరు క్రాస్ సమీపంలో జాతీయ రహదారి– 50పై ఈ ఘటన జరిగింది. హైవేఫై ఫ్‌లై ఓవర్ నిర్మాణ పనులు చేపడుతున్న కారణంగా అక్కడ డివైడర్‌ను ఏర్పాటు చేశారు. అయితే డివైడర్‌ను గమనించని బెంగళూరు నుంచి వస్తున్న కారు డ్రైవర్ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టాడు. ప్రమాద తీవ్రతకు కారు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జయింది. కారులో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను స్థానికులు రక్షించారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్‌ను జగళూరు ఆస్పత్రిలో చేర్పించారు.


