హుబ్లీ: విజయపుర జిల్లాలో త్రుటిలో భారీ ముప్పు తప్పింది. ఓ వైపు రైలు వస్తుండగానే 25 మంది పిల్లలతో ఉన్న స్కూలు బస్సు రైలు పట్టాలపై ఆకస్మికంగా ఆగిపోయింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన వివరాలు.. విజయపుర జిల్లా ఇండి తాలూకా లచ్యాణ గ్రామ సమీపంలోని కాపలా లేని రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఊపిరి బిగబట్టేంతలో ఓ పెను ప్రమాదం రెప్పపాటులో అదృష్టవశాత్తు తప్పింది. స్థానికుల సమయస్ఫూర్తితో ఈ భారీ దురంతం వెంట్రుక వాసిలో తప్పి పోయింది. అలసంగి నుంచి లచ్యాణ వెళ్లే మార్గం మీదుగా సిరుగూరు గ్రామానికి చెందిన 25 మందికి పైగా స్కూలు విద్యార్థులను తీసుకెళుతున్న బస్సు రైలు పట్టాలపై గేటు దాటుతుండగా గేర్ బాక్స్ వైఫల్యంతో రైలు పట్టాల మీదే ఆగిపోయింది. డ్రైవర్ ఎంత ప్రయత్నించినా వాహనం ముందుకు కదలకుండా మొరాయించింది. కొన్ని క్షణాల పాటు విద్యార్థులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. వాహనం పట్టాలపై ఆగిపోయిన కొన్ని క్షణాల్లోనే అదే పట్టాలపై వేగంగా రైలు వచ్చే సమయం అయింది. వాహనంలో ఉన్న 25 మందికి పైగా విద్యార్థులు భయంతో కేకలు వేశారు.
ప్రాణాలను పణంగా పెట్టి..
పట్టాలపై బస్సు ఆగిపోయిన దృశ్యాన్ని గమనించిన లచ్యాణ గ్రామ యువకులు, గ్రామస్తులు ఒక క్షణం కూడా ఆలోచించకుండా పరుగు పరుగున పట్టాల వైపు వచ్చారు. చావు కళ్ల ముందు కనబడుతున్నా కూడా తమ ప్రాణాలను పణంగా పెట్టి ధైర్యంగా నిలిచి పోయిన బస్సును ముందుకు తోసి రైలు పట్టాలకు అటు వైపునకు వెళ్లేలా చేయడంలో సఫలం అయ్యారు. గ్రామస్తుల ఈ విరోచిత కృత్యంతో వాహనంలోని అమాయక విద్యార్థులందరూ ఎటువంటి ప్రమాదం లేకుండా బతికి బట్టకట్టారు. గ్రామస్తులు ఈ చాకచక్యత, సమయస్పూర్తితో తీసుకున్న నిర్ణయంతో అందరికీ కంటతడి తప్పిపోగా ఘటన సుఖాంతం అయింది. గత మంగళవారం సాయంత్రమే ఈ సాహసోపేతమైన ఘటన జరిగినా ఆలస్యంగా వీడియో తదితర వివరాలు వెలుగులోకి వచ్చాయి. తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా విద్యార్థుల ప్రాణాలు కాపాడిన లచ్యాణ యువత, గ్రామస్తుల సమయస్పూర్తి, ధైర్య సాహసాలపై పిల్లల తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యంతో పాటు సర్వత్రా ప్రజల నుంచి అభినందనల జల్లు కురిసింది.
విజయపుర జిల్లాలో త్రుటిలో
తప్పిన ముప్పు
గ్రామస్తుల సమయస్ఫూర్తితో
ప్రమాదం సుఖాంతం


