గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్‌ | - | Sakshi
Sakshi News home page

గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు! దొంగ వీడియోలు సృష్టిస్తే.. : బండి సంజయ్‌

Nov 29 2023 1:42 AM | Updated on Nov 29 2023 12:11 PM

- - Sakshi

సాక్షి, కరీంనగర్‌: ‘గంగుల.. నా సహనాన్ని పరీక్షించొద్దు. కరీంనగర్‌లో నేను చేసిన అభివృద్ధిపై చర్చించే దమ్ములేని వ్యక్తి నాపై దొంగ వీడియోలు సృష్టించేందుకు సిద్ధమైనట్లు సమాచారం అందింది. దొంగ వీడియోలు సృష్టిస్తే చరిత్ర హీనుడిగా మారతావు’ అంటూ కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌ కుమార్‌ హెచ్చరించారు. కార్యకర్తలే నా హీరోలు.. కరీంనగర్‌లో గెలిచేది బీజేపీ అని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజైన మంగళవారం కరీంనగర్‌లో మహాబైక్‌ ర్యాలీ నిర్వహించారు. యువత, మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

కిసాన్‌నగర్‌ నుంచి ప్రారంభమైన ర్యాలీ గాంధీచౌక్‌, రాజీవ్‌గాంధీ విగ్రహం, టవర్‌ సర్కిల్‌, శాసీ్త్రరోడ్‌, కమాన్‌, ఎన్టీఆర్‌ విగ్రహం, గణేశ్‌నగర్‌ బైపాస్‌, అంబేడ్కర్‌స్టేడియం, భగత్‌సింగ్‌ విగ్రహం, గోదాంగడ్డ, ఉమెన్స్‌కాలేజ్‌, రాంనగర్‌ మార్క్‌ఫెడ్‌, మంకమ్మతోట, శివ థియేటర్‌, జగిత్యాల రోడ్‌, అంబేడ్కర్‌ విగ్రహం మీదుగా రేకుర్తి వరకు సాగింది. ర్యాలీని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ప్రారంభించారు.

రేకుర్తి వద్ద ముగింపు కార్యక్రమంలో బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కార్యకర్తలే తన హీరోలు అన్నారు. ప్రజా ఆశీర్వాదంతో కరీంనగర్‌లో భారీ మెజారిటీతో బీజేపీ విజయం సాధిస్తుందని తెలిపారు. ఇది తట్టుకోలేక గంగుల కమలాకర్‌ తనపై దొంగ వీడియో, ఆడియోలు సృష్టించి వైరల్‌చేసే పనిలో పడినట్లు సమాచారం ఉందని అన్నారు. దమ్ముంటే నేరుగా కొట్లాడాలని, అభివృద్ధిపై చర్చకు రావాలని పిలుపునిచ్చారు.

భూకబ్జాలు, రౌడీయిజం తన దగ్గర చెల్లవన్నారు. ఫాంహౌజ్‌లో ఉన్న కేసీఆర్‌ను ధర్నాచౌక్‌కు తీసుకొచ్చానని, నువ్వెంత అంటూ గంగులకు సవాల్‌ విసిరారు. మీరు అధికారంలో ఉండేది మరో 48 గంటలే అని, 30న కరీంనగర్‌లో బీజేపీకే ఓటేయాలని ప్రజలంతా నిర్ణయించుకున్నారని అన్నారు. ఇప్పటికే కాంగ్రెస్‌ అభ్యర్థి దుకాణం బంద్‌ చేసుకున్నాడని తెలిపారు. భూకబ్జాదారులు, అవినీతి పరులుకావాలా? మచ్చలేని వ్యక్తిత్వంతో ప్రజల కోసం పోరాడుతున్న తాను కావాలో? ఆలోచించండని అన్నారు. కమలంపువ్వు గుర్తుపై ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.

మందకృష్ణ మాట్లాడుతూ.. బండి సంజయ్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఎస్సీ, ఎస్టీ, బీసీవర్గాలతోపాటు ఓసీ వర్గాలపై ఉందని అన్నారు. ఇప్పటి వరకు జనాభాలో 1,2 శాతం జనాభా కూడా లేనివాళ్లే 75 ఏళ్లుగా తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా పనిచేశారని, 50 శాతానికిపైగా ఉన్న బీసీల్లో ఒక్కరిని కూడా సీఎం చేయలేదన్నారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఇవి చదవండి: చివరి రోజు ఉద్రిక్తత! బీఆర్‌ఎస్‌, బీజేపీ పరస్పరం దాడులు..

Advertisement
 
Advertisement
Advertisement