న్యూస్‌రీల్
జిల్లావ్యాప్తంగా వర్షం అయినా లోటు వర్షపాతమే రామడుగులో సాధారణానికి మించి నమోదు గంగాధర, మానకొండూరులో సాధారణం మిగతా మండలాల్లో అంతంతే కుంటలకు ఇప్పుడిప్పుడే జలకళ జోరందుకోనున్న నాట్లు
గురువారం శ్రీ 30 శ్రీ జూలై శ్రీ 2026
జిల్లాలో కరీంనగర్, హుజూరాబాద్ రెవెన్యూ డివిజన్లుండగా 1,376 చెరువులున్నాయి. దిగువ మానేరు జలాశయం, శనిగరం ప్రాజెక్టు, మధ్యమానేరు, ఎగువ మానేరు జలాశయాలకు ఒకింత జలకళ సంతరించుకోగా వస్తున్న వరద నీటితో చెరువులు, కుంటలు కాసింత భరోసానిస్తున్నాయి. కాకతీయ కెనాల్, వరదనీటి కాలువ ద్వారా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు నీరందించే శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఆశాజనకంగా నీరుచేరనుందని సమాచారం. మరో రెండు రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుండగా అదే జరిగితే జలాశయంలోకి భారీగా ఇన్‌ఫ్లో రానుండగా దిగువన ఉన్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద పోటెత్తనుంది.
జోరందుకోనున్న వరి నాట్లు
జిల్లాలో కరీంనగర్, హూజూరాబాద్, మానకొండూరు, చొప్పదండి వ్యవసాయ డివిజన్లుండగా దాదాపు అంతటా ఆశాజనకమే. గంగాధర, రామడుగు, చొప్పదండి ఒకప్పుడు కరువు మండలాలు ఉండేవి కానీ, ఈ సారి కురిసిన వర్షాలను గమనిస్తే ఇక్కడే అత్యధిక వర్షపాతం నమోదైంది. జిల్లాలో వరి ప్రధాన సాగు కాగా 2.70లక్షల ఎకరాల వరకు సాగవుతుందని అధికారుల అంచనా. వారం క్రితం వరకు 40వేల ఎకరాలే సాగవగా తాజాగా లక్ష ఎకరాలు దాటింది. పత్తి, మొక్కజొన్న ఇతరత్రా పంటలు సాగు చేయగా వరి నాట్ల విషయంలో వేచిచూశారు.
మూడు మండలాల్లో దంచికొట్టిన వాన
జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు పలు చోట్ల వర్షం దంచికొట్టింది. అత్యధికంగా గంగాధరలో 9.7సెంటిమీటర్ల వర్షపాతం నమోదవగా ఈ సీజన్‌లో ఇదే అత్యధికం. అయినా జిల్లావ్యాప్తంగా హెచ్చు మండలాల్లో లోటు వర్షపాతమే నమోదవడం ఆందోళనకర పరిణామం. రామడుగు మండలంలో సాధారణానికి మించి నమోదవగా గంగాధర, మానకొండూరు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ఇక మిగిలిన 13మండలాల్లో లోటు వర్షపాతం సాగురంగాన్ని వెక్కిరిస్తోంది.
జిల్లాలో ఇప్పటివరకు సాగైన
ప్రధాన పంటలు, విస్తీర్ణం ఎకరాల్లో..
పంట పేరు సాగైన విస్తీర్ణం అంచనా
వరి 88,152 2,76,500
పత్తి 48,000 48,000
మొక్కజొన్న 3,500 4,000
పెసర 120 200
కందులు 642 1,000
కరీంనగర్ అర్బన్: వర్షాలు లేక సంక్షోభంలో ఉన్న సాగు రంగం జవసత్వాలు తొడిగింది. మూడురోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తుండగా వాగులు, వంకలు, మినీ చెరువులు జలకళ సంతరించుకున్నాయి. ఇన్నిరోజులు వర్షాలు లేక వెలవెలబోయిన పొలాలు నాట్లతో ఊపందుకోనున్నాయి. పల్లె, పట్నం తేడా లేకుండా వర్షాలు దంచికొడుతుండగా పలుచోట్ల నీరు ఏరులైపారింది. జిల్లాలో వ్యవసాయ రంగమే కీలకం. 65శాతం మంది సాగును నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో కళ్లలో వత్తులు వేసుకుని వాన కోసం నిరీక్షించారు.


