రౌడీ షీటర్లు, హిస్టరీ షీట్లపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

రౌడీ షీటర్లు, హిస్టరీ షీట్లపై ప్రత్యేక నిఘా

Jul 30 2026 12:21 AM | Updated on Jul 30 2026 12:21 AM

రామడుగు(చొప్పదండి): రౌడీషీటర్లు, హిస్టరీ షీట్లపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, వారి కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని సీపీ గౌస్‌ ఆలం ఆదేశించారు. బుధవారం సాయంత్రం రామడుగు పోలీస్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌ పరిసరాలను పరిశీలించారు. పలు కేసుల్లో పట్టుబడి స్వాధీనంలో ఉన్న వాహనాల వివరాలు తెలుసుకున్నారు. స్టేషన్‌లో రికార్డుల నిర్వహణ, నమోదైన కేసుల వివరాలు సీసీటీఎన్‌ఎస్‌లో పొందుపర్చాలని సూచించారు. టెక్నాలజీ వినియోగంపై పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని సిబ్బందికి సూచించారు. కరీంనగర్‌ రూరల్‌ ఏసీపీ విజయ్‌కుమార్‌, చొప్పదండి సీఐ ప్రదీప్‌కుమార్‌, రామడుగు ఎస్సై రాజు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ముగిసిన నామినేషన్ల పర్వం

కరీంనగర్‌ అర్బన్‌: జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్‌ ఎన్నికలకు నామినేషన్ల ఘట్టం ముగిసింది. సుదీర్ఘకాలం తర్వాత ఎన్నికలు జరుగుతుండగా పోటాపోటీ నెలకొంది. ఈ నెల 27న నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కాగా బుధవారం సదరు ప్రక్రియ ముగిసింది. మొత్తం 21 నామినేషన్లు దాఖలయ్యాయని ఎన్నికల అధికారి మహ్మద్‌ జలాలుద్దీన్‌ అక్బర్‌ వెల్లడించారు. కటికరెడ్డి బుచ్చన్న, బాషవేని మల్లయ్య, ముక్కెర సదానందం, జినుక రాజయ్య, దాడి సదయ్య, బండి మల్లయ్య, దానె ఓదెలు, దాడి ఆంజనేయులు, అగిత రవీందర్‌, సందబోయిన ప్రసాద్‌యాదవ్‌, చౌటపల్లి రంజిత్‌, చందబోయిన సంపత్‌, జిల్లెల్ల పర్శరాములు, కాల్వ సురేశ్‌, బోయిని పోచమల్లయ్య, చిగుర్ల శ్రీనివాస్‌, కేశవేని మల్లయ్య, బావు తిరుపతి, జంగిలి రమేశ్‌, చిట్కూరి సతీశ్‌, సాయిల్ల కిరణ్‌కుమార్‌ నామినేషన్లు సమర్పించారు. స్థానిక పద్మనగర్‌లోని యూనియన్‌ కార్యాలయం వేదికగా ఎన్నికలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. గురువారం నామినేషన్ల పరిశీలన ఉండనుండగా 31న నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం కల్పించారు. యూనియన్‌లో 12మంది డైరెక్టర్లను ఓటర్లు ఎన్నుకోవాల్సి ఉంటుంది. కాగా 21 నామినేషన్లు దాఖలవగా ఒక డైరెక్టర్‌ స్థానం ఏకగ్రీవమైనట్లేనని తెలుస్తోంది.

పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలి

కరీంనగర్‌సిటీ: పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం కావాలని ఎస్సారార్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ రామకృష్ణ అన్నారు. ఎస్సారార్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో బుధవారం పర్యావరణ పరిరక్షణ, అటవీ విస్తరణ, జీవవైవిద్య సంరక్షణ లక్ష్యంగా వృక్షశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన సీడ్‌ ఎక్స్‌పో, సీడ్‌ బాల్స్‌ తయారీని ప్రారంభించి మాట్లాడారు. ప్రతీ విద్యార్థి కనీసం కొన్ని సీడ్‌ బాల్స్‌ తయారు చేసి అడవులు, కొండ ప్రాంతాలు, ఖాళీ భూముల్లో విసిరితే వేలాది మొక్కలు సహజసిద్ధంగా పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రభుత్వ కళాశాలల అధ్యాపకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ అనేది ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాకుండా ప్రతీ పౌరుడి కర్తవ్యమని తెలిపారు. వృక్షశాస్త్ర విభాగాధిపతి, పరీక్షల నియంత్రణాధికారి టి.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఆర్‌.రాధాకృష్ణ, థియార్‌ హుస్సేన్‌, పడాల తిరుపతి, కె.కళాజ్యోతి, అందె బుంగ తిరుపతి, ఎ.స్వరూపారాణి, విభాగాల అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, డిగ్రీ, పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సేకరించిన 22 రకాల వృక్ష విత్తనాలతో ప్రత్యేక సీడ్‌ ఎక్స్‌పో నిర్వహించారు. మామిడి, నేరేడు, అశోక, టేకు, మద్ది, మోదుగ, రావి, మర్రి, పనస, బాదం, కానుగ, వేప, మారేడు, తురాయి తదితర పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమైన వృక్ష జాతుల విత్తనాలు ప్రదర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement