బ్రిటిష్ కొలంబియా: కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రావిన్స్‌లో 2026 ఫిబ్రవరిలో జరిగిన టంబ్లర్ రిడ్జ్ సామూహిక కాల్పుల ఘటనలో మరో వ్యక్తిపై కేసు నమోదైంది. కాల్పులకు పాల్పడిన 18 ఏళ్ల జెస్సీ వాన్ రూట్‌సెలార్‌కు సలహాలు ఇవ్వడంతోపాటు, దాడికి అవసరమైన వస్తువులు కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపినట్లు 30 ఏళ్ల అమెరికా పౌరుడు జేమ్స్ కోడి బ్రయంట్‌పై ఆరోపణలు వచ్చాయి. అమెరికాలోని వాషింగ్టన్ రాష్ట్ర ఫెడరల్ ప్రాసిక్యూటర్లు మంగళవారం ఈ విషయాన్ని వెల్లడించారు.
అమెరికా ప్రాసిక్యూటర్ల ప్రకారం.. వాన్ రూట్‌సెలార్, బ్రయంట్‌లు 2025 ఆగస్టు నుంచి డిస్కార్డ్ ద్వారా పరస్పరం మాట్లాడుకున్నారు. పలువురిని హత్య చేయాలనే తన ప్రణాళికను వాన్ రూట్‌సెలార్ బ్రయంట్‌కు చెప్పినట్లు అధికారులు తెలిపారు. ఈ విషయం తెలిసినప్పటికీ బ్రయంట్ పోలీసులకు సమాచారం ఇవ్వలేదని ఆరోపించారు. విదేశాల్లోని వ్యక్తులను హత్య చేసేందుకు కుట్ర పన్నినట్లు బ్రయంట్‌పై అభియోగం నమోదైంది.
ప్రాసిక్యూటర్ల ఆరోపణల ప్రకారం.. పాఠశాలపై దాడికి ముందు బ్రయంట్, వాన్ రూట్‌సెలార్‌కు పలు విధాలుగా సహకరించాడు. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోయేలా ఎలా దాడి చేయాలి? ఎలాంటి తుపాకులను ఉపయోగించాలి? అనే అంశాలపై వ్యూహాత్మక సలహాలు ఇచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. అంతేకాకుండా దాడికి అవసరమని వాన్ రూట్‌సెలార్ కోరిన కొన్ని వస్తువులను కొనుగోలు చేసేందుకు డబ్బులు పంపినట్లు తెలిపారు.
దాడిలో జరిగిన హత్యలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి కూడా బ్రయంట్ అంగీకరించినట్లు అమెరికా అధికారులు ఆరోపించారు. వాన్ రూట్‌సెలార్ చేసిన లైవ్‌స్ట్రీమ్‌ను రికార్డు చేసి ప్రసారం చేయడానికి బ్రయంట్ సహకరించాడని పేర్కొన్నారు. అయితే ఆ ప్రత్యక్ష ప్రసారం ప్రారంభమైన కొన్ని సెకన్లకే నిలిచిపోయిందని ప్రాసిక్యూటర్లు తెలిపారు.
ఈ కేసులో బ్రయంట్ దోషిగా తేలితే జీవిత ఖైదు పడే అవకాశం ఉందని అమెరికా అటార్నీ కార్యాలయం తెలిపింది. మరోవైపు టంబ్లర్ రిడ్జ్ పాఠశాలలో కాల్పులకు పాల్పడిన వాన్ రూట్‌సెలార్.. పోలీసులు పాఠశాలలోకి ప్రవేశించే సమయంలో తనకు తానే కాల్చుకుని మరణించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆరుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి కెనడాలోని బ్రిటిష్ కొలంబియా ప్రభుత్వం కూడా ఓపెన్‌ఏఐపై అమెరికా ఫెడరల్ కోర్టులో గతంలో దావా వేసింది. ఘటనకు ముందు సంబంధిత చాట్‌జీపీటీ ఖాతాలోని ఆందోళనకరమైన సంభాషణలపై అధికారులను అప్రమత్తం చేయడంలో సంస్థ విఫలమైందనే ఆరోపణలు వచ్చాయి.
ఇదీ చదవండి: సుప్రీం షాక్ దరిమిలా.. జ్ఞానేశ్‌ను ప్రభుత్వం ఏం చేయనుంది?


