సుప్రీం షాక్ దరిమిలా.. జ్ఞానేశ్‌ను ప్రభుత్వం ఏం చేయనుంది? | Will Gyanesh Kumar Resigned or Suspend whats sc order how Could cec be Suspended | Sakshi
Sakshi News home page

సుప్రీం షాక్ దరిమిలా.. జ్ఞానేశ్‌ను ప్రభుత్వం ఏం చేయనుంది?

Oct 7 2026 7:31 AM | Updated on Oct 7 2026 7:37 AM

Will Gyanesh Kumar Resigned or Suspend whats sc order how Could cec be Suspended

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ చుట్టూ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సంఘం నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారన్న ఆరోపణలపై ఆయన రాజీనామాకు డిమాండ్లు వెల్లువెత్తుతున్న వేళ.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అయితే సీఈసీని వెంటనే సస్పెండ్ చేయాలన్న డిమాండ్‌పై కోర్టు ఎలాంటి మధ్యంతర ఆదేశం ఇవ్వలేదు. అసలు రాజ్యాంగం ప్రకారం సీఈసీని సస్పెండ్ చేయడం లేదా పదవి నుంచి తొలగించడం ఎవరికి సాధ్యం? ఈ ప్రక్రియ ఎలా ఉంటుంది?

సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
జ్ఞానేశ్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎన్నికల సంఘం పలు నిర్ణయాలు ఏకపక్షంగా తీసుకున్నారంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ నోటీసులు ఇచ్చింది. అయితే జ్ఞానేశ్ కుమార్‌ను విధుల నుంచి తప్పించాలని లేదా సస్పెండ్ చేయాలని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేదు. ప్రధాన ఎన్నికల కమిషనర్‌ను వెంటనే సస్పెండ్ చేయాలన్న డిమాండ్ అసాధారణమైనదని ధర్మాసనం పేర్కొంది. ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్, న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, వి మోహనాలతో కూడిన ధర్మాసనం ఈ అంశాన్ని విచారించింది.

ఈసీని కోర్టు సస్పెండ్ చేయగలదా?
రాజ్యాంగంలోని ఆర్టికల్ 324(5) ప్రకారం సీఈసీని సాధారణంగా సస్పెండ్ చేయడం లేదా తొలగించడం సాధ్యం కాదు. సుప్రీంకోర్టు న్యాయమూర్తిని ఏ విధానంలో, ఏ ప్రాతిపదికన తొలగిస్తారో అదే విధానాన్ని సీఈసీ విషయంలోనూ అనుసరించాలి. అంటే పార్లమెంటులో అభిశంసన ప్రక్రియ ద్వారా మాత్రమే సీఈసీని తొలగించే అవకాశం ఉంది. అయితే ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాలు చట్టం లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నాయా అనే విషయాన్ని సుప్రీంకోర్టు పరిశీలించాల్సి ఉంటుంది. అవి చట్టవిరుద్ధంగా ఉన్నట్లు తేలితే సంబంధిత నిర్ణయాలను రద్దు చేయగలుగుతుంది.

తొలగింపు ప్రక్రియ ఎందుకంత కఠినం?
రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తిపై ఆరోపణలు రావడం, ఆయనను వెంటనే పదవి నుంచి తొలగించడం రెండూ ఒకటే కాదని సుప్రీంకోర్టు విచారణలో స్పష్టం చేసింది. ప్రస్తుత పిటిషన్‌లో జ్ఞానేశ్ కుమార్‌పై ఆరోపణలపై దర్యాప్తు పూర్తయ్యే వరకు ఆయనను సస్పెండ్ చేయాలని కోరారు. అలాగే ఎన్నికల సంఘం తీసుకున్న 14 నిర్ణయాలను సవాలు చేస్తూ వాటిని రద్దు చేయాలని, ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేయాలని పిటిషనర్లు కోరారు. ఎన్నికల సంఘానికి సంబంధించిన పత్రాలను పరిశీలించాలని కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి కోర్టు సమాధానం కోరింది.

ఎన్నికల సంఘం నిర్ణయాలు ఎలా ఉంటాయి?
విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. మీడియా కథనాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోలేమని స్పష్టం చేసింది. ఎన్నికల సంఘం నిర్ణయాలు చట్టం, రాజ్యాంగానికి విరుద్ధంగా ఉన్నట్లు ఆధారాలతో తేలితే వాటిని కోర్టు రద్దు చేయగలదని పేర్కొంది. ఎన్నికల సంఘం సాధ్యమైనంత వరకు ఏకాభిప్రాయంతో నిర్ణయాలు తీసుకోవాలని ‘చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాక్ట్, 2023’లోని సెక్షన్ 18 చెబుతోంది. సీఈసీ, ఇతర కమిషనర్ల మధ్య భిన్నాభిప్రాయం ఉంటే మెజారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. గతంలో మాజీ సీఈసీ టీఎన్ శేషన్ హయాంలోనూ సీసీసీ అధికారాల పరిధిపై ఇలాంటి ప్రశ్నలు సుప్రీంకోర్టు ముందుకు వచ్చాయి.

జ్ఞానేశ్‌పై మరో పాత కేసు
ఇదిలా ఉండగా, జ్ఞానేశ్ కుమార్‌కు సంబంధించిన సుమారు 20 ఏళ్ల నాటి కేసులో కేరళ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కేరళ హోంమంత్రి రమేశ్ చెన్నితల విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ బ్యూరోకు దర్యాప్తు బాధ్యతలు అప్పగించారు. రహదారి ప్రాజెక్టులో అవకతవకల ఆరోపణలు, మలేషియా చీఫ్ ఇంజనీర్ లీ సీ బెన్ మరణంతో ఈ వ్యవహారానికి సంబంధం ఉన్నట్లు తెలియవచ్చింది. 2006లో జ్ఞానేశ్ కుమార్ కేరళ పీడబ్ల్యూడీ కార్యదర్శిగా ఉన్న సమయంలో అంగమాలి–తిరువనంతపురం ప్రధాన రహదారి అభివృద్ధికి రూ.215 కోట్లను మంజూరు చేశారు. ఈ ప్రాజెక్టు 2006 ఆగస్టు నాటికి పూర్తికావాల్సి ఉండగా, అప్పటికి సుమారు 30 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఎన్నికల నిర్ణయాలపై ఆరోపణలు, సుప్రీంకోర్టు విచారణ, పాత కేసుపై దర్యాప్తు నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై రాజకీయంగా, న్యాయపరంగా ఒత్తిడి పెరిగింది.

ఇదీ చదవండి: గణేశుడు చెడు పనులకు సాయం చేయడు: జయా బచ్చన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement