అఫ్గానిస్థాన్‌లో ఒంటరిగా పర్యటించిన ఒక భారతీయ మహిళ అనుభవం నెట్టింట వైరల్‌గా మారింది. అంకితా కుమార్ అనే మహిళ అఫ్గానిస్తాన్‌కు సోలో టూర్‌కి వెళ్లింది. అదీ తన తల్లిదండ్రులకు చెప్పకుండా. అయితే ఈ ప్రయాణంలో తనకు దినదిన గండమే అందుకే నేను క్షేమంగానే ఉన్నాను అని ప్రతీ రోజు చెప్పాల్సి వచ్చింది అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో తన పర్యటనకు సంబంధించిన వీడియోలను పోస్ట్ చేశారు. దీంతో ఇవి పలువుర్ని ఆకర్షిస్తున్నాయి. ఆలోచింపచేస్తున్నాయి.
“అమ్మా, నాన్నా, నేను బాగున్నాను.” అప్గానిస్తాన్‌లో ఉండగా నేను వందసార్లు చెప్పిన మాట ఇది. ఎందుకంటే ప్రతిరోజూ ఒక సాహసయాత్రే. ఇది నాకంటే నా తల్లిదండ్రులకే స్పష్టంగా తెలుసు. కానీ నేను ఊహించని ఒక విషయాన్ని ఈ దేశం నాకు నేర్పింది’’ అంటూ అక్కడి వాస్తవాలను వివరించారు. రెండు పూర్తిగా భిన్నమైన సత్యాలు ఒకే సమయంలో ఉండగలవని , జీవన పోరాటంలో వాటిని స్వీకరించడం తప్ప వేరే మార్గం లేదనే సత్యం తనకు తెలిసి వచ్చిందన్నారు.
అద్భుతమైన అఫ్గానిస్తాన్
ఇప్పటివరకు తాను చూసిన అత్యంత అద్భుతమైన దేశాలలో ఇదొకటి. అబ్బురపరిచే పర్వతాలు, అంతులేని చాయ్ కప్పులు, అపరిచితుల ఉదారత, ప్రేమ ఇక్కడి నుండి వెళ్ళిపోయాక కూడా చాలా కాలం పాటు నిలిచిపోయే ఆప్యాయత ఉన్న ప్రదేశం.
తుపాకీలు చేతబట్టుకుని వ్యక్తులతో సంభాషించడంతోపాటు, వివిధ రంగాల వ్యక్తులతో కలిసిపోవడం ఆమె టూర్ వీడియోలో చూడవచ్చు. ఇంకా అఫ్టాన్ మహిళలతో మాట్లాడారు. వారితో ఆమె ఫొటో దిగారు. అంతేకాదు దశాబ్దాల సంఘర్షణ భారాన్ని మోస్తున్న ఆ దేశంలో ప్రజల స్థితిగతులను తాను నిశితంగా గమనించానని తెలిపారు. అయితే అక్కడి భవనాల్లో ఈ సంఘర్షణ తాలుకూ ఆనవాళ్లను భవనాలలో చూడవచ్చు. ప్రజలు చెప్పుకునే గాథల్లో వినవచ్చు. ఉండాల్సిన దానికంటే చాలా వేగంగా వయసు పైబడినట్లు కనిపించే ముఖాలలో కూడా ఆ బాధను చూడవచ్చని పేర్కొన్నారు. అయితే ఇంతటి అణచివేతను తట్టుకుని ముందుకు సాగుతున్న వారి తెగువ, ధైర్యం ఎంతో నచ్చిందన్నారు.
ఇదీ చదవండి: సీక్రెట్ పెళ్లి, ఫస్ట్ యానివర్శరీ ఇన్‌స్టా స్టోరీ : తీరా ఆరా తీస్తే ..!
అక్కడి ప్రజల ఆప్యాయతకు ముగ్ధులవ్వవచ్చు. వారి ఆప్యాయత, ఆతిథ్యం, స్నేహశీలత వంటివి చూసి మురిసిపోవాల్సిందే. అన్నారు. ఇది ఎంత అందమైందో అంతే హృదయ విదారకమైనది. ఎంత ఆశాజనకమైందో, అంత భారమైంది. అంత సంక్లిష్టమైంది కూడా. ఇన్ని వైరుధ్యాలన్నింటి మధ్య ఈ సోలో యాత్ర తనకు జీవితకాలపు సాహసయాత్రగా మారింది. అమ్మా, నాన్నా, నేను నిజంగా బాగానే ఉన్నాను అంటూ రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!
ఇక్కడ మహిళగా పుట్టడం కంటే చావడమే మేలు
అదే సందర్బంలో చాలామంది,ముఖ్యంగా మహిళల ముఖాల్లో ఎవ్వరూ ఊహించని దైన్యాన్ని, బాధల్ని కూడా మనం గ్రహించ వచ్చన్నారు. ఆఫ్ఘన్ మహిళలతో సంభాషిస్తున్న వీడియోను పంచుకుంటూ, అప్ఘానిస్తాన్‌లో ఒక మహిళగా పుట్టడం కన్నా చనిపోవడమే మేలు అని చాలా మంది అనడం విన్నాను. ఇక్కడి మహిళలు ఎదుర్కొంటున్న వాస్తవాల గురించి మరింత తెలుసుకున్న తర్వాత, ఆ భావన ఎక్కడి నుండి వచ్చిందో అర్థమైంది. బాలికలను ఆరవ తరగతికి మించి చదువుకోనివ్వరు. చాలా మంది మహిళలు ఒకప్పుడున్న ఉద్యోగాలు, ప్రజా జీవితం, అవకాశాల ఏమీ లేవు. మరోవైపు కుటుంబాల్లోని పేదరికంతో బాల్య వివాహాలు పెరిగాయి. గృహహింస చట్టాలు బలహీనంగా మారిపోయాయి. మనలో చాలామంది తేలికగా తీసుకునే రోజువారీ నిర్ణయాలు, వారికి చాలా గగనం. అయినా వారి తెగువ , ధైర్యం బతుకు పోరాటం తనను కదిలించిందన్నారు.
ఆ దేశంలో అణచివేత నుంచే ఎదుగుతున్నమహిళల గురించి, ఆమె కఠినమైన నియమ నిబంధనల మధ్య మహిళల ప్రస్తుత పరిస్థితి గురించి ఇలా మాట్లాడారు. “ఇది అరుదుగా వార్తల్లోకి నిలిచేది. ఎందుకంటే ప్రజా నిరసనను బెదిరింపులు, నిర్బంధం లేదా హింసతో ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, ప్రతిఘటన నిశ్శబ్దంగా మారుతుంది. కానీ అదే విద్యను నిరాకరించినప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉండాలనే నిర్ణయంగా మారుతుంది. మీ ప్రపంచం కుంచించుకుపోతున్నప్పుడు కూడా సృష్టిస్తూనే ఉండాలనే పట్టుదలగా మారుతుంది. మిమ్మల్ని మీరు చిన్నవారిగా చేసుకోమని నిరంతరం చెబుతున్నప్పుడు కూడా కలలు ఆగిపోకూడదనే నిర్ణయంగా మారుతుంది.
23 ఏళ్ల ఫాతిమా గురించి చెబుతూ తెలివైన, ఆత్మపరిజ్ఞానం ఉన్న మహిళా గైడ్. @khatinzar.gallery కళను సృష్టిస్తూ, మహిళలకు మద్దతుగా ఒక అందమైన గ్యాలరీని నడుపుతున్నారు.
21 ఏళ్ల మహిళ నడుపుతున్న @vision__university, 12వేల మంది యువతులను విశ్వవిద్యాలయ స్థాయి వరకు చదివించి, వారు 6వ తరగతికి మించి చదువుకునేలా చేసే ఒక ఆన్‌లైన్ విశ్వవిద్యాలయం. ఈ మహిళలు తమకు సాధ్యమైన చోటల్లా గౌరవంకోసం తమ ఆనందంకోసం మార్గాలను కనుగొంటున్నారు. వారి పోరాటాన్ని ఆదర్శీకరించాలను కోవడం లేదు. కానీ ఇలాంటి సంక్షోభ పరిస్థితులుఎవరికీ ఎదురు కాకూడదని భావిస్తున్నా. నిరంతరం ముందుకు సాగడమే లక్ష్యంగా ఉండే మహిళల పట్ల అపారమైన గౌరవంతో అప్ఘానిస్తాన్ నుండి తిరిగి వచ్చాను అని చెప్పారు. ప్రతి ఒక్క రోజు. కొన్నిసార్లు ధైర్యం అంటే గుంపు ముందు నిలబడటం కాదు. కొన్నిసార్లు ధైర్యం అంటే కేవలం కనుమరుగవడానికి నిరాకరించడమే అంటూ చాలా భావోద్వేగంతో అక్కడి పరిస్థితులను, మరెన్నో విశేషాలను కళ్లకు గట్టారు.
దురంధర్ నటుడు ముస్తఫా అహ్మద్ కూడా ఆ వీడియోలపై స్పందిస్తూ, అక్కడి పరిస్థితులను ఇంత అందంగా, ఎంతో ధైర్యంగా, స్ఫూర్తిదాయకంగా బయటపెట్టినందుకు ధన్యవాదాలు అంటూ కొనియాడారు.


