బెంగళూరులో వరుస ఘటనలు ఆందోళన రేపుతున్నాయి. అనుమానాస్పద స్థితిలో 22 ఏళ్ల యువతి శవమై కనిపించగా, స్పృహతప్పి పడివున్న ఆమె ప్రియుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఇది ఇద్దరూ కలిసి చేసుకున్న ఆత్మహత్యా ప్రయత్నమా లేక హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నమా? మిస్టరీగా మారింది. ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసుల వివరాల ప్రకారం, భవాని (22) ఒక మొబైల్ షోరూమ్‌లో పనిచేస్తూ పశ్చిమ బెంగళూరులోని ఒక అద్దె ఇంట్లో నివసిస్తోంది. భవానీ, చంద్రశేఖర్ గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సుమారు ఏడాది క్రితం తమ కుటుంబాలకు తెలియకుండా వివాహం చేసుకున్నారు. అయితే చంద్రశేఖర్‌కు అప్పటికే పెళ్లయ్యి, ఆరేళ్ల కొడుకు కూడా ఉన్నాడు.
ఇన్‌స్టాగ్రామ్ స్టోరీతో వెలుగులోకి
జూన్ 13న భవాని ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఒక స్టోరీ పెట్టింది. హ్యాపీ యానివర్సరీ అంటూ చంద్రశేఖర్ కలిసి ఉన్న ఒక ఫోటో స్టోరీగా ప్రత్యక్షమైంది. తమ తొలిపెళ్లి రోజు సందర్భంగా చంద్రశేఖరే ఆ ఫోటోను అప్‌లోడ్ చేసినట్లు తెలుస్తోంది.
మరోవైపు భవాని కుటుంబ సభ్యులను ఈ పోస్ట్ అలర్ట్ చేసింది. అనుమానంతో వారు వరుసగా భవానికి ఫోన్లు చేయడం మొదలు పెట్టారు. ఎన్నిసార్లు చేసినా ఆమె ఎత్తకపోవడంతో అనుమానం వచ్చింది. అందోళనతో ఆమె తండ్రి ఇంటి యజమానికి సమాచారం అందించారు. యజమాని, చుట్టుపక్కల వారు వెళ్లి చూడగా ఇల్లు లోపలి నుంచి లాక్ చేసి ఉంది. తలుపులు బద్దలుకొట్టి లోపలికి వెళ్లగా భవాని మృతి చెంది ఉంది, చంద్రశేఖర్ అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడు. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు.
భవాని తండ్రి సమాచారం ప్రకారం, భవానికీ ఇటీవల పెళ్లి సంబంధాలు వెతకడం ప్రారంభించారు. వచ్చే వారమే నిశ్చితార్థం కూడా చేయాలని భావించారు. బహుశా ఈ విషయం భవాని చంద్రశేఖర్‌కు చెప్పడం వల్లే ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఇద్దరూ కలిసి విషం తాగి ఆత్మహత్య చేసుకుందామని చంద్రశేఖర్ ఆమెను ఒప్పించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే విషం తాగిన తర్వాత భవానికి వాంతులు అవ్వడంతో, చంద్రశేఖర్ ఆమె గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చని కూడా భావిస్తున్నారు. ఆ తర్వాత అతడు కూడా ఎక్కువ మొత్తంలో విషం తాగి ఉంటాడే అనేది ప్రాథమిక అంచనా.
ప్రస్తుతం చంద్రశేఖర్ కోలుకోవడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. భవాని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. ఫొరెన్సిక్, మెడికల్ రిపోర్టులు వస్తే తప్ప ఇది ముందే ప్లాన్ చేసి చేసిన హత్యా, లేక ఆత్మహత్యా ప్రయత్నం విఫలమై చేసిన హత్యా అనేది తెలిసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: 500 కి.మీ కేవలం మూడున్నర గంటల్లోనే..!


