నిరసనకారులను అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీసులు దూకుడుగా వ్యవహరించే దృశ్యాలు తరచూ కనిపిస్తుంటాయి. అంతెందుకు మన దేశంలోనూ మొన్నీమధ్య సీజేపీ, నిన్న ఈసీ వ్యతిరేక ఆందోళనల్లోనూ పోలీసులు–నిరసనకారుల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. ఇలాంటి సమయంలో ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఫ్రాన్స్‌లో విద్యార్థుల ఆందోళనలు ఉధృతమవుతున్న వేళ.. సెయింట్-డెనిస్ మేయర్ బల్లి బగయోకో పోలీసులకు, విద్యార్థులకు మధ్యలో నిలబడ్డారు. మంగళవారం పారిస్‌లో జరిగిన మార్చ్‌లో పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. ఆయన వారిని అడ్డుకుంటూ ‘స్టాప్.. స్టాప్’ అంటూ గట్టిగా అరిచారు. విద్యార్థులకు రక్షణగా నిలిచిన ఆయన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
‘నా పిల్లల లాంటివాళ్లు’
తాను విద్యార్థులకు మద్దతుగా నిలవడం తన బాధ్యతగా భావించానని బగయోకో చెప్పారు. “వీధుల్లో ఉన్న హైస్కూల్ విద్యార్థులు నా పిల్లల లాంటివాళ్లు. వారి పక్షాన నిలబడటం నా బాధ్యత” అని పేర్కొన్నారు. పోలీసులు విద్యార్థులపైకి దూసుకెళ్లాలని నిర్ణయించుకున్నారని.. వారిలో చాలామంది పోలీసులపై ఎలాంటి దూకుడు ప్రదర్శించలేదని ఆయన అన్నారు. చివరకు పోలీసులు విద్యార్థులతో పాటు తనపైనా టియర్ గ్యాస్ ప్రయోగించారని తెలిపారు.
This has to be the video of the year. Bally Bagayoko who is the mayor of French city Saint-Denis shouts at police to “Stop!” and protects the student protesters. https://t.co/XyXc7AUz6d
— Power to the People ☭🕊 (@ProudSocialist) October 6, 2026
అయితే పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణ కోసం పనిచేస్తుంటారని.. నిరసనకారులను నియంత్రించడం కూడా వారి విధుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో పోలీసులు తమ విధులు నిర్వర్తించకుండా అడ్డుకోవడం కూడా సరైన విధానం కాదనే చర్చ సాగుతోంది. మేయర్ ఉద్దేశం విద్యార్థులకు రక్షణ కల్పించడమే అయినప్పటికీ.. పోలీసుల విధుల్లో జోక్యం చేసుకోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
బల్లి బగయోకో ఎవరు?
బల్లి బగయోకో (52) మాలీ మూలాలున్న కుటుంబంలో జన్మించి సెయింట్-డెనిస్‌లో పెరిగారు. రవాణా సంస్థ ఆర్‌ఏటీపీలో ఉద్యోగిగా పనిచేస్తూనే.. బాస్కెట్‌బాల్ కోచ్‌గా, సామాజిక కార్యకర్తగా స్థానికంగా గుర్తింపు తెచ్చుకున్నారు. 2001లో రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. డిప్యూటీ మేయర్, ప్రాంతీయ రాజకీయ నేతగా పనిచేశారు. 2026 మార్చిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో 50.77 శాతం ఓట్లతో సెయింట్-డెనిస్ మేయర్‌గా ఎన్నికయ్యారు. వామపక్ష పార్టీ ‘లా ఫ్రాన్స్ ఇన్‌సూమిస్’ (LFI)కు చెందిన బగయోకో.. విద్య, సామాజిక సమానత్వం వంటి అంశాలపై గళమెత్తుతున్నారు. ఆయనకు నలుగురు పిల్లలు.
రెండు వారాలుగా ఆందోళనలు
ఫ్రాన్స్‌లో రెండు వారాలకు పైగా విద్యార్థుల నిరసనలు కొనసాగుతున్నాయి. కిక్కిరిసిన, సౌకర్యాలు లేని తరగతి గదులు, ఉపాధ్యాయుల కొరత, విద్యలో అసమాన అవకాశాలను నిరసిస్తూ విద్యార్థులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు పలు ప్రాంతాలకు విస్తరించడంతో వేలాది మందిని పోలీసులు అరెస్టు చేశారు. మరోవైపు పాఠశాలల ధ్వంసం, పోలీసులపై దాడుల వంటి ఘటనలు కూడా చోటుచేసుకున్నాయని అధికారులు చెబుతున్నారు.
15 ఏళ్ల విద్యార్థి చేయి పోవడంతో..
నిరసనల సమయంలో 15 ఏళ్ల విద్యార్థి చేయి కోల్పోయిన ఘటన పోలీసుల చర్యలపై తీవ్ర విమర్శలకు దారితీసింది. లెన్స్ నగరంలో పోలీసుల గ్రెనేడ్ పేలడంతో బాలుడి చేయి తెగిపోయింది. దీంతో విద్యార్థుల నిరసనల్లో స్టన్ గ్రెనేడ్ల వినియోగాన్ని ఫ్రాన్స్ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కూడా కొనసాగుతోంది.
డిమాండ్లపై ప్రభుత్వం స్పందన
మరోవైపు విద్యార్థుల డిమాండ్లను పరిశీలించి అక్టోబర్ చివరినాటికి ప్రతిపాదనలు వెల్లడిస్తామని ఫ్రాన్స్ ప్రధాని సెబాస్టియన్ లెకోర్ను తెలిపారు. అయితే నిరసనలు మాత్రం కొనసాగుతున్నాయి. విద్యార్థులకు మద్దతుగా నిలిచిన మేయర్ బగయోకో వీడియో ఇప్పుడు ఈ ఆందోళనల్లో పోలీసుల తీరుపై జరుగుతున్న చర్చకు మరింత ప్రాధాన్యం తెచ్చింది.
ఇదీ చదవండి: రాహుల్ గాంధీ ధర్నాలో పోలీసులపై దాడి!


