ఢిల్లీలో ఈసీ వ్యతిరేక ర్యాలీ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలో హైడ్రామా చోటుచేసుకుంది. నిరసనకారులను అదుపు చేసే విధుల్లో ఉన్న ఓ కానిస్టేబుల్‌పై కొందరు ఆందోళనకారులు దాడి చేశారని ఆరోపణలు వెల్లువెత్తాయి. తనను చుట్టుముట్టి కొట్టారని, యూనిఫాం చింపేశారని, గోళ్లతో గీశారని, చేతిని కొరికారని కానిస్టేబుల్ అంకిత్ కసానా ఆరోపించారు. ఘటన అనంతరం ఆయనను వైద్య పరీక్షల కోసం ఢిల్లీలోని రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రికి తరలించారు.
పార్లమెంట్ పోలీస్‌లో పనిచేస్తున్న కసానా.. బుధవారం జంతర్ మంతర్ సమీపంలో విధులు నిర్వహిస్తున్నారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి ఎంపీలు చేపట్టిన ఆకస్మిక నిరసన సందర్భంగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకునే సమయంలో తనను సుమారు 30–35 మంది చుట్టుముట్టారని కసానా తెలిపారు.
వారిలో పురుషులు, మహిళలు, వృద్ధులు కూడా ఉన్నారని.. తనపై దుర్భాషలాడుతూ యూనిఫాం చింపేశారని ఆరోపించారు. వెనుక నుంచి లాగి గోళ్లతో గీశారని, ఓ వ్యక్తి తన చేతిని కొరికి చర్మాన్ని చీల్చాడని పేర్కొన్నారు.
Opposition flashing the constitution for every thing & then treating the people who uphold the constitution like this ? Const. Ankit Kumar claims & shows how he was bit , his uniform torn , nails scratched on him - all because he was doing his duty ! https://t.co/ere1de01Cz
— ExtraSpiceAni (@ShrivastavAni) October 7, 2026
‘దయచేసి వదిలేయండి’ అంటూ వేడుకున్నా..
ఘటనతో తాను భయపడిపోయానని కసానా తెలిపారు. తనను వదిలేయాలని పదేపదే వేడుకున్నానని చెప్పారు. పరిస్థితి మరింత తీవ్రంగా మారకముందే తన తోటి సిబ్బంది వచ్చి తనను అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారని వివరించారు. లేదంటే పరిస్థితి మరింత ప్రమాదకరంగా ఉండేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటన తనతో పాటు తన కుటుంబ భద్రతపై కూడా ఆందోళన కలిగించిందన్నారు.
సీజేపీ టైంలోనూ ఇబ్బందులే..
నిరసనల్లో విధులు నిర్వహించే పోలీసులే కొన్నిసార్లు ఆందోళనకారుల ఆగ్రహానికి గురవుతున్నారని కసానా అన్నారు. గతంలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిరసన సమయంలోనూ పోలీసులతో దురుసుగా ప్రవర్తించిన ఘటనను తాను ఎదుర్కొన్నట్లు తెలిపారు. శాంతిభద్రతలను కాపాడటం పోలీసుల బాధ్యత అయినప్పటికీ.. విధుల్లో ఉన్న సిబ్బంది కూడా ఇలాంటి ఘటనలకు గురవుతున్నారని పేర్కొన్నారు.

Photo Credits: Aaj Tak
వైద్య పరీక్షల తర్వాత ఎఫ్‌ఐఆర్?
దాడి ఆరోపణల నేపథ్యంలో కసానాకు రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఘటనపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై ఢిల్లీ పోలీసులు అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడించాల్సి ఉంది. మరోవైపు దాడికి పాల్పడ్డారని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిరసనకారుల స్పందన కూడా ఇంకా వెలువడలేదు.
రాహుల్ గాంధీని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న సమయంలోనే ఈ ఘటన జరిగినట్లు కానిస్టేబుల్ ఆరోపించడంతో.. జంతర్ మంతర్ వద్ద నిరసనల సందర్భంగా నెలకొన్న ఉద్రిక్తత మరోసారి చర్చనీయాంశమైంది.
ఇదీ చదవండి: ఓట్ల గల్లంతుపై మెరుపు ధర్నా


