రెండో రోజూ అనూహ్యంగా మొదలైన ‘సీఈసీ రాజీనామా డిమాండ్’ ఉద్యమం
మధ్యాహ్న భోజనం కోసం గుమిగూడి హఠాత్తుగా జంతర్‌మంతర్ దిశగా కదిలిన విపక్ష ఎంపీలు
మార్గమధ్యంలో బస్సులను ఆపేసి నేతలను కిందకు దించేసిన పోలీసులు
అక్కడే బైఠాయించి ధర్నా మొదలెట్టిన ఎంపీలు
పోలీసులతో వాగ్వాదం నడిరోడ్డుపై పడకుని ధర్నా కొనసాగించిన ప్రియాంకా గాంధీ
రక్షణగా నిలబడిన రాహుల్ గాం«దీని బలవంతంగా నెట్టేసిన పోలీసులు
బస్సు ఎక్కకుండా తీవ్రంగా ప్రతిఘటించిన నేతలు
రాహుల్‌ను బలవంతంగా బస్సులోకి తోసేసిన పోలీసులు
వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు నేతల తరలింపు... తర్వాత విడుదల
ఉద్రిక్తంగా కొనసాగిన విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీల ధర్నా
జ్ఞానేశ్ ఆచూకీ ఎక్కడ? మోదీ ఒడిలో అంటూ వ్యంగ్య నినాదాలు చేసిన కార్యకర్తలు
ధర్నాను డ్రామాగా అభివర్ణించిన బీజేపీ
జ్ఞానేశ్ రాజీనామా చేసేదాకా నిరసనలు కొనసాగుతాయన్న విపక్ష పార్టీలు
న్యూఢిల్లీ: కోట్ల ఓట్ల గల్లంతులో కీలకపాత్ర పోషించిన ప్రధాన ఎన్నికల కమిషనర్(సీఈసీ) తన పదవికి రాజీనామా చేసేదాకా ఉద్యమాగ్ని మరింత రగులుతుందని స్పష్టంచేసిన విపక్షాల ‘ఇండియా’ కూటమి పార్టీలు ఢిల్లీలో 24 గంటలు గడిచేలోపు మరోమారు మెరుపుధర్నా పట్టారు.
మంగళవారం ఆద్యంతం ఉద్రిక్తంగా కొనసాగిన ఉద్యమంలో స్వయంగా పాల్గొని, నినదించి, అరెస్టయిన మిత్రపక్షాల ఎంపీలను అభినందిస్తూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే ఇచ్చిన మధ్యాహ్న విందు కాస్తా అనూహ్యంగా జంతర్‌మంతర్ ధర్నాస్థలికి ర్యాలీగా మారడం, మధ్యలోనే పోలీసులు అడ్డుకుని ఎంపీలను బస్సుల నుంచి దించేయడం, ఎంపీలు అక్కడే బైఠాయించి ధర్నాకు దిగడం, పోలీసులు, ఎంపీల మధ్య వాగ్వాదం, తోపులాట, బలవంతంగా అరెస్ట్‌లతో బుధవారం మధ్యాహ్నం నుంచి రాత్రిదాకా ఉద్యమం నాటకీయ పరిణామాల మధ్య కొనసాగింది.
తమ ముఖ్యనేతల విడుదలతో విపక్షపార్టీల కార్యకర్తలు రాత్రిపూట శాంతించారు. అయినాసరే ఉద్యమం మరికొత్త పంథాలో మరింత ఉధృతంగా కొనసాగనుందని ప్రధాన పార్టీలు ప్రకటించాయి.
చక్కటి భోజనంతో మొదలై...
ఉద్యమంలో మమేకమైన మిత్రపక్షాల ఎంపీలందర్నీ భోజనానికి రావాల్సిందిగా బుధవారం మధ్యాహ్నం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆహ్వానించారు. దీంతో సెంట్రల్ ఢిల్లీ జన్‌పథ్ ప్రాంతంలోని సాగర్‌రత్న రెస్టారెంట్‌కు 200 మందికిపైగా ఎంపీలు వచ్చి అందరూ శాఖాహార భోజనం పూర్తిచేశారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మొదలు ప్రియాంక గాంధీ సహా ఆర్జేడీ, టీఎంసీ, సీపీఎం, సీపీఐ, ఇండియన్ ముస్లిం లీగ్ దాకా పలు విపక్ష పార్టీల ఎంపీలు రెస్టారెంట్‌కు వచ్చారు.
భోజనం పూర్తికాగానే ఖర్గే మీడియాతో మాట్లాడారు. ‘‘ఇది భోజన భేటీకాదు ఉద్యమభేటీ. మేం ఇప్పుడు నేరుగా జంత్‌మంతర్‌కు వెళ్లి సీఈసీ జ్ఞానేశ్ రాజీనామా డిమాండ్‌తో ఉద్యమించనున్నాం’’ అని ప్రకటించారు. వెంటనే ఎంపీలంతా అప్పటికే సిద్ధంచేసిన బస్సుల్లోకి ఎక్కి నేరుగా జంతర్‌మంతర్‌కు బయల్దేరారు. మరోమారు విపక్ష ఎంపీలు నిర్వాచన్ సదన్‌కు ధర్నా కోసం రావొచ్చనే ముందస్తు అంచనాతో పోలీసులు సెంట్రల్ ఢిల్లీలో కీలక ప్రాంతాల్లో 163వ సెక్షన్ అమల్లోకి తెచ్చారు.
కాంగ్రెస్ ఎంపీలు అమరీందర్ సింగ్ రాజా వారింగ్, దీపేందర్ హూడా, ఇమ్రాన్ ప్రతాప్‌గఢీ, ఇమ్రాన్ మసూద్, సేవాదళ్ చీఫ్ బీవీ శ్రీనివాస్‌లు బస్సులపైకెక్కి త్రివర్ణ పతాకం చేతబూని సీఈసీ, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలుచేశారు. ‘‘జ్ఞానేశ్ ఆచూకీ ఎక్కడ? మోదీ ఒడిలో’ అని వ్యంగ్య నినాదాలు సైతం చేశారు. నేతల బస్సులను కార్యకర్తల వాహనాలూ అనుసరించాయి. నేతల బస్సులు ఒక కిలోమీటర్ ప్రయాణించాక అశోక్ రోడ్డులోని షాంగ్రీ–లా హోటల్ వద్ద పోలీసులు అడ్డగించి నేతలను బలవంతంగా కిందకు దించేశారు. దీంతో ఆగ్రహంతో నేతలంతా రోడ్డుపై బైఠాయించి ధర్నా ఆరంభించారు.
తీవ్ర వాగ్వాదం.. తోపులాట...
బైఠాయించిన నేతలకు మద్దతుదారులు, కార్యకర్తలు తోడవడంతో నడిరోడ్డు హఠాత్తుగా ధర్నాస్థలిగా మారిపోయింది. కార్యకర్తల నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. వెంటనే పోలీసులు నేతలను బలవంతంగా పక్కకు లాగేసేందుకు ప్రయత్నించారు. ఇంతలో ప్రియాంకా గాంధీ సహా పలువురు మహిళా ఎంపీలు నేలపై పడుకుని రాజ్యాంగ ప్రతిని చేతబూని అంతా కలిసి నినదించారు. వీళ్లను మహిళా పోలీసులు లాగేసేందుకు ప్రయత్నించారు.
ఈ క్రమంలో తన ఒళ్లంతా గోళ్లు గీసుకుపోయిన గాయాలయ్యాయని ప్రియాంక ఆరోపించారు. ‘‘పార్లమెంట్ సభ్యులతో ప్రవర్తించే తీరు ఇదేనా? ఎంపీలను తోసి కిందపడేస్తారా? మీ పోలీస్‌బలగాలు వెనక్కి వెళ్లేదాకా మేం ఇక్కడి నుంచి లేవబోం. ఎంపీలను ఈడ్చిపడేస్తారా? కొడతారా?’’ అని ప్రియాంక ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు తమతో వెటకారంగా మాట్లాడారని తర్వాత ప్రియాంక ఆరోపించారు.
తీవ్రంగా ప్రతిఘటించిన రాహుల్ గాంధీ..
పక్కనే ఉన్న రాహుల్ గాంధీ, ఇతర ఎంపీలు సైతం పోలీసులతో వాగ్వాదానికి దిగారు. నేతలను బస్సుల్లోకి ఎక్కించి తీసుకెళ్లకుండా కార్యకర్తలు రెండు బస్సుల టైర్ల గాలి తీసేశారు. దీంతో పోలీసులు, నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అయినాసరే పోలీసులు రాహుల్‌ను భుజాలపై పైకెత్తి బస్సులోకి నెట్టేశారు. తీవ్రంగా ప్రతిఘటించినా లాభంలేకుండా పోయింది.
రాహుల్ ఉన్న వాహనం ముందుకెళ్లకుండా అమరీందర్, ఉదయ్‌భాను చిబ్ బస్సు పైకెక్కారు. ముంతాజ్ పటేల్ బస్సు బానెట్ ఎక్కారు. తర్వాత వీళ్లందర్నీ పక్కకు నెట్టేసి బస్సు వేగంగా బరాఖంబా రోడ్ పోలీస్‌స్టేషన్ వైపు దూసుకెళ్లింది. ‘‘దేశంలోనే అత్యంత తీవ్రమైన అంశంపై జరుగుతున్న పోరాటమిది. మా పోరును ఆపటం మోదీ, షా తరం కాదు. మోదీ, షా, ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ భాగవత్, జ్ఞానేశ్‌లను చట్టం ముందు నిలబెడతాం’’అని బస్సులో రాహుల్ అన్నారు.
ప్రియాంకను సైతం పోలీసులు వేరే వాహనంలోకి ఎక్కించి ఛాత్రాసాల్ స్టేడియంకు తరలించారు. వాహనం ఎక్కాక ప్రియాంక ‘‘దేశం రాజ్యాంగం ప్రకారమే నడవాలి. ఈ రాజ్యాంగ రక్షణ కోసం ప్రాణాలైనా ఇస్తాం’’ అని అన్నారు. టీఎంసీ ఎంపీ డిరెక్ ఓబ్రియాన్, ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా తదితర ఎంపీలందర్నీ నిర్బంధించి వేర్వేరు పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఈ అనూహ్య ధర్నా దాదాపు మూడు గంటలపాటు కొనసాగింది. అరెస్టయిన రెండు గంటల తర్వాత తొలుత రాహుల్‌గాం«దీని విడుదలచేయగా కొంత సమయానికి ఛాత్రాసాల్ స్టేడియం నుంచి ప్రియాంకను విడిచిపెట్టారు.
100 ఎఫ్‌ఐఆర్‌లే లక్ష్యం...
మెరుపు ధర్నాకు ముందు మీడియాతో రాహుల్ మాట్లాడారు. ‘‘మోదీ ప్రజావ్యతిరేక పరిపాలనను తప్పుబడుతూ నేను ఉద్యమించిన ప్రతిసారీ నాపై ఎఫ్‌ఐఆర్ నమోదుచేస్తున్నారు. తాజాగా అవి 45కు పెరిగాయి. 100 కేసులే నా లక్ష్యం. వంద దాటాకా కూడా నా పోరాటం కొనసాగుతుంది. ప్రతి ఎఫ్‌ఐఆర్‌ను ఛాతీపై ధరించే మెడల్‌గా భావిస్తా. జ్ఞానేశ్ సీఈసీ పదవి నుంచి దిగిపోయేదాకా విపక్షాల ఉద్యమం ఆగదు. మొదట్నుంచీ మాకు మద్దతిస్తూ ఉద్యమంలో మమేకమై, అరెస్టయిన ఎంపీలకు నా అభినందనలు, కృతజ్ఞతలు’’ అని అన్నారు.
విమర్శించిన బీజేపీ...
పలు రాష్ట్రాల్లో వరసబెట్టి ఓడిపోయిన విపక్ష పార్టీలు చివరకు చేసేదేమీలేక ఎస్‌ఐఆర్ ప్రక్రియ మాటున ఎంతో కొంత మీడియాలో ప్రచారం పొందేందుకు ఇలా వీధినాటకాలు ఆరంభించాయని బీజేపీ విమర్శించింది. ‘‘మంగళవారమే వాళ్లతో నిబంధనమేరకే భేటీకి ఈసీ ముందుకొచ్చింది. కానీ తమ వారసత్వ రాజకీయాలను ఢిల్లీ వీధుల్లో చూపించేందుకు రాహుల్, ప్రియాంక ద్వయం ఎలక్షన్ కమిషనర్లతో సమావేశాలకు ముందుకు రాలేదు.
రాజ్యాంగ హక్కుల కంటే వీళ్లకు రాజకీయ లబ్ధే ప్రధానం’’ అని బీజేపీ అధికార ప్రతినిధి సుధాన్షు త్రివేది ఆరోపించారు. అసాంఘిక శక్తులతో రాహుల్ కలిసిపోయారని బీజేపీ చీఫ్ నితిన్ నబీన్ అన్నారు. మరోవైపు తోపులాట వేళ మహిళా పోలీసులతో కొందరు కార్యకర్తలు అసభ్యంగా ప్రవర్తించారనే ఆరోపణలపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. ఘటనాస్థలిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
అంకిత్ అనే కానిస్టేబుల్ యూనిఫామ్ చింపేసిమరీ కొట్టడంతో అతనికి సమీప ఆర్‌ఎంఎల్ ఆస్పత్రిలో చికిత్సనందిస్తున్నారు. పలువురు ఎంపీలుసహా 91 మందిని పోలీసులు అరెస్ట్‌చేసి తర్వాత వదిలేశారు. గురువారం సైతం ఉద్యమం కొనసాగే సూచనలు ఉన్నాయని విపక్ష పార్టీల కీలక నేతలు సూచనప్రాయంగా తెలిపారు. ఇది పార్టీలకతీతంగా జరుగుతున్న ఉద్యమం అని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో ఢిల్లీలో పోలీసుల మోహరింపు రోజురోజుకూ పెరుగుతోంది. అయితే బుధవారం ధర్నాలో ఎస్పీ, శివసేన(యూబీటీ), శరద్‌పవార్ సారథ్యంలోని ఎన్సీపీ–ఎస్పీ ఎంపీలు పాల్గొనలేదు.


