అభిప్రాయం
అబద్ధాన్ని బిగ్గరగా, పదేపదే చెబితే, అదే నిజమని ప్రజలు నమ్ముతారనే జోసెఫ్ గోబెల్స్ (హిట్లర్ అనుచరుడు) సిద్ధాంతం మీద నమ్మకం ఉన్న వ్యక్తి చంద్రబాబు. ప్రజలకు ఏదీ గుర్తుండదని ఆయన నమ్మకం. అందుకే రెండేళ్లుగా ఆంధ్ర ప్రదేశ్‌కు గ్రహణం పట్టినా, పండు వెన్నెల కురుస్తోంది, సంబరాలు చేసుకోమంటు న్నాడు. కానీ జనం జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్నారు. సంక్షేమమే ఆయన అజెండా, విశ్వసనీయత వైసీపీ జెండా. దీనికి నిదర్శనం ఆయన చేసిన అభివృద్ధి. సంఖ్య లెప్పుడూ అబద్ధం చెప్పవు. ప్రపంచంలో ఎక్కడికెళ్లినా రెండు రెళ్లు నాలుగే. ఆయన హయాంలో నేరుగా నగదు లబ్ధి పొందినవారి సంఖ్య 8,70,06,898. 2 లక్షల 73 వేల 756 కోట్ల రూపాయల నగదు నేరుగా అకౌంట్లలోకి చేరింది. నాన్ డీబీటీ ద్వారా 1,84,604 కోట్ల రూపాయిలు అందింది. మొత్తం ఐదేళ్లలో ప్రజలకు అందిన లబ్ధి 4 లక్షల 58 వేల 360 కోట్లు.
అంకెలు చెప్పే నిజాలు
మరి చంద్రబాబు సూపర్ బుస్సు హామీల గురించి మాట్లాడు కుందాం. ఎన్నికల ప్రచారంలో బాబు ష్యూరిటీ – భవిష్యత్‌కు గ్యారెంటీ అని బాండ్లు కూడా ఇచ్చారు. జూన్ 2024 నుంచి ప్రారంభం అన్నారు. 2026 కూడా వచ్చింది. ఇచ్చారా? చంద్ర బాబులో ఒక గజిని, అపరిచితుడు ఉంటారు. చంద్రబాబు కంటే గారడీ మనిషి మేలు. కనీసం గాల్లోంచి పావురమైనా తీస్తాడు. అదే బాబు అయితే పావురాన్ని ఊహించుకోమంటారు. బాబు సూపర్ ట్రిక్స్ గురించి చెప్పాలంటే: 1. ఆడబిడ్డ నిధి– ఆడపడుచుల్ని ఆదరించి గౌరవించడం తెలుగువారి సంస్కృతి. ఈ పథకానికి అతీగతీ లేదు. రెండేళ్లకు గానూ, ఆడబిడ్డలు ఒక్కొక్కరికి 36 వేలు బాకీ. 2. నిరుద్యోగ భృతి– నిరుద్యోగులకు నిండా మోసం. ఒక్కొక్క రికీ రూ.72 వేలు బాకీ. 3. యాభై ఏళ్లకే పెన్షన్– బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలు ఎన్నేళ్లు ఎదురు చూసినా టెన్షనే.4. తల్లికి వందనం– ఫస్ట్ ఇయర్ మోసం. సెకండ్ ఇయర్ 20 లక్షల మంది కోత. 5. ఉచిత బస్సు– ఐదు సర్వీసులకే పరిమితం. 6. దీపం– ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు, సగం పథకం గ్యాసే. 7. అన్నదాత సుఖీభవ – రైతుకు దుఃఖీభవ అయ్యింది. ఇచ్చింది రూ. 14 వేలు. బాకీ రూ. 26 వేలు.
రెండేళ్లలో అన్ని రంగాలను నాశనం చేశారు. విద్యా వ్యవస్థను బాగు చేశామని ఆ శాఖ మంత్రి నారా లోకేశ్ చెబుతున్నారు. తండ్రికి తగ్గ తనయుడు. జగన్ హయాంలో ‘నాడు–నేడు’ కింద వేల స్కూళ్లు బాగుపడ్డాయి. పనులు పూర్తయ్యే స్థితిలో ఉన్న 22 వేల స్కూళ్లను గాలికి వదిలేశారు. ‘తల్లికి వందనం’ కింద రూ. 13 వేల కోట్లకు పైగా ఇవ్వాల్సి ఉండగా ఇచ్చింది రూ. 8,389 కోట్లు. విద్యా దీవెన, వసతి దీవెనలను నిర్వీర్యం చేశారు. ‘గోరుముద్ద’ను ఘోరం చేసి పిల్లల్ని ఆస్పత్రులపాలు చే శారు. విద్యను వ్యాపారంగా మార్చిన వాళ్లని మంత్రులుగా పెట్టుకున్న తర్వాత ప్రభుత్వ స్కూళ్లు బతుకుతాయా?
రెండేళ్లలో వైద్యం రోగగ్రస్థమైంది. ఆరోగ్యశ్రీకి రూ. 3,746 కోట్ల బకాయి పెట్టి పేద ప్రజల్ని అన్యాయం చేశారు. ఆరోగ్య ఆసరా పథకాన్ని రద్దు చేశారు. జగన్ హయాంలో 17 మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు చేస్తే, అందులో 11 కాలేజీలను ప్రైవేట్‌కు అమ్మేస్తున్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో 562 మందులు లభ్యమైతే, ఇప్పుడు ఒక్క మందు బిళ్ల కూడా దొరకని స్థితి. పల్లె ప్రజల కోసం ‘ఫ్యామిలీ డాక్టర్’ను ప్రవేశ పెడితే అది అందకుండా చేశారు. ఒక జాతి బలంగా ఉండాలంటే విద్య, వైద్యం పటిష్ఠంగా ఉండాలి. కానీ కూటమి ప్రభుత్వం ఆ రెండింటినీ ప్రైవేట్‌కు అమ్మేస్తోంది.
ఏ వర్గం బాగుపడిందని!
ఎన్టీఆర్ మహానటుడు. ఆయనకి తెలియకుండానే మహా నటుణ్ణి అల్లుడిగా తెచ్చుకున్నారు. ఎన్టీఆర్ తెరమీద నటిస్తే, చంద్ర బాబు ఎడతెరపి లేకుండా నటిస్తారు. దీనికి ఉదాహరణ వ్యవ సాయం దండగ అని ఒకప్పుడు చెప్పిన బాబు, ఎన్నికలకు ముందు రైతన్నలపై అంతులేని ప్రేమ కురిపించారు. కేంద్రంతో సంబంధం లేకుండా 20 వేలు ఇస్తానని, రెండేళ్లకు 26 వేలు నామం పెట్టారు. ఉచిత బీమా పథకం పోయింది. 1,100 కోట్లు ఇన్ ఫుట్ సబ్సిడీ పాయె. రైతు భరోసా కేంద్రాలు నాశనం. యూరియా కోసం రెతులు కొట్టుకున్నారు. పొగాకు, పత్తి, అరటి, మామిడి ఇలా ప్రతి రైతూ రోడ్డెక్కారు. ఎక్కడ చూసినా దళారులే. ఈ–క్రాప్ వ్యవస్థ నిర్వీర్యం. ప్రభుత్వ లెక్కల ప్రకారమే 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్య చేసుకున్నారు.
మహిళలకు చంద్రబాబు ప్రభుత్వం చేసిన అన్యాయం అంతా ఇంతా కాదు. ‘ఆసరా’, ‘చేయూత’, ‘కాపు నేస్తం’, ‘ఈబీసీ నేస్తం’ పథకాలు నిలిపివేశారు. ‘దిశ’ కార్యక్రమాన్ని రద్దు చేశారు. పేదలకు ఇచ్చే ‘వైఎస్సార్ పెళ్లి కానుక’ ఆగిపోయింది. ఐదేళ్లలో జగన్ 31.19 లక్షల ఇళ్ల పట్టాలు అక్కచెల్లెమ్మలకు ఇచ్చారు. యువకులకు జాబ్ క్యాలెండర్ గాలికి పోయింది. డీఎస్సీలో అవకతవకలు జరిగాయి. వాలంటీర్లు మునిగిపోయారు. రేషన్ వాహనాల రద్దుతో 18 వేల మంది రోడ్డున పడ్డారు. చివరికి ఉద్యోగుల్ని కూడా మోసం చేశారు. ఒక రూపాయి ఐఆర్ కూడా ఇవ్వలేదు. ఐదు డీఏలు పెండింగ్. జీపీఎస్, ఓపీఎస్ ఔట్. పీఆర్సీ అడ్రస్ లేదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 35 వేల కోట్లు బాకీ. కూటమి ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క వర్గం ప్రశాంతంగా లేదు. ప్రశ్నిస్తే అరెస్ట్‌లు చేస్తారు. రెడ్‌బుక్ అంటారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, జర్నలిస్టులు, సోషల్ మీడియా యాక్టివిస్టులు ఎవరూ మినహాయింపు కాదు. దళితులకు రక్షణ లేదు. మహిళలు, చిన్నారు లకు రక్షణ లేదు. అయినా తమ ప్రభుత్వం అద్భుతాలు చేసిందని చెప్పుకుంటున్నారు. జనం రెండేళ్లు సంబరాలు చేసుకోవాలని అంటున్నారు.
ఏం సాధించారని!
జగన్ మళ్లీ వస్తారని వాళ్లకు తెలుసు. అందుకే భయం. జగన్నామ స్మరణ. జనాన్ని తప్పుదారి పట్టించడానికి మా పార్టీని గొడ్డలి పార్టీగా పిలుస్తున్నారు. గొడ్డలి ముద్రతో జనంలో భయం పుట్టించాలని వాళ్ళ ప్రయత్నం. వేళ్లు కుళ్లి పోయిన తెలుగుదేశం పార్టీ వృక్షాన్ని కూల్చాలంటే గొడ్డలి చాలా అవసరం. గొడ్డలి అంటే వాళ్ళకు భయం. కానీ చెడుని కూల్చే ఆయుధం మాకు. రెండేళ్లలో మీరు సాధించిన అభివృద్ధి 3.48 లక్షల కోట్ల అప్పు. ఇక మీ ఎమ్మెల్యేలు సరిహద్దులు నిర్ణయించి కప్పం వసూళ్లు చేస్తు న్నారు. కాంట్రాక్ట్ పనుల కోసం కొట్టుకుంటున్నారు. లిక్కర్ సిండి కేట్ నడిపిస్తున్నారు. చివరికి చికెన్ షాపుల వద్ద కూడా వసూళ్లు చేస్తున్నారు. సంపద సృష్టిస్తానని చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. తీరా చూస్తే రాష్ట్రానికి సంపదే లేకుండా చేశారు. పిల్లల్ని కనండి, వాళ్లే మన సంపద అని చిట్కాలు చెబుతున్నారు. టీడీపీ అంటే ఎన్టీఆర్ హయాంలో తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు టీడీపీ అంటే తెలుగు దొంగల పార్టీ లేదా తెలివిగా దోచుకునే పార్టీ. చీకటి ఎల్లకాలం ఉండదు. తమసోమా జ్యోతిర్గమయ.
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త తిరుపతి మాజీ శాసనసభ్యులు


