సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది! | Changing Landscape of Tech Jobs What Software Engineers Need to Know in 2025 | Sakshi
Sakshi News home page

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లూ.. ఆ జమానా ముగిసింది!

Jun 16 2025 7:36 PM | Updated on Jun 16 2025 8:27 PM

Changing Landscape of Tech Jobs What Software Engineers Need to Know in 2025

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు ఒకప్పుడు మంచి డిమాండ్‌ ఉండేది. వారిని నియమించుకునేందుకు మల్టీ నేషనల్‌ కంపెనీలు భారీ జీతాలు, ఆకట్టుకునే సౌకర్యాలతో వెంటపడేవి. ఇప్పుడా జమానా ముగిసింది. టెక్ పరిశ్రమలో జీతాల పెరుగుదల, పెద్దమొత్తం నియామక ప్రక్రియలు తగ్గుతున్నాయి. 2025లో సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ ఉద్యోగాలు అనేక మార్పులను ఎదుర్కొంటున్నాయి. ఇవి ఆటోమేషన్, కొత్త వేతన ధోరణులు, కార్యాలయంలో మారుతున్న దృక్పథాలను ప్రతిబింబిస్తున్నాయి.  

ఏఐ రాకతో సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్‌లో మార్పులు
సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్ల ముఖ్యమైన పని అయిన కంప్యూటర్‌ ప్రోగ్రామింగ్‌ అంటే కోడ్ రాయడాన్ని కృత్రిమ మేధస్సు (AI) పూర్తిగా మార్చుతోంది. గిట్‌హబ్‌ కోపైలట్‌, కర్సర్‌చాట్‌ వంటి టూల్స్ ద్వారా ఎటువంటి అధునాతన కోడింగ్ నైపుణ్యాలు లేకుండానే ప్రోగ్రామింగ్ చేయడం సాధ్యమవుతోంది. అంటే సాధారణ టెక్ట్స్‌ ప్రాంప్ట్‌ ఇస్తే చాలు ఎలాంటి కోడ్‌ అయినా చిటికెలో వచ్చేస్తోంది. దీన్నే "వైబ్ కోడింగ్" అని పిలుస్తున్నారు.

పెరుగుతున్న సైలెంట్ లేఆఫ్స్   
సిలికాన్‌ వ్యాలీకి చెందిన టాప్‌ సంస్థల దగ్గర నుంచి భారతీయ ఐటీ కంపెనీల వరకూ అన్నీ ఉద్యోగుల సంఖ్యను క్రమంగా తగ్గించుకుంటున్నాయి. కంపెనీలు గతంలో లాగా ఒకేసారి పెద్ద సంఖ్యలో జాబ్‌లకు కోతలు పెట్టడం లేదు. బదులుగా  ‘సైలెంట్ లేఆఫ్స్’ విధానాన్ని అమలు చేస్తున్నాయి. అంటే ఉద్యోగులకు అనువైన వాతావరణాన్ని కల్పించి వారితో స్వచ్ఛందంగా రాజీనామా చేయించడం ద్వారా వదిలించుకుంటున్నాయి.

 

ఆ స్థాయిలో జీతాల పెరుగుదల లేదు
టెక్ రంగంలో వేతనాలు ఇంకా ఎక్కువగానే ఉన్నప్పటికీ, గతంలో మాదిరిగా తక్కువ కాలంలోనే వేగంగా వేతనాలు పెరిగినట్లు ఇప్పుడు పెరగడం లేదు. ఒక ఉద్యోగాన్ని విడిచి మరొక ఉద్యోగం పొందడం ద్వారా ఎక్కువ జీతం పొందే అవకాశాలు తగ్గిపోయాయి. అయితే ఏఐ, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ వంటి హై-డిమాండ్ నైపుణ్యాలు ఉన్నవారు ఇంకా గణనీయమైన వేతనాలను పొందుతున్నారు.

 

వ్యూహాత్మక దృక్పథం అవసరం  
కొత్త ఉద్యోగానికి మారడం అనుకున్నంత మంచిది కాకపోవచ్చు. ఇప్పుడు ఉద్యోగం మారడానికి ముందుగా స్థిరత, ప్రయోజనాలు, దీర్ఘకాలిక వృద్ధి అవకాశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. 2025లో ఆటోమేషన్, వేతన ధోరణులు, ఉద్యోగ మార్పులను అర్థం చేసుకున్న వారు మాత్రమే ఏఐ నైపుణ్యం, డిజిటల్ అనుసంధానం, ప్రత్యేక నైపుణ్యాలను పెంచుకుంటూ విజయవంతం అవ్వగలరు.

👉 ఇది చదివారా? ఈ టెక్‌ దిగ్గజంలో తొలగింపులు

Advertisement
 
Advertisement
Advertisement