‘వైద్యాన్ని ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం’ | YSRCP Leader Gopireddy Srinivasa Reddy Slams Chandrababu Govt | Sakshi
Sakshi News home page

‘వైద్యాన్ని ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం’

Apr 8 2025 5:37 PM | Updated on Apr 8 2025 5:49 PM

YSRCP Leader Gopireddy Srinivasa Reddy Slams Chandrababu Govt

తాడేపల్లి : చంద్రబాబు ప్రభుత్వం ఆరోగ్యశ్రీని కొనసాగించాలని అనుకుంటుందా.. ఆపేస్తారా సమాధానం చెప్పాలని మాజీ ఎమ్మెల్యే,  వైఎస్సార్ సీపీ నేత  గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్ చేశారు. ఆరోగ్యశ్రీని పక్కన పెట్టి ఇన్స్యూరెన్స్ కంపెనీలకు కట్టబెట్టాలని చూస్తోందని గోపిరెడ్డి విమర్శించారు. అందుకే నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందిపెడుతోందని ధ్వజమెత్తారు.

ఈరోజు(మంగళవారం) తాడేపల్లిలోని వైఎస్సార్ సీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన గోపిరెడ్డి.. ‘ ఆరోగ్య శ్రీ సేవలు నిలిపివేస్తే 500 కోట్లు ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వ వైఖరిచో ఆసుపత్రులు మూసివేసే పరిస్థితికి చేరుకున్నాయి. అందుకే రోగుల వద్ద డబ్బులు తీసుకుని వైద్యం చేయాల్సిన దుస్థితి నెలకొంది. ఆరోగ్యశ్రీని కొనసాగిస్తారా ...ఆపేస్తారా చంద్రబాబు సమాధానం చెప్పాలి

గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత జగన్‌ది
‘జగన్ ప్రజా ఆరోగ్య వ్యవస్థను గాడిలో పెట్టారు. గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యాన్ని తీసుకెళ్లిన ఘనత జగన్ ది. విలేజ్ క్లినిక్ ల ద్వారా గ్రామస్థాయికి ప్రభుత్వ వైద్యం అందించారు.మండలానికి రెండు పీహెచ్ సిలు ఉండాలనే ఆలోచనతో 80 కొత్త పిహెచ్ సిలు ఏర్పాటు చేశారు. మెడికల్ కాలేజీలను పటిష్టం చేశారు. ఆరోగ్య రంగంలో 54 వేల ఉద్యోగాలు కల్పించారు. పేదప్రజలకు ప్రభుత్వాసుపత్రిలో వైద్యం అందేలా చేశారు. పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలనే లక్ష్యంతో జగన్ పనిచేశారు’ అని స్పష్టం చేశారు.

వైద్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం
చంద్రబాబు పిపి విధానంలో వైద్యం అందిస్తామంటున్నారు. ప్రజా ఆరోగ్య వ్యవస్థను ప్రైవేట్ పరం చేసి పేదల దగ్గర డబ్బులు గుంజాలని చూస్తున్నారు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నారు. వైద్యాన్ని కూడా ఉచితంగా ఇవ్వలేకపోతే ఎందుకు మీ ప్రభుత్వం. జగన్ ఐదేళ్లలో 14 లక్షల మందికి 13 వేల కోట్లు ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించారు. ఈ ప్రభుత్వం 3500 కోట్లు బకాయిలు పెట్టింది’ అని మండిపడ్డారు. 

Advertisement
 
Advertisement
Advertisement