సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్‌సీపీ దూకుడు పెంచింది. ఎన్నికల కసరత్తు వేగం పుంజుకుంటున్న వేళ.. తొలి మేయర్ అభ్యర్థిని బుధవారం ప్రకటించింది. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ అభ్యర్థిగా ఆనం విజయ్‌కుమార్‌రెడ్డి పేరును ఖరారు చేసింది. దీంతో నెల్లూరు నగర రాజకీయాల్లో ఎన్నికల వేడి మరింత పెరగనుంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ శ్రేణులను సమాయత్తం చేయడం, బలమైన అభ్యర్థులను ఎంపిక చేయడం, నగర స్థాయిలో ఎన్నికల వ్యూహాన్ని ఖరారు చేయడం కోసం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి దృష్టి సారించారు. పార్టీ కీలక నేతలతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో నెల్లూరు మేయర్ అభ్యర్థి ప్రకటనతో మిగిలిన నగరాలు, పట్టణాల్లోనూ పార్టీ అభ్యర్థుల ఎంపికపై ఆసక్తి నెలకొంది.
నెల్లూరు రాజకీయాల్లో ఆనం కుటుంబానికి ఉన్న ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకుని విజయ్‌కుమార్‌రెడ్డిని బరిలోకి దింపాలని వైఎస్సార్‌సీపీ నిర్ణయించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన గతంలో వైఎస్సార్‌సీపీలో కీలక బాధ్యతలు నిర్వహించారు.
ప్రస్తుతం నెల్లూరు మేయర్ పదవి కోసం ప్రధాన పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. రిజర్వేషన్లు ఖరారయ్యే ప్రక్రియతో పాటు కార్పొరేషన్‌లోని డివిజన్లకు అభ్యర్థుల ఎంపికపైనా కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ తొలి అభ్యర్థిని ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చదవండి: అబద్ధాల్లో బాబు, పవన్‌ల పోటాపోటీ


