సాక్షి,అమరావతి: నకిలీ మద్యం కేసును సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ మాజీ మంత్రి జోగి రమేష్ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టిన హైకోర్టు, ఈ నెల 26లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వం, హోంశాఖ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది.
విచారణ సందర్భంగా జోగి రమేష్ తరఫున మాజీ అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. నకిలీ మద్యం కేసులో సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నల్లో దారి తప్పుతోందని ఆయన ఆరోపించారు. సీబీఐ విచారణ కోరుతూ పిటిషన్ వేసిన వ్యక్తినే నిందితుడిగా అక్రమంగా అరెస్ట్ చేశారని కోర్టు దృష్టికి తీసుకువచ్చారు.
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు..‘సిట్ విచారణ ఎలా జరుగుతోంది? సీబీఐకి కేసు అప్పగించాలా?’ అనే అంశాలపై కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ పరిణామాలతో చంద్రబాబు ప్రభుత్వం ఇరకాటంలో పడినట్లైంది.


