ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు
పీపీపీ పేరిట కట్టబెట్టడం ఏపీ ప్రజలకు నష్టం
సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
కళ్లముందే విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యాపారం
ప్రజలు ఎవరిని బలపరచాలో నేర్చుకోవాలి
సినీ నటుడు ప్రకాష్ రాజ్ వ్యాఖ్యలు
నటుడు శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు వెల్లడి
డాబా గార్డెన్స్: ‘‘ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీలను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) పేరిట అమ్మడం ప్రజలకు నష్టం చేకూరుస్తుంది. ప్రభుత్వాన్ని నడిపేవాడు అమ్ముడుపోయాడు. కళ్లముందే విశాఖ స్టీల్‌ప్లాంట్ వ్యాపారం (ప్రైవేటీకరణ) జరుగుతోంది. అమ్మేవాడు ఒకడు. కొనేవాడు ఒకడు’’ అని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్ తీవ్రంగా వ్యాఖ్యానించారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో గతంలో 1,007 ఎకరాల వ్యవసాయ భూమిని ప్రైవేట్‌కు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయిస్తే ప్రజలంతా ఏకమై పోరాడి అడ్డుకున్నారని తెలిపారు.
ఎన్నికల్లో ఎవరిని బలపరచాలో వారు నేర్చుకోవాలని సూచించారు. విశాఖపట్నంలో సీఐటీయూ అఖిల భారత మహాసభల్లో భాగంగా శ్రామిక ఉత్సవ్ ప్రారంభానికి హాజరైన ఆయన శనివారం ఓ హోటల్‌లో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిదానంగా ప్రైవేట్‌పరం చేస్తున్నారని మండిపడ్డారు. పదేళ్లుగా విమానయాన రంగం పెద్దోళ్ల చేతుల్లో ఉందని, ప్రభుత్వాలు అమ్ముడుపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పాలకులు ప్రజలు, కార్మికుల ఓపికను పరీక్షిస్తున్నారని అన్నారు. ప్రశ్నిoచే గొంతు నొక్కుతున్నారని, ఇలాంటి పరిస్థితులపై నిరంతరం పోరాటం చేయడమే మార్గమని సూచించారు. ప్రశ్నిoచేవారు ఉండకూడదని పాలకులు కోరుకుంటారని, ప్రశ్నిస్తే పోలీసు కేసులు పెడుతున్నారని అన్నారు.
వందేళ్ల ఉత్సవాలు చేసుకుంటున్న ఆర్‌ఎస్‌ఎస్ నుంచి దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్నవారు ఒక్కరూ లేరని, వారు చడ్డీల నుంచి ప్యాంట్‌లకు వచ్చారు తప్ప సాధించిందేమీ లేదని ప్రకాష్ రాజ్ ఎద్దేవా చేశారు. భారత దేశం సరోవరమైతే అందులో బ్రహ్మ రాక్షసుడు ఆర్‌ఎస్‌ఎస్ అని అన్నారు.
శివాజీ వ్యాఖ్యలు అహంకార పూరితం
సినీ నటుడు శివాజీ మహిళలపై మాటలు అహంకారంతో కూడినవని ప్రముఖ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ అన్నారు. విశాఖ విచ్చేసిన ఆయన ఓ హోటల్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. వేదికలపై అభిప్రాయాలు వ్యక్తపరిచేటప్పుడు ఒళ్లు, భాష జాగ్రత్తగా పెట్టుకోవాలన్నారు. శివాజీ చెత్తగా మాట్లాడారు.. ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని తెలిపారు.
ఆడవాళ్లకు మగవాళ్ల నుంచే తరతరాలుగా అన్యాయం జరుగుతుందని.. మహిళలను కుసంస్కారంతో చూసేవాళ్లకు ఆడవాళ్ల అవయవాలు మాత్రమే కనిపిస్తాయన్నారు. నటి అనసూయపై గతంలో శివాజీ చేసిన వ్యాఖ్యల పట్ల ప్రకాష్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. శివాజీ మాటలను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని.. తన మద్దతు ఎప్పుడూ అనసూయకే ఉంటుందన్నారు. శివాజీ మాటలు చూస్తుంటే.. ఒక మహిళలో ఆయనకు కేవలం అవయవాలు మాత్రమే కనిపిస్తున్నట్లు ఉన్నాయని ఘాటుగా విమర్శించారు.


