భీమవరం పూర్వ మునిసిపల్ కమిషనర్‌పై హైకోర్టు ఆగ్రహం
నివాస అనుమతుల ముసుగులో వాణిజ్య భవన నిర్మాణం నేపథ్యం
కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు రూ.2.50 లక్షలు ఖర్చుల విధింపు
సాక్షి, అమరావతి: నివాస భవన నిర్మాణానికి అనుమతులు తీసుకుని.. తరువాత వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నా, అది నివాస భవనమేనంటూ కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన పురపాలక కమిషనర్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కేసు ఇది. న్యాయానికి గంతలు కట్టొచ్చేమో గానీ, న్యాయమూర్తులకు కాదని హైకోర్టు తేల్చి చెప్పింది. కోర్టును తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించినందుకు గాను పశి్చమ గోదావరి జిల్లా, భీమవరం అప్పటి మునిసిపల్ కమిషనర్‌కు రూ.2.50 లక్షలను ఖర్చుల కింద విధించింది.
ఈ ఖర్చులను సొంత జేబు నుంచి చెల్లించాలని ఆదేశించింది. అంతేకాక నివాస భవనం కోసం అనుమతి తీసుకుని వాణిజ్య భవనం నిర్మించిన ఆ భవన యజమానులు– మణి మంజరి, నరసింహారావుకి సైతం రూ.2.50 లక్షలు ఖర్చులు విధించింది. సింగిల్ జడ్జి విధించిన రూ.50 వేల ఖర్చులను ఈ మేరకు భారీగా పెంచింది. ఈ మొత్తాన్ని రెండు వారాల్లో హైకోర్టు రిజిస్ట్రార్ (జుడీషియల్) వద్ద జమ చేయాలని ఆదేశించింది.
అనంతరం ఈ మొత్తాన్ని రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ద్వారా మూగ, అంధుల సంక్షేమం కోసం వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్ ధర్మాసనం ఇటీవల ఒక అప్పీల్‌పై తీర్పును వెలువరించింది. కాగా, వాణిజ్య భవనం నిర్మించిన ప్రాంతం ఇప్పటికే వాణిజ్య ప్రాంతంగా అధికారికంగా మారడం, తమ భవనానికి యజమానులు వాణిజ్య అనుమతులు పొందడం వంటి కారణాల నేపథ్యంలో భవన అనుమతులను రద్దు చేయడం సాధ్యం కాదని ధర్మాసనం తేల్చిచెప్పింది.


