సొసైటీల్లోనూ యూరియా ధర భారమే! | - | Sakshi
Sakshi News home page

సొసైటీల్లోనూ యూరియా ధర భారమే!

Jul 20 2026 1:56 AM | Updated on Jul 20 2026 1:56 AM

రామన్నపేట : ఇప్పటికే వర్షాలు లేక అల్లాడుతున్న అన్నదాతలను యూరియా కష్టాలు వెంటాడుతున్నాయి. యాప్‌ ద్వారా యూరియా బుక్‌ చేసి కొనుగోలు చేయడానికి అవస్థలు పడుతున్న రైతులకు ధర భారంగా మారనుంది. రవాణా చార్జీలు సొసైటీలే భరించాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల 391 జీఓ జారీ చేసింది. పీఏసీఎస్‌, ఎన్‌డీసీఎంఎస్‌ల్లో ఇప్పటి వరకు తక్కువ ధరకే లభించిన యూరియా బస్తా ఒక్కంటికి రూ.30 వరకు పెరగనుంది.

యాప్‌తో మొదలైన కష్టాలు

యూరియా కృత్రిమ కొరతను అరికట్టడంతోపాటు మోతాదుకు మించి వాడకాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ ఫర్టిలైజర్‌ యాప్‌ను తీసుకొచ్చింది. యాప్‌ డౌన్‌లోడ్‌ చేసి పట్టాదారు పాసు పుస్తకం నంబర్‌ను ఎంట్రీ చేస్తే భూ వివరాలు వస్తాయి. భూమి ఆధారంగా ఎకరాలకు రెండు బస్తాల చొప్పున 20 రోజుల వ్యవధిలో రెండు విడతల్లో యూరియా బుకింగ్‌ అవుతుంది. గతంలో రైతులు యూరియాతో పాటు విత్తనాలు ఎరువులు, పురుగు మందులు ఒకే ఫరిలైజర్‌ షాపులో కొనుగోలు చేసేవారు. యాప్‌ రాకతో యూరియా ఏ సొసైటీ, ఏ షాపు, ఏ గ్రామంలో దొరుకుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. నిన్నటి వరకు సొసైటీ, సీఎంఎస్‌లలో తక్కువ ధర రూ.267కు దొరికేది. అదే షాపుల్లో అయితే రూ.310 నుంచి రూ.320 పెట్టి కొనుగోలు చేయాల్సి వచ్చేది. సొసైటీలకు యూరియా సరఫరా చేస్తే రవాణా చార్జీలను ప్రభుత్వమే భరిస్తుంది. దుకాణాదారులు మార్క్‌ఫెడ్‌ నుంచి యూరియాను తీసుకురావడానికి అయ్యే రవాణా ఖర్చులు భరించాల్సి రావడంతో బస్తాకు రూ.30 నుంచి రూ.40 ఎక్కువకు విక్రయించాల్సి వచ్చేది.

ఇకపై సొసైటీల్లోనూ అధిక ధరే..

ఈ వానాకాలంలో వర్షాలు కురిసి, కాలువలకు నీళ్లు వదిలితే సుమారు 4.75లక్షల ఎకరాల విస్తీర్ణంలో అన్నిరకాల పంటలు సాగు అవుతాయని అధికారులు అంచనా వేశారు. మొత్తం సీజన్‌కు 37,766 మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరం. ఇప్పటికే రైతులు నలభైశాతం మేర యూరియాను కొనుగోలు చేశారు. ఇకపై సొసైటీలకు సరఫరా చేసే యూరియా రవాణా ఖర్చులను ప్రభుత్వం చెల్లించదు. సొసైటీలే భరించాల్సి ఉంటుంది. దీంతో సొసైటీల్లో కూడా మిగిలిన దుకాణదారుల వలే రూ.300 నుంచి రూ.320లకు అమ్మాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. అంచనా ప్రకారం పంటలసాగు అయితే జిల్లాలోని రైతులపై సుమారు రూ.65 లక్షల నుంచి రూ.70 లక్షల భారం పడనుంది.

ఫ యూరియా రవాణా చార్జీలు సంఘాలే భరించాలని ఆదేశాలు

ఫ ఇటీవలే జీఓ జారీ చేసిన కేంద్రం

ఫ ఒక్కో బస్తాపై రూ.30 వరకు ధర

పెంచి అమ్మనున్న సంఘాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement