మోటకొండూర్ : ఎస్‌ఐఆర్ ప్రక్రియలో 100శాతం మ్యాపింగ్‌కు బీఎల్‌ఏలు ప్రతి గ్రామంలో బీఎల్‌ఓలకు సహకరించాలని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య కోరారు. మంగళవారం మోటకొండూరులో ఏర్పాటు చేసిన బీఎల్‌ఏల అభినందన సభలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మండలంలో 100 శాతం మ్యాపింగ్ పూర్తి అయిన బూత్‌లకు చెందిన ఐదుగురు కాంగ్రెస్ పార్టీ బీఎల్‌ఏలకు రూ.5వేల చొప్పున నగదు అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ ఐనాల చైతన్యరెడ్డి, పచ్చిమట్ల మదార్‌గౌడ్, భూమండ్ల జయమ్మ శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, పేరబోయిన దివ్యమకరజ్యోతి కార్తీక్, బొట్ల కవిత, పరుశరాములు, బు డిగె బాలరాజుగౌడ్, బుగ్గ కొమురయ్య, బొట్ల రంజిత్, పచ్చిమట్ల మాధవి పాల్గొన్నారు.
ప్రత్యామ్నాయ పంటల సాగే మేలు
సంస్థాన్ నారాయణపురం: ప్రస్తుతం ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయడమే మేలని డీఏఓ పి.వెంకటరమణారెడ్డి సూచించారు. సంస్థాన్ నారాయణపురం, మహ్మదాపురం రైతు రైతు వేదికల్లో అవగాహన కార్యక్రమాల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రస్తుత వ్యవసాయ సీజన్‌లో వాతావరణ పరిస్థితులు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. రైతు మల్లేపల్లి ప్రముఖరెడ్డి నిర్వహిస్తున్న తేనెటీగల పెంపకం క్షేత్రాన్ని జిల్లా వ్యవసాయ అధికారి సందర్శించారు. చిమిర్యాలలో రైతు ధోనూరు జంగారెడ్డి డ్రిప్‌తో సాగుచేస్తున్న పత్తి పంటను పరిశీలించారు. కార్యక్రమాల్లో మండల వ్యవసాయ అధికారి బి.పూజ, ఏఈఓలు సైదులు జె. రాజేష్ కె. నవ్య పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే మెరుగైన బోధన
ఆలేరురూరల్: ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులకు మెరుగైన బోధన అందుతుందని డీఈఓ భిక్షపతి అన్నారు. మంగళవారం ఆలేరు మండలం శారాజీపేట జెజడ్పీహెచ్‌ఎస్, ఆలేరు పీఎంశ్రీ హైస్కూల్‌ను సందర్శించారు. పదవ తరగతి విద్యార్థుల సామర్థ్యాలు, బోధనాపద్ధతులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేశారు. ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మాట్లాడుతూ మధ్యాహ్న భోజనంలో తాజా కూరగాయలు నాణ్యత కలిగిన నిత్యావసరాలు వినియోగించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ఎర్ర లక్ష్మి, ప్రధానోపాధ్యాయురాలు మంజుల, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
నేడు ఎన్జీ కాలేజీ స్నాతకోత్సవం
రామగిరి(నల్లగొండ) : ఉమ్మడి జిల్లాలోనే అత్యున్నత విద్యా ప్రమాణాలతో విరాజిల్లుతున్న చారిత్రాత్మక విద్యాసంస్థ నాగార్జున ప్రభుత్వ కళాశాల (ఆటానమస్) మొదటి స్నాతకోత్సవం, బంగారు పతకాల ప్రధానోత్సవం, వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు బుధవారం స్థానిక ఎంఎన్‌ఆర్ కన్వెన్షన్‌లో జరగనున్నాయి. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సముద్రాల ఉపేందర్ ఒక ప్రకటనలో వివరాలు వెల్లడించారు. 1956 జూలై 22న స్థాపించిన ఈ కళాశాల ప్రస్థానాన్ని వేదికపై స్మరించుకోనున్నామని తెలిపారు. ముఖ్య అతిథిగా మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ప్రొఫెసర్ ఖజా అల్తాఫ్ హుస్సేన్, గౌరవ అతిథులు ఎంజీయూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ కె.అంజిరెడ్డి, సీఓఈ ప్రొఫెసర్ జి.ఉపేందర్‌రెడ్డి, తెలంగాణ కళాశాల విద్యా సంయుక్త సంచాలకుడు ప్రొఫెసర్ డిఎస్‌ఆర్.రాజేందర్‌సింగ్, ప్రొఫెసర్ పి.బాలభాస్కర్, అకాడమిక్ గైడెన్స్ ఆఫీసర్ ప్రొఫెసర్ వి.రాజేంద్ర ప్రసాద్, రూసా కోఆర్డినేటర్ డాక్టర్ సౌందర్య జోసెఫ్ హాజరుకానున్నారని పేర్కొన్నారు. వివిధ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులకు డిగ్రీ పట్టాలతో పాటు, అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ప్రతిభావంతులకు బంగారు పతకాలను ప్రదానం చేయనున్నట్లు కళాశాల పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ డి.మునిస్వామి తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.


