టెస్కో డైరెక్టర్‌ పదవిపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

టెస్కో డైరెక్టర్‌ పదవిపై దృష్టి

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

ఎమ్మెల్యేల వద్దకు క్యూ

సాక్షి, యాదాద్రి: నిస్తేజంగా ఉన్న ప్రాథమిక చేనేత సహకార సంఘాలకు మళ్లీ జీవం పోసేలా టెస్కో ఎన్నికల ప్రక్రియ దిశగా అడుగులు పడుతున్నాయి. 2013తో చేనేత సహకార సంఘాల పదవీకాలం ముగియగా ఆ తర్వాత ఎన్నికలు నిర్వహించలేదు. ఎట్టకేలకు ఈనెల 10న ఎన్నికలు నిర్వహించగా కొత్త పాలకవర్గాలు కొలువుదీరాయి. ఇక రాష్ట్ర స్థాయిలో టెస్కోకు పాలకవర్గాన్ని ఎన్నుకోవాల్సి ఉంది. ఇందుకోసం త్వరలో నోటిఫికేషన్‌ విడుదలయ్యే అవకాశం ఉండటంతో చేనేత సహకార రంగంలో ఒక్కసారిగా రాజకీయ హడావుడి మొదలైంది.

డైరెక్టర్ల ఎంపిక ప్రక్రియ ఎలా?

టెస్కోకు చైర్మన్‌తో పాటు డైరెక్టర్లు ఉంటారు. చేనేత సహకార సంఘాల అధ్యక్షులందరూ (చైర్మన్లు) కలిసి ముందుగా జిల్లాల వారీగా డైరెక్టర్లను ఎన్నుకుంటారు. ఇలా ఎన్నికై న డైరెక్టర్లలో ఒకరిని అందరూ కలిసి టెస్కో రాష్ట్ర చైర్మన్‌గా ఎన్నుకుంటారు. అయితే, సాధారణంగా ప్రభుత్వం ప్రతిపాదించిన వ్యక్తినే చైర్మన్‌ పీఠంపై కూర్చోబెట్టడం ఆనవాయితీ. ఈ టెస్కో ఎన్నికలు కేవలం చేనేత ప్రాథమిక సహకార సంఘాలకు మాత్రమే పరిమితం, ఇందులో పవర్‌ లూమ్‌ (మరమగ్గాల) సంఘాల చైర్మన్లకు భాగస్వామ్యం ఉండదు. గతంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 10 మంది డైరెక్టర్లను టెస్కోకు ఎన్నుకునే అవకాశం ఉండేది. అయితే, ఈసారి పాత జిల్లాల ప్రాతిపదికన డైరెక్టర్ల సంఖ్య ఉంటుందా? లేక కొత్త జిల్లాల ప్రకారం స్థానాలు కేటాయిస్తారా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.

మద్దతు కోసం బేరసారాలు

నోటిఫికేషన్‌ రాకముందే డైరెక్టర్‌ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర పోటీ నెలకొంది. జిల్లాల్లోని ప్రాథమిక చేనేత సహకార సంఘాల అధ్యక్షుల మద్దతు కూడగట్టేందుకు అభ్యర్థులు ఇప్పటికే రంగంలోకి దిగారు. ఓట్ల కోసం ఒక్కో చైర్మన్‌కు పెద్ద మొత్తంలో ఆఫర్లు ఇస్తూ, మద్దతు కూడగట్టే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్లు సమాచారం. కొన్ని చోట్ల తమకు మద్దతు ఇస్తే నగదు, బహుమతులు అప్పజెబుతామని బేరసారాలు చేస్తున్నారు. ఆర్థికంగా బలంగా ఉండటమే కాకుండా చేనేత కుటుంబాలకు పని కల్పిస్తున్న సంఘాల చైర్మన్లు ఈ రేసులో తీవ్ర ప్రయత్నాలు ప్రారంభించారు.

ఫ డైరెక్టర్‌ పదవికి తీవ్ర పోటీ

ఫ ప్రాథమిక సంఘాల చైర్మన్ల నుంచి టెస్కో డైరెక్టర్ల ఎంపిక

ఫ మద్దతు కూడగట్టేందుకు బేరసారాలు

ఫ పదవుల కోసం ఎమ్మెల్యేల వద్దకు ఆశావహుల క్యూ

డైరెక్టర్‌ రేసులో ఉమ్మడి జిల్లా నుంచి పలువురు చైర్మన్లు రంగంలో ఉన్నారు. ఇప్పటికే తమ పరిధిలోని ఎమ్మెల్యేలను కలిసి తమకు డైరెక్టర్‌ పదవి ఇప్పించాలని ప్రాధేయపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలో మునుగోడు, నకిరేకల్‌ నియోజకవర్గాల్లో అత్యధికమంది చైర్మన్లు ఉన్నారు. ఆ తర్వాత ఆలేరు, భువనగిరి, తుంగతుర్తి నియోజకవర్గాలున్నాయి. గతంలో రెండు సార్లు డైరెక్టర్‌గా గెలిచిన వారితో పాటు, ఈసారి కొత్తగా చైర్మన్‌గా ఎన్నికై న వారు కూడా ఈ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. కొందరైతే పోటీలో దిగే ముందే డైరెక్టర్‌ పదవే లక్ష్యంగా ఎమ్మెల్యేల వద్ద హామీ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల మద్దతు ఎవరికి లభిస్తుంది? డైరెక్టర్‌ స్థానాలను ఎవరు కై వసం చేసుకుంటారు? అనేది త్వరలో విడుదలయ్యే అధికారిక నోటిఫికేషన్‌తో స్పష్టం కానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement