భువనగిరిటౌన్ : ఒకేసారి మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించి ప్రతినెలా 1వ తేదీన హమాలీ బిల్లులు చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం ఏఐటీయూసీ అనుబంధ సివిల్ సప్లయ్ హమాలీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో భువనగిరి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించి మాట్లాడారు. హమాలీలు మూడు నెలల బియ్యాన్ని ఒకటే నెల ఎలా దిగుమతి చేస్తారని ప్రశ్నించారు. ఈ విధానం వల్ల హమాలీ కార్మికులు, రేషన్ డీలర్లు, లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అనంతరం ప్రజావాణిలో భువనగిరి ఆర్డీఓ క్రిష్ణారెడ్డి, సివిల్ సప్లయ్ డీఎం హరికృష్ణకు వేరువేరుగా పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు సమర్పించారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యులు సామల శోభన్ బాబు, హమాలీ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గౌరవంతుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు పల్లె శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు జంగ నర్సయ్య, ప్రధాన కార్యదర్శి పాపగళ్ల శంకరయ్య, సహాయ కార్యదర్శి పురుగుల రవి, కోశాధికారి గొరిగే శంకరయ్య, నాయకులు పిన్నం జగన్, మడుగుల స్వామి, కొట్టూరి శ్రీను, బోదల యాదయ్య, స్వామి, మైసమ్మ, గణేష్, కిష్టయ్య, సైదులు, జహంగీర్ తదితరులు పాల్గొన్నారు.
ఫ ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్


