రాజాపేట : మండలంలోని బేగంపేట గ్రామానికి చెందిన యువకుడు అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతిచెందాడు. శనివారం ఎస్‌ఐ లింగారెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. బేగంపేట గ్రామానికి చెందిన బిచాల అశోక్ (27)కు తొమ్మిదేళ్ల క్రితం మెదక్ జిల్లా తూప్రాన్ గ్రామానికి చెందిన మౌనికతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కొన్ని నెలలుగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధల కారణంగా మౌనిక తన తల్లిగారింటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో అశోక్ మద్యానికి బానిసై అనారోగ్యానికి గురయ్యాడు. శనివారం తెల్లవారుజామున గ్రామంలోని రోడ్డు పక్కన విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద అనుమానాస్పద స్థితిలో మృతిచెంది ఉన్నాడు. అశోక్ విద్యుదాఘాతంతో మృతి చెందాడని అతడి భార్య మౌనిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా అశోక్ అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లుగా భావిస్తూ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
ట్రాక్టర్ ప్రమాదంలో
రైతు మృతి
మోతె : ట్రాక్టర్ ప్రమాదంలో రైతు మృతిచెందాడు. ఈ ఘటన మోతె మండలం సిరికొండ గ్రామంలో శనివారం జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. సిరికొండ గ్రామానికి చెందిన ఎస్‌కే సలీమ్(38) ట్రాక్టర్‌తో పొలం దున్నుతుండగా ఒక్కసారిగా సీట్లో నుంచి కిందపడ్డాడు. దీంతో ట్రాక్టర్ వెనుక చక్రాలు సలీమ్‌పై నుంచి వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ట్రాక్టర్ 100 మీటర్ల దూరం వెళ్లి పక్కనే ఉన్న బావిలో పడిపోయింది. సలీమ్‌ను స్థానికులు సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు.
మామపై హత్యాయత్నం
చేసిన అల్లుడి అరెస్టు
మోతె : మామపై హత్యాయత్నం చేసిన అల్లుడిని శనివారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్‌ఐ లచ్చిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మోతె మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన ఆల్‌దాసు లింగయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా.. అదే గ్రామంలో ఉంటున్న అతడి అల్లుడు పాలకూరి సైదులు గొడ్డలితో లింగయ్యపై దాడి చేసి అక్కడి నుంచి పారిపోయాడు. అదే గ్రామానికి చెందిన పాలకూరి సత్యం, పాలకూరి వెంకటేశంతో సైదులుకు ఉన్న గొడవల కారణంగా తన సొంత మామను హత్య చేసి ఆ నిందను సత్యం, వెంకటేశంపై మోపాలని ఈ దాడికి యత్నించినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఈ మేరకు సైదులును అరెస్టు చేసినట్లు ఎస్‌ఐ పేర్కొన్నారు.
వ్యక్తి ఆచూకీ లభ్యం
మర్రిగూడ : మండలంలోని వట్టిపల్లి గ్రామం నుంచి రెండు నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఎస్‌ఐ రాంబాబు తెలిపిన వివరాల ప్రకారం.. వట్టిపల్లి గ్రామంలో తన అత్తగారింటికి వచ్చిన పడకంటి మహేష్ అనే వ్యక్తి ఈ ఏడాది మే 12న ఉదయం ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. దీంతో అతడి భార్య శివలీల మర్రిగూడ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలతో శనివారం మహేష్ ఆచూకీని పోలీసులు కనిపెట్టారు. ఆర్థిక సమస్యల కారణంగా ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు మహేష్ పోలీసుల విచారణలో చెప్పినట్లు తెలిసింది. అనంతరం మహేష్‌కు కౌన్సిలింగ్ ఇచ్చి కుటుంబ సభ్యులకు అప్పగించారు.


