కొత్తూరు: కొత్తూరు మండలం కర్లెమ్మ పంచాయతీ పరిధి అఫీషియల్ కాలనీ కి చెందిన ఓ మహిళ మెరుగు బ్యాచ్ చేతిలో మోసపోయారు. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు.. ఈ నెల 6వ తేదీన అఫీషియల్ కాలనీకి ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు బంగారం మెరుగు పెడతామని వచ్చారు. కాలనీలోని పొట్నూరు శివకుమారి ఇంటికి వెళ్లి బంగారు ఆభరణాలకు మీ ఇంటి వద్దే, మీ సమక్షంలో మెరుగు పెడతామని చెప్పగా ఆమె ఒప్పకోలేదు. అయినా వారు వినకుండా ఆమెకు నచ్చజెప్పారు. అప్పటికి శివకుమారి ఇంటిలో సామాన్లు సర్దుతు న్నారు. ఓ రాగి బిందెకు వారు మెరుగు పెట్టడంతో.. అది బాగుందని సామాన్లు సర్దుతున్న మనీషా, రాధలకు చెందిన వెండిపట్టీలు మెరుగుకు ఇచ్చారు. అవి బాగా మెరుగు పెట్టడంతో శివకుమారి తన రెండు తులాల బంగారు పుస్తెలతాడు మెరుగు పెట్టాలని దుండగులకు ఇచ్చారు. రాగి బిందెలో పుస్తెలతాడు వేసి కొన్ని రకాల రసాయనాలు వేసి వేడి చేయాలని శివకుమారికి దుండగులు చెప్పారు. తానే వేడి చేస్తానని శివకుమారి చెప్పి తన ఇంటి వంట గదిలోకి రాగి బిందెను తీసుకెళ్లారు. ఆమెతో పాటు దుండగుల్లో ఒక రు వంట గదికి వెళ్లారు. రాగి బిందెలో ఒక రకం పౌడర్ వేయాలని ఆమెకు చెప్పి చాకచక్యంగా ఆమెను వెనక్కి నెట్టి బిందెలో ఉన్న పుస్తెల తాడు తీసుకుని బయటకు వచ్చేశాడు. బిందెలో ఉన్న పుస్తెల తాడును కొంత సమయం అలాగే ఉంచాలని చెప్పి ఇద్దరూ జారుకున్నారు. కాసేపటి తర్వాత ఆమె బిందెను చూడగా అందులో పుస్తెల తాడు లేకపోవడంతో అవాక్కయ్యారు. వెంటనే స్థానిక పోలీసులకు శివకుమారి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు శుక్రవారం స్థానిక ఏఎస్‌ఐ గోవిందరావు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.


