నరసన్నపేట: జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీలు నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. డీఎస్సీ–2025లో అక్రమాలపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని, వెన్నుపోటు పార్టీ విధానాలు, యువతకు చేస్తున్న మోసం తదితర అంశాలపై పార్టీ పిలుపు మేరకు నిరసన కార్యక్రమాలు జరుగుతున్న విషయాన్ని గుర్తు చేశారు. దీంట్లో భాగంగా మండల కేంద్రాల్లో రిలే దీక్షలు విజయవంతమయ్యాయని పేర్కొన్నారు. అలాగే సోమవారం ర్యాలీలు కూడా విజయవంతం చేయాలని యువత, నిరుద్యోగులు, డీఎస్సీ బాధితులు అధికంగా పాల్గొనే విధంగా పార్టీ శ్రేణులు చర్యలు తీసుకోవాలన్నారు.
సరుబుజ్జిలి: మండలంలోని వెన్నెలవలస జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కు సంబంధించి దరఖాస్తు గడువు ఆగస్టు 10 వరకు పెంచినట్లు విద్యాలయం ఇన్‌చార్జి ప్రిన్సి పాల్ బేతనసామి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని నవోదయ వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
టెక్కలి: వైఎస్సార్‌సీపీ టెక్కలి నియోజకవర్గ సమన్వయకర్త పేరాడ తిలక్‌కు శనివారం మరోమారు టెక్కలి పోలీసులు నోటీసులు అందజేశారు. ఏప్రిల్ 13న టెక్కలి గ్రామ పంచా యతీ ఈవో ఎ.వి.శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆదివారం టెక్కలి పోలీస్‌స్టేషన్‌కు విచారణ కావాలని నోటీసులో పేర్కొన్నారు.
శ్రీకాకుళం: జిల్లాలోని కేజీబీవీల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రిన్సిపాల్, సీఆర్‌టీ, పీజీటీ పో స్టుల భర్తీకి సంబంధించి సబ్జెక్టుల వారీగా 1:3 నిష్పత్తిలో రూపొందించిన తాత్కాలిక మెరిట్ జాబితాలోని అభ్యర్థులకు ఈనెల 7వ తేదీన ధ్రవపత్రాల పరిశీలన చేపట్టినట్లు సమగ్ర శిక్ష ఈసీపీ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అయితే పోస్టులకు తగినంత మంది అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతో తదుపరి మెరిట్ క్రమంలో ఉన్న అభ్యర్థులతో 1:10 నిష్పత్తిలో తాత్కాలిక మెరిట్ జాబితాలను రూపొందించి జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. అభ్యర్థులు ఈనెల 11వ తేదీన ఉదయం 10 గంటలకు సమగ్ర శిక్ష జిల్లా ప్రాజెక్టు కార్యాలయం, ఇందిరానగర్ కాలనీ ఎక్స్టెన్షన్, ఎస్బీఐ రామలక్ష్మణ బ్రాంచ్ వెనుక హాజరవ్వాలని కోరారు. తాత్కాలిక మెరిట్ జాబితాలోని అభ్యర్థులు తమ ఒరిజినల్ ధ్రువపత్రాలతో పాటు ఒక సెట్ జిరాక్స్ ప్రతులను తప్పనిసరిగా తీసుకురావాలన్నారు.
జలుమూరు: మండలంలోని టెక్కలిపాడు పంచాయతీ గొల్లపేటకు చెందిన పిట్ట అనుష్క (17) పాముకాటుకు గురై శనివారం మృతి చెందింది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పొలం పనిచేస్తున్న నాన్న మ్మ నీలమ్మకు అనుష్క మధ్యాహ్న భోజనం తీసుకెళ్తుండుగా.. గుర్తు తెలియని పాము కాటు వేసినట్లు గుర్తించారు. దీంతో స్పృహ కోల్పోయిన ఆమెను నరసన్నపేట ప్రభుత్వ ఆస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అయితే అప్పటి కే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతురాలికి తల్లిదండ్రులు సాయమ్మ, అప్పన్నతో పాటు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ప్రస్తుతం నరసన్నపేటలోని ఒక ప్రైవేటు కాలేజీలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.


