జిల్లాలో ఖాకీల వికృత క్రీడ
పాలకుల డైరెక్షన్‌లో రక్షకభట వ్యవస్థ
శ్రుతిమించుతున్న విధేయత
అధికార పార్టీ నేతలపై ఉదాసీనత
ప్రతిపక్ష, సామాన్యులపై అడ్డగోలు కేసులు
పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:
జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల ఉత్తర్వులివి. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురి చేశారని కేజీబీవీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రేజేటి సౌమ్య జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేయగా కేసు రిజిస్టర్ చేసింది. జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని ఆదేశించింది.
●పొందూరు కేజీబీవీ ప్రిన్సిపాల్‌గా పనిచేసిన రేజేటి సౌమ్యను ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్ వేధింపులకు గురి చేసిన ఘటనలో ఆమె ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. అప్పట్లో ఎంఎల్‌సీ అయింది. ఆమె నుంచి పోలీసులు స్టేట్‌మెంట్ తీసుకున్నారు. కానీ కేసు పెట్టలేదు. దీంతో బాధితురాలు జాతీయ మానవ హక్కుల కమిషన్ కు, జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌కు ఫిర్యాదు చేశా రు. ఆ ఫిర్యాదుపై విచారణ జరిపి, యాక్షన్ టేకెన్ రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్, ఎస్పీకి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినా స్పందన లేదు.
●మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటనలో జనాల రద్దీ మధ్య ఇబ్బంది పడుతున్నారని మహి ళా ఎస్‌ఐ ప్రవళ్లికను జాగ్రత్తగా పక్కకు తీసుకెళ్తే అది నేరంగా పరిగణించారు. అంతటితో ఆగకుండా నాన్‌బెయిల్ సెక్షన్లు పెట్టేసి, సంబంధం లేని వారందరినీ వేధిస్తున్నారు.
●పలాసలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్‌లో ఒకరు చనిపోతే మర్డర్ కేసు నమోదు చేశారు. కానీ రాజమహేంద్రవరంలో వైద్య విద్యార్థిని ప్రియాంకను ఇద్దరు యువకులు కారుతో ఢీ కొట్టిన విషయాన్ని తొలుత పోలీసులు తేలికగా తీసుకున్నారు. మూడు రోజులు గా రాష్ట్ర మంతటా గొల్లుమన్న తరువాత నిందితులపై సీరియస్ సెక్షన్లు నమోదు చేశారు.
●ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ కారు ఢీకొట్టగా ఒకరు చనిపోతే వారిపై కేసు నమోదు కాలే దు. అలాగే పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు కుమారుడు కారు ఢీకొట్టడంతో ఒకరు చనిపోగా, నలుగురి గాయాలైతే వారిపైనా కేసు నమోదు కాలేదు. మందస పట్టణ టీడీపీ కమిటీ అధ్యక్షుడు గార కృష్ణారావు ఆటో ఢీకొట్టడంతో నర్తు వెంకటరమణ అనే వ్యక్తి చనిపోతే అక్కడా కేసు నమోదు కాలేదు. కానీ టీడీపీ ప్రత్యర్థుల వలన దురదృష్టవశాత్తు అటువంటి ప్రమాదాలు జరిగితే మాత్రం హత్య కేసులు నమోదు చేస్తున్నారు.
●పలాస పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిపై పోలీస్ స్టేషన్‌లోనే టీడీపీ నాయకులు దాడి చేస్తే నో కేస్.
●ఎచ్చెర్లలోని సాక్షి ప్రధాన కార్యాలయంపై కేంద్ర, రాష్ట్రమంత్రుల బంధువు మెండ దాసునాయుడు తదితరులు దాడి చేసి ధ్వంసానికి దిగితే నో కేస్.
ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఘటనలు ఉన్నాయి. చట్టం అందరికీ ఒక్కటి కాదనే ఆందోళన నెలకొంటోంది. వాస్తవానికి చట్టం ముందు అంద రూ సమానమే. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఒకే నిబంధన వర్తించాలి. కానీ క్షేత్రస్థాయి లో అధికార పార్టీ నేతలు, కార్యకర్తల విషయంలో పోలీసులు వ్యవహరించే తీరు ఒకలా.. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలు విషయంలో అనుసరించే విధా నం మరోలా ఉంది. ప్రతిపక్ష నేతలు ఆందోళనలు, నిరసనలు చేపడితే మందుస్తు నోటీసులు, నిర్బంధాలు, కేసులు, అరెస్టులతో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. అదే అధికార పార్టీ నేతల విషయంలో ఉదాసీనంగా ఉంటున్నారు.
అక్రమ కేసులతో వేధింపులు
పోలీసులు చట్టం ప్రకారం పనిచేయాలి. అధికార పార్టీ జెండా చూసి చట్టం మారకూడదు. కానీ జిల్లా పోలీసు అధికారులు ప్రస్తుతం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నారు. టీడీపీ నేతలు చెప్పినట్టుగానే కేసులుంటున్నాయి. నిందితులుగా ఎవరిని పెట్టా లో అధికార పార్టీ డిసైడ్ చేస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు బైక్ యాక్సిడెంట్ లో లేని సీదిరిపై కూడా హత్య కేసు పెట్టారు. వైఎస్ జగన్ పర్యటనలో స్వచ్ఛందంగా జనాలు తండోపతండాలుగా వస్తే నాయకులపై కేసులు పెట్టి వేధిస్తున్నారు.


