● సమగ్ర శిక్ష ప్రాజెక్టులో లెక్కల చిక్కులు ● రెండు నెలలుగా జీతాలు, బిల్లులు చెల్లించలేని దుస్థితి
శ్రీకాకుళం: రాష్ట్రంలో విద్యా వ్యవస్థను ముందుకు తీసుకువెళ్లేందుకు ఏర్పాటైన సమగ్ర శిక్ష ప్రాజెక్టు.. అధికారుల నిర్లక్ష్యం వల్ల అసమగ్రంగా తయారైంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో నడుస్తున్న ఈ ప్రాజెక్టు జిల్లాలో ని పేద విద్యార్థులకు ఎంతో ఉపయోగకరం. ఇలాంటి ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన రాష్ట్ర అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ప్రాజెక్ట్ రెన్యువల్ ఆలస్యమైంది.
కేంద్రం ఈ ప్రాజెక్టుకు విడుదల చేసిన నిధులకు సంబంధించిన లెక్కలను ఏటా ఏప్రిల్, మే నెలలో కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుంది. రాష్ట్ర సమగ్ర శిక్షా అధికారులు ఈ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించి జూన్ నెలలో కూడా నివేదిక పంపకపోవడంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర సమగ్ర శిక్ష ప్రాజెక్టు రెన్యువల్‌ను నిలుపుదల చేసింది. దేశంలో ఐదు రాష్ట్రాలు రెన్యువల్ కాకుండా ఉండిపోగా అందులో మన రాష్ట్రం కూడా ఉంది. కేంద్ర నిధులు విడుదల కాకపోవడంతో గడిచిన రెండు నెలలుగా సమగ్ర శిక్షలో లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ఉద్యోగులకు జీతాలు, వెండర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు ప డుతున్నారు. ముఖ్యంగా ఉద్యోగులు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జూన్‌లో పిల్లల ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. జీతాలు పడకపోవడంతో అప్పులు చేసి నెట్టుకురావాల్సి వస్తోంది. పెరిగిన నిత్యావసర ధరలు అనునిత్యం వీరికి పరీక్ష పెడుతున్నాయి.
ఎట్టకేలకు జూన్ మూడో వారంలో కేంద్రానికి లెక్కలను చెప్పడంతో సమగ్ర శిక్ష ప్రాజెక్టును మరో ఐదేళ్లకు రెన్యువల్ చేసింది. దీంతో నిధులు విడుదలకు మార్గం సుగమం అయినప్పటికీ కేంద్ర నిధులు విడుదల కాలేదు. దీంతో జూలైలోనూ ఇబ్బందులు తప్పలేదు.


