ఆలస్యమే చేటు..! | - | Sakshi
Sakshi News home page

ఆలస్యమే చేటు..!

Aug 5 2026 2:29 AM | Updated on Aug 5 2026 2:29 AM

జిల్లాలో పెరుగుతున్న పాముకాట్లు

సకాలంలో వైద్యం అందక ఇబ్బందులు

ఆస్పత్రుల్లో వ్యాక్సిన్లు ఉన్నా ఫలితం శూన్యం

అందుబాటులో ఉండని వైద్యులు,

సిబ్బంది

సకాలంలో స్పందించాలి

పాముకాటు..

హిరమండలం: జిల్లాలో పాముకాట్లు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. పాముకాటుకు సంబంధించి విరుగుడు వ్యాక్సిన్లు ప్రభుత్వ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇవి సీహెచ్‌సీల వరకే పరిమితమవుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 15 సీహెచ్‌సీల్లో వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటున్నాయి. కానీ 60 వరకు ఉన్న పీహెచ్‌సీల్లో మాత్రం అంతంతమాత్రంగానే ఉంటున్నాయని అంటున్నారు. ఒకవేళ వ్యాక్సిన్‌ అందుబాటులో ఉన్నా.. వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నాలుగు నెలల్లోనే 300 మందికి పాములు కాటు వేసినట్లు సమాచారం. ముఖ్యంగా వంశధార నదీ పరివాహక ప్రాంతాల్లోనే పాముకాట్లు అధికంగా ఉంటున్నాయి. ఏటా రెండు వేల మందికిపైగా పాముకాటుకు గురవుతున్నారు. అందులో 400 మంది వరకు మృత్యువాత పడుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. అయితే బాధితుల్లో ఎక్కువ మంది రైతులే ఉండడం బాధాకరం.

సకాలంలో వైద్యం అందక..

పాముకాటు వేసిన వెంటనే సకాలంలో వైద్యం అందక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. బాధితుల్లో 70 శాతం మంది నాటువైద్యంపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ప్రాణాలు కాపాడే విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. పాముకాటుకు విరుగుడుగా ఇచ్చే ‘పాలీవెలెంట్‌ యాంటీ వినమ్‌’ శాసీ్త్రయంగా నిరూపితమైన మందు. ఈ మందు క్షేత్రస్థాయిలో చాలా ఆస్పత్రుల్లో అందుబాటులో లేదన్న విమర్శలున్నాయి. కొన్ని ఆస్పత్రుల్లో ఉంటున్నా.. అదికూడా మొదటి 5 – 10 డోసుల వరకు ఉంటుంది. అనంతరం జిల్లా కేంద్రంలోని సర్వజన ఆస్పత్రికి వెళ్తేనే ఉపశమనం దక్కుతుంది. పాముకాటుకు గురైన బాధితుడికి మూడు గంటల్లోపు శరీరంలో విష తీవ్రత బట్టి యాంటీ వినమ్‌ డోసులను అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. జిల్లాలో 60 పీహెచ్‌సీలతోపాటు 108, 104 వాహనాల్లో యాంటీ వినమ్‌ డోసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి ఉంచితే పాముకాటు మృతులను తగ్గించవచ్చు.

Eఈనెల 1న పోలాకి మండలం డోల గ్రామానికి చెందిన దువ్వారపు నారాయణమ్మ అనే మహిళ పాముకాటుతో మృతి చెందింది. పొలంలో పనులు చేస్తుండగా ముల్లు గుచ్చుకున్నట్టు అనిపించింది. అయితే కొద్దిసేపటికే ఆమె అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు నరసన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించి శ్రీకాకుళం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ నారాయణమ్మ మృతి చెందింది.

E ఈనెల 2న ఎల్‌ఎన్‌పేట గ్రామానికి చెందిన బలరాం మహంతి పాముకాటుకు గురయ్యారు. అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. వైద్యులు లేకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ప్రాథమిక వైద్యం అందించారు. అనంతరం శ్రీకాకుళం తరలించారు. అక్కడ బలరాం సాహు చికిత్స పొందుతున్నాడు.

E గత నెల 25న నరసన్నపేట మండలం గొట్టిపల్లి అంపలాంలో పాముకాటుతో తల్లీ, కుమారులు అస్వస్థతకు గురయ్యారు. ఇంట్లో నిద్రిస్తుండగా ఆడంగి శశికిరణ్‌, తల్లి విజయలక్ష్మిలకు పాముకాటు వేసింది. హుటాహుటిన నరసన్నపేట సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం హుటాహుటిన శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.

పాముకాటుకు గురైనవారిని వెంటనే ఆస్పత్రికి తరలించాలి. నాటువైద్యం పేరుతో జాప్యం చేస్తే ప్రాణాలకే ముప్పు. ప్రభుత్వాస్పత్రుల్లో యాంటీవినమ్‌ ఇంజెక్షన్లు అందుబాటులో ఉంటాయి. ప్రాథమిక చికిత్స అనంతరం ఆస్పత్రికి వీలైనంత త్వరగా చేరిస్తే ప్రాణాలు కాపాడగలం.

– పి.సాయికుమార్‌

వైద్యాధికారి, హిరమండలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement