సిబ్బంది కొరత..తీరని వెత | - | Sakshi
Sakshi News home page

సిబ్బంది కొరత..తీరని వెత

Jul 20 2026 1:02 AM | Updated on Jul 20 2026 1:02 AM

మడకశిర: మడకశిర విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో సిబ్బంది కొరత వేధిస్తోంది. పూర్తి స్థాయిలో సిబ్బంది ఉంటేనే అంతరాయం లేకుండా నాణ్యమైన సేవలు అందించడానికి అవకాశం ఉంటుంది. అయితే సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రధాన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మూడు మండలాలకు రెగ్యులర్‌ జేఈలో లేరు. పనిఒత్తిడితో సిబ్బంది సతమతమవుతున్నారు. దీనికితోడు సబ్‌ స్టేషన్ల నిర్వహణ సరిగాలేదు.. పర్యవేక్షణ కొరవడింది. దీంతో విద్యుత్‌ వినియోగదారులకు శాపంగా మారింది. సబ్‌డివిజన్‌ పరిధిలోని మడకశిర, అమరాపురం, గుడిబండ, రొళ్ల, అగళి మండలాల్లో దాదాపు 28 వేల వ్యవసాయ విద్యుత్‌ సర్వీసులు, దాదాపు 60 వేలకుపైగా గృహ విద్యుత్‌ సర్వీసులు, వేలాదిగా కమర్షియల్‌ విద్యుత్‌ సర్వీసులు ఉన్నాయి. సబ్‌ డివిజన్‌ పరిధిలో 33 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు 25 ఉన్నాయి. 132 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్లు అమరాపురం, జంబులబండ, మడకశిర మండలంలోని గొల్లపల్లిలో ఉన్నాయి.

సబ్‌ డివిజన్‌ పరిధిలో ప్రధాన పోస్టులన్నీ ఖాళీనే..

మడకశిర విద్యుత్‌ సబ్‌ డివిజన్‌కు రెగ్యులర్‌ డీఈ లేరు. ప్రస్తుతం హిందూపురానికి చెందిన డీఈనే మడకశిర విద్యుత్‌ సబ్‌ డివిజన్‌కు కూడా ఇన్‌చార్జ్‌ డీఈగా కొనసాగుతున్నారు. ఇంతకు మునుపు ఇక్కడ డీఈగా పని చేస్తున్న రఘు సస్పెన్షన్‌కు గురయ్యారు. అప్పటి నుంచి మడకశిరకు రెగ్యులర్‌ డీఈ లేరు. మడకశిర,అగళి,రొళ్ల మండలాలకు రెగ్యులర్‌ జేఈలు లేరు. మడకశిర మండలానికి గుడిబండ జేఈ ఇన్‌చార్జ్‌గా ఉన్నారు. ఇంతకు మునుపు మడకశిర రెగ్యులర్‌ జేఈగా ఉన్న విశ్వనాథ్‌ సస్పెన్షన్‌కు గురయ్యారు. రొళ్ల మండలానికి కూడా జేఈ లేక సబ్‌ ఇంజినీరు ఇన్‌చార్జ్‌ జేఈగా ఉంటున్నారు. అగళి మండలానికి కూడా రెగ్యులర్‌ జేఈ లేకపోవడంతో రొళ్ల మండల సబ్‌ ఇంజినీరు అగళి మండలానికి కూడా జేఈ ఇన్‌చార్జ్‌గా వ్యవహరిస్తున్నారు. గ్రామ స్థాయిలో లైన్‌మెన్ల కొరత అధికంగా ఉంది.

రాజకీయ ఒత్తిడితోనూ సతమతం..

మడకశిర విద్యుత్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలో సిబ్బంది పని ఒత్తిడితో పాటు రాజకీయ ఒత్తిడితో సతమవుతున్నారు. కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు, కొత్త సర్వీసుల మంజూరు, విద్యుత్‌ సమస్యలు పరిష్కరించడం, బిల్లులు వసూలు చేయడం, అంతరాయం లేకుండా విద్యుత్‌ సరఫరా చేయడం తదితర పనులు ప్రస్తుత అధికారులపైనే అదనపు భారం పడుతోంది. దీనికితోడు రాజకీయ ఒత్తిడి అధికంగా ఉంది. ఇక్కడ పని చేస్తున్న డీఈ,ఏఈలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఇక్కడికి బదిలీపై రావడానికి అధికారులు జంకుతున్నారు. ఇటీవల మడకశిర మండలానికి రెగ్యులర్‌ జేఈని నియమించినా ఆయన విధుల్లో చేరలేదు.

మడకశిర విద్యుత్‌ సబ్‌ డివిజన్‌లో వేధిస్తున్న సిబ్బంది కొరత

విద్యుత్‌శాఖ డివిజనల్‌ ఇంజినీర్‌ పోస్టు ఖాళీ

మూడు మండలాలకు రెగ్యులర్‌

జేఈలు లేరు..

పని ఒత్తిడితో విద్యుత్‌ సిబ్బంది సతమతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement