‘పరిష్కార వేదిక’కు 421 అర్జీలు | - | Sakshi
Sakshi News home page

‘పరిష్కార వేదిక’కు 421 అర్జీలు

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

ప్రశాంతి నిలయం: సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్న ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’కు అర్జీలు వెల్లువెత్తుతున్నాయి. అధికారులు తూతూమంత్రంగా పరిష్కారం చూపుతుండటంతో ప్రజలు మళ్లీ అదే సమస్యపై అర్జీ ఇచ్చేందుకు జిల్లా కేంద్రానికి వస్తున్నారు. సోమవారం పుట్టపర్తి రైల్వే స్టేషన్‌ సమీపంలోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన ‘పరిష్కార వేదిక’కు జనం భారీగా తరలివచ్చారు. వివిధ సమస్యలపై 421 అర్జీలిచ్చారు. కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌, డీఆర్‌ఓ కొండయ్య, ఎస్‌డీసీ విజయ కుమారి, పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. వాటి పరిష్కారం కోసం ఆయా శాఖలకు పంపారు. కార్యక్రమం అనంతరం కలెక్టర్‌ వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, సంక్షేమ ఫలాలను ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలన్నారు. వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఆదేశించారు.

‘టెట్‌’ రద్దుకు

చట్ట సవరణ చేయాలి

జేసీకి వైఎస్సార్‌ టీఏ నాయకుల వినతి

పుట్టపర్తి: దేశంలో ‘టెట్‌’ విధానం అమల్లోకి రాకముందే పోటీ పరీక్షల్లో ప్రతిభ చూపి ఉపాధ్యాయులుగా నియమితులైన వారు..ప్రస్తుతం టెట్‌ నిబంధనలతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, అందువల్ల ‘టెట్‌’ రద్దుకు పార్లమెంట్‌లో చట్ట సవరణ చేయాలని వైఎస్సార్‌టీఏ నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జాయింట్‌ కలెక్టర్‌ మౌర్య భరద్వాజ్‌కు వినతి పత్రం సమర్పించారు. అనంతరం వైఎస్సార్‌టీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంషీద్‌, జిల్లా అధ్యక్షుడు పీవీ రమణారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, నాయకులు రామమోహన్‌రెడ్డి తదితరులు మాట్లాడుతూ... సీనియర్‌ ఉపాధ్యాయులకు ‘టెట్‌’తో సంబంధం లేకుండా వెంటనే ప్రమోషన్లు కల్పించాలన్నారు. చట్ట సవరణ జరిగే వరకూ ఉపాధ్యాయులు ప్రయోజనాలు కోల్పోకుండా రక్షణ చర్యలు చేపట్టాలన్నారు.

టీబీ డ్యాంలో

25.77 టీఎంసీల నీరు

బొమ్మనహాళ్‌: తుంగభద్ర జలాశయానికి వరద తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం డ్యాంలో 25.77 టీఎంసీల నీరు ఉంది. ఇటీవల బొమ్మనహాళ్‌, కణేకల్లు మండలాల్లో హెచ్చెల్సీ ఆయకట్టు రైతులు నారుమళ్లు, ఎండుమిర్చి, పత్తి పంటలు విత్తుకున్నారు. టీబీ జలాశయం నుంచి నీరు ఎప్పుడు విడుదల చేస్తారా అని ఎదురు చూస్తున్నారు. అయితే, మొన్నటి వరకు ఊరించిన వరద ఒక్కసారిగా తగ్గుముఖం పట్టడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గతేడాది ఇదే సమయానికి డ్యాంలో 79.90 టీఎంసీల నీరు నిల్వ ఉండి 38,079 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో, 39,009 క్యూసెక్కుల అవుట్‌ఫ్లో నమోదు కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement