సాక్షి, పుట్టపర్తి
చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా దాడులు, దారుణాలు, భూ కబ్జాలు, దౌర్జన్యాలు, హత్యలు, అత్యాచారాలు, బెదిరింపులు, వేధింపులు పెరిగిపోయాయి. ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా ఎమ్మెల్యే పరిటాల సునీత అనుచరులు రెచ్చిపోతున్నారు. అధికారాన్ని అడ్డు పెట్టుకుని వ్యవస్థలను చెప్పచేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఎదురించినా.. ప్రశ్నించినా.. ప్రాణాలు తీసేస్తున్నారు. ఇలాంటి ఘటనలు రెండేళ్ల వ్యవధిలో పదుల సంఖ్యలో వెలుగు చూశాయి.
ఆరంభం నుంచి అల్లకల్లోలమే..
గతంలో ఆర్‌ఓసీ (రీ ఆర్గనైజింగ్ కమిటీ) పేరుతో మాజీ మంత్రి పరిటాల రవీంద్ర ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా అరాచకాలు సృష్టించారు. వందల మందిని హతమార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పట్లోనే మద్దెలచెరువు టీవీ బాంబు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. పరిటాల రవి హత్యా తర్వాత జిల్లాలో కొన్నేళ్ల పాటు ప్రశాంత వాతావరణం ఏర్పడింది. అయితే చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా రెండేళ్ల నుంచి అరాచకాలు వెలుగు చూస్తున్నాయి.
వేధింపులు.. దందాలు..
రాప్తాడు నియోజకవర్గ వ్యాప్తంగా టీడీపీ నాయకులందరూ దౌర్జన్యాలకు.. భూ దందాలకు దిగుతున్నారు. ఎదురించిన వారిని పోలీసులతో అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. ఈనెల 20న అనంతపురం రూరల్ మండలం ఆలమూరుకు చెందిన అంకె నరేంద్ర పోలీసుల వేధింపులతో పురుగుల మందు ఆత్మహత్యాయత్నం చేశాడు. తన మరణానికి పరిటాల సునీత అనుచరులే కారణమని సెల్ఫీ వీడియో తీసి బయటికి విడుదల చేశాడు.
రక్షణ కరువు..
రామగిరి, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు మండలాల్లో టీడీపీ వెంట తిరిగితే ఎలాంటి ఇబ్బందులు ఉండవని ప్రచారం చేస్తున్నారు. వైఎస్సార్‌సీపీలో ఉంటే ఇబ్బందులు తప్పవని బెదిరిస్తున్నారు. దీంతో కొన్ని ప్రాంతాల్లో సామాన్యులు బయట తిరగలేని పరిస్థితి నెలకొంది. రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత.. ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లోనే అరాచకాలు జరుగుతున్నాయని స్పష్టంగాా తెలుస్తోంది.
2025 మార్చి 30 – రామగిరి ఎంపీపీ ఉప ఎన్నిక సందర్భంగా వైఎస్సార్‌సీపీ సభ్యుల ఇళ్లపై టీడీపీ నాయకులు దాడికి దిగారు. ఇది పద్ధతి కాదని మందలించిన కురుబ లింగమయ్యను టీడీపీ కార్యకర్తలు దారుణంగా హత్య చేశారు. రామగిరి మండలం పాపిరెడ్డిపల్లిలో ఉగాది పండుగ రోజున జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. దౌర్జన్యాలను అడ్డుకునేందుకు వెళ్లిన వారిని అంతమొందించడాన్ని వైఎస్సార్‌సీపీ నేతలు తీవ్రంగా ఖండించారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాపిరెడ్డిపల్లికి వచ్చి లింగమయ్య కుటుంబ సభ్యులను పరామర్శించారు.
2025 మే 17 – భూ తగాదాలో చిగిచెర్ల నారాయణరెడ్డి, ముత్యాలమ్మ దంపతులను రాప్తాడులో దారుణంగా హత్య చేశారు. పరిటాల సునీత అండతోనే రాప్తాడుకు చెందిన 15 మంది వేట కొడవళ్లతో దారుణంగా చంపేశారు. భూ తగాదా కారణంగా కోర్టులో ఉన్న భూమిని పరిటాల సునీత అండతో రూ.4 కోట్లకు అగ్రిమెంట్ చేసుకున్నారు. అయితే ఆ భూమి విలువ రూ.20 కోట్లకు పైగా ఉంటుంది. ఈ క్రమంలో యజమానులు ఎదురు నిలిచారు. దీంతో ఆ భూమి తమదేనంటూ దౌర్జన్యంగా పొలంలోకి వచ్చి.. నారాయణరెడ్డి దంపతులను నరికి చంపారు.
2026 జూలై 21 – ఇవ్వాల్సిన అప్పు అడిగినందుకు కనగానపల్లి మండల కేంద్రంలో అంకె నగేష్‌ను అదే గ్రామానికి చెందిన బోయ అక్కులప్పతో పాటు మరికొందరు టీడీపీ కార్యకర్తలు రాళ్లతో కొట్టి చంపారు. మమ్మల్నే డబ్బులు తిరిగి అడుగుతావా? అంటూ బెదిరించారు. డబ్బులు ఇవ్వకుంటే పోలీసులను ఆశ్రయిస్తానని నగేశ్ సమాధానం చెప్పగా.. వెంటనే అక్కులప్ప కుటుంబ సభ్యులందరూ కలిసి నగేశ్‌పై దాడి చేసి చంపేశారు.


