‘ప్రైవేటు’ చదువే దిక్కు | - | Sakshi
Sakshi News home page

‘ప్రైవేటు’ చదువే దిక్కు

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

చిత్రంలోని విద్యార్ధి పేరు లోకేష్‌. ఇటీవలే ఇంటర్‌ పూర్తి చేశాడు. ఇప్పుడు డిగ్రీ చదవాలనుకున్నా.. హిందూపురంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేదు. దీంతో నిరుపేద కుటుంబానికి చెందిన లోకేష్‌ అప్పులు చేసి ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్‌ పొందాడు. కానీ ఇలా అప్పు చేసే ధైర్యం కూడా లేక చాలా మంది నిరుపేద కుటుంబాల్లోని విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమవుతున్నారు.

హిందూపురం టౌన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు బావమరిది, సినీ హీరో బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురంలో బాలురకు ఇంటర్‌, డిగ్రీ ప్రభుత్వ కళాశాలలు అందుబాటులో లేవు. దీంతో ఇక్కడి విద్యార్థులకు ప్రైవేటు కళాశాలలే ప్రత్యామ్నాయంగా మారాయి. అయితే వేలాది రూపాయల ఫీజులు, ఇతర ఖర్చులు భరించే స్థోమత లేకపోవడంతో అనేక మంది విద్యార్థులు చదువులను మధ్యలోనే నిలిపివేస్తున్నారు.

పేరు గొప్ప.. ఊరు దిబ్బ

హిందూపురం వాణిజ్య పరంగా, విద్య పరంగా జిల్లాలోనే పేరుగాంచింది. పట్టణంలో 2 లక్షల దాకా జనాభా ఉన్నారు. సెలక్షన్‌ గ్రేడ్‌ మున్సిపాలిటీ కూడా. నియోజకవర్గంలోని రూరల్‌ మండలంతోపాటు లేపాక్షి, చిలమత్తూరు మండలాలకు చెందిన విద్యార్థులు విద్యనభ్యసించడానికి ఇక్కడికే రావాలి. అయితే ఇప్పటి వరకు పట్టణంలో బాలురకు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు లేకపోవడం ఇక్కడ పరిస్థితులకు అద్దం పడుతోంది. ప్రభుత్వ కళాశాల అందుబాటులో ఉంటే పేద విద్యార్థులకు ఆర్థిక భారం తగ్గడమే కాకుండా ఉన్నత విద్యలో చేరికలు కూడా పెరిగే అవకాశం ఉంది.

ప్రైవేటు చదువే దిక్కు..

హిందూపురంలో 14 వరకు ప్రైవేటు జూనియర్‌, డిగ్రీ కళాశాలలున్నాయి. ఆయా కళాశాలల్లో 15 వేల మంది దాకా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అలాగే ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల, మహిళా డిగ్రీ కళాశాలలున్నాయి. ఇందులో 1,200 నుంచి 1,300 మంది వరకూ విద్యార్ధినులు చదువుతున్నారు. అయితే బాలురకు ప్రభుత్వ జూనియర్‌, డిగ్రీ కళాశాలలు లేకపోవడంతో ప్రైవేటు కళాశాలలే దిక్కవుతున్నాయి. దీంతో చాలా మంది పేద విద్యార్థులు చదువుకు దూరమవుతున్నారు. వ్యవసాయ కూలీలు, రోజువారీ కూలీలు, ఆటో డ్రైవర్లుగా మారిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే హిందూపురం పరిసర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యను కొనసాగించే నిరుపేద విద్యార్థుల సంఖ్య కూడా తగ్గుతోంది.

హామీని అటకెక్కించిన బాలకృష్ణ..

హిందూపురం ప్రజలు టీడీపీ స్థాపించినప్పటి నుంచి టీడీపీ అభ్యర్థులను, నందమూరి వంశాన్ని ఆదర్శిస్తూ వస్తున్నారు. అయినా వారు హిందూపురానికి ఏ మాత్రం న్యాయం చేయలేకపోయారు. ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన నందమూరి బాలకృష్ణ... ఎన్నికల సమయంలో హిందూపురంలో ప్రభుత్వ బాలుర జూనియర్‌, డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేస్తానని వాగ్దానం చేశారు. నేటికీ ఆ హామీని నేరవేర్చలేకపోయారు.

బాలుర ప్రభుత్వ కళాశాలలకు నోచుకోని హిందూపురం

‘ప్రైవేటు’ ఫీజులు చెల్లించలేక విద్యకు దూరమవుతున్న నిరుపేదలు

ఏళ్లుగా విన్నవిస్తున్నా కనీసం పట్టించుకోని ఎమ్మెల్యే బాలకృష్ణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement