‘సర్‌’ సకాలంలో పూర్తి కావాలి | - | Sakshi
Sakshi News home page

‘సర్‌’ సకాలంలో పూర్తి కావాలి

Jul 23 2026 2:00 AM | Updated on Jul 23 2026 2:00 AM

అమడగూరు: ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) ప్రక్రియ ప్రభుత్వం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని కస్సముద్రం గ్రామ సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ‘సర్‌’ ప్రక్రియలో భాగంగా ఎన్యుమరేషన్‌ ఫారాల డిజిటలైజేషన్‌ ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. సిబ్బందితో మాట్లాడి ఎదురువుతున్న సాంకేతిక అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఏ సమస్య వచ్చినా ఉన్నతాధికారులకు తెలిపి ప్రక్రియ సకాలంలో పూర్తి చేయాలన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు. తొలుత ఓపీ రిజిస్ట్రేషన్‌ కౌంటర్‌, ల్యాబ్‌, ఇన్‌–పేషెంట్‌ వార్డు, లేబర్‌రూం, మందుల నిల్వ గదిని పరిశీలించారు. చికిత్స కోసం వచ్చిన రోగులతో మాట్లాడారు. అందుతున్న వైద్యసేవలు, మందులు, పరీక్షల గురించి అడిగి తెలుసుకున్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని, మందుల కొరత లేకుండా చూసుకోవాలని వైద్యులకు సూచించారు. అనంతరం కలెక్టర్‌ స్థానిక తహసీల్దార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. రికార్డులు పరిశీలించి ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవల గురించి ఆరా తీశారు. వివిధ సమస్యలపై అందే అర్జీలను సకాలంలో పరిష్కరించాలన్నారు. అక్కడే ఉన్న ప్రజలతో మాట్లాడి అధికారులు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. అలాగే ఆదర్శ పాఠశాలను తనిఖీ చేసి తరగతి గదులను, రికార్డులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో మాట్లాడి విద్యాభ్యాసం, పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. మధ్యాహ్న పథకం అమలు తీరును, వంటగది పరిశుభ్రతను తనిఖీ చేశారు. ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని సిబ్బందికి ఆదేశించారు. విధుల్లో నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తప్పవని హెచ్చరించారు. కలెక్టర్‌ వెంట తహసీల్దార్‌ మారుతీ ప్రకాశ్‌, ఎంపీడీఓ శకుంతల, వైద్యాధికారి అపర్ణ, ఏపీఓ మధుసూదన్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్‌ జేఈ అనిల్‌కుమార్‌, ఏఓ వెంకటరమణాచారి, ఉపాధ్యాయులు, సచివాలయ సిబ్బంది ఉన్నారు.

అధికారులకు కలెక్టర్‌ ఆదేశం

కస్సముద్రం రగ్రామ సచివాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదర్శ పాఠశాల తనిఖీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement