పెనుకొండ (సోమందేపల్లి): రాష్ట్ర బీసీ సంక్షేమ, చేనేత శాఖ మంత్రి సవిత ప్రధాన అనుచరుడు, సగర కార్పొరేషన్ చైర్మన్ రంగేపల్లి వెంకటరాముడు దురహంకారం ప్రదర్శించారు. తమ సమస్యలు చెప్పుకునేందుకు వచ్చిన దళితులను నేలపై కూర్చోబెట్టి వారి ఎదురుగా కుర్చీలో కూర్చుని దర్జా చూపారు. ఈ ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారడంతో దళిత సంఘాలన్నీ భగ్గుమన్నాయి. వివరాల్లోకి వెళితే.. సోమందేపల్లి మండలం మాగేచెరువు ఎస్సీ కాలనీ వాసులు తమ సమస్యలు చెప్పుకునేందుకు రంగేపల్లి గ్రామంలోని సగర కార్పొరేషను చైర్మన్ రంగేపల్లి వెంకటరాముడు ఇంటికి వెళ్లారు. అయితే సగర కార్పొరేషన్ చైర్మన్‌తో పాటు అక్కడున్న సోమందేపల్లి సింగిల్ విండో అధ్యక్షుడు, మాగేచెరువు ఉప్పర వెంకటేసులు, ఇతర టీడీపీ నాయకులు దళితుల పట్ల దారుణంగా వ్యహరించారు. సామాజిక సమానత్వం మరచి దళితులను నేలపై కూర్చోబెట్టి వారంతా ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నారు. తమకు అవమానం జరుగుతోందని తెలిసినా ఏం చేయలేని దళితులు తమ సమస్యలు చెప్పుకుని అక్కడి నుంచి భారంగా ఇళ్లకు వెళ్లిపోయారు. అయితే దళితులను నేలపై కూర్చోబెట్టి టీడీపీ నాయకులు దర్జా చూపుతున్న ఫొటో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో దళిత సంఘాల నేతలు భగ్గుమన్నారు. అహంకార పూరితంగా వ్యవహరించి దళితుల ఆత్మగౌరవానికి భంగం కలిగించిన సగర కార్పొరేషన్ చైర్మన్ వెంకటరాముడు, టీడీపీ నాయకులు వెంటనే క్షమాపణ చెప్పాలని, టీడీపీ అధిష్టానం వెంకటరాముడును పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు.
దళితులను నేలపై కూర్చోబెట్టి
అధికార దర్పం
భగ్గుమన్న దళిత సంఘాలు..
క్షమాపణ చెప్పాలని డిమాండ్


