పరిగి: మండలంలోని పెన్నా, జయమంగళి నదుల నుంచి ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని, ఇందుకోసం రెవెన్యూ, పోలీసు అధికారులు గట్టి నిఘా ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ ఆదేశించారు. బుధవారం ఆయన పరిగి మండలంలో పర్యటించారు. మండలంలో స్థానిక అవసరాలకు మాత్రమే ఇసుకను ఉచితంగా పొందవచ్చని, అలాకాకుండా కర్ణాటక, ఇతర ప్రాంతాలకు తరలిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనుమతుల పేరిట అక్రమంగా ఇసుకను తవ్వితే ఉపేక్షించబోమన్నారు. ఇక భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి నిర్వహిస్తున్న సమగ్ర రీసర్వే పారదర్శకంగా జరగాలని జాయింట్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ అధికారులను ఆదేశించారు. బుధవారం ఆయన మండలంలోని ఊటుకూరు, శిరేకోలం, పి నరసాపురం గ్రామాల్లో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పరిశీలించారు. ఉమ్మడి ఖాతాల విభజన, నమోదులో సమస్యలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
ఉరివేసుకొని
నర్సింగ్ విద్యార్థిని ఆత్మహత్య
పుట్టపర్తి అర్బన్: మార్కులు తక్కువగా వచ్చాయని మనస్తాపం చెందిన ఓ నర్సింగ్ విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన బుధవారం పుట్టపర్తి మండలం బడేనాయక్ తండాలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు... బడేనాయక్ తండాకు చెందిన అంబాజీ నాయక్, కళావతీబాయి దంపతులకు ఇద్దరు కుమార్తెలు సంతానం. పెద్ద కుమార్తె యువతీ బాయి(24) కర్నూలులో బీఎస్సీ నర్సింగ్ (ఆప్తమాలజీ) చివరి సంవత్సరం చదువుతోంది. ఇటీవల జరిగిన పరీక్షల్లో మార్కులు తక్కువగా రావడంతో తీవ్ర మనస్తాపం చెందింది. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం స్వగ్రామానికి వచ్చింది. నిత్యం దీర్ఘాలోచనలో ఉండేది. కుటుంబ సభ్యులతోనూ సరిగా మాట్లాడకుండా ముభావంగా ఉండేది. ఏమైందో ఏమో గానీ బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుంది. పొలం పనులకు వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి తిరిగి వచ్చి చూసే సరికి కుమార్తె ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. వెంటనే కిందకు దించి చూడగా..అప్పటికే మృతి చెంది ఉంది. దీంతో వారు కన్నీరుమున్నీరయ్యారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇవ్వగా.. రూరల్ ఎస్‌ఐ క్రాంతి సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. తండ్రి అంబాజీ నాయక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పెనుకొండ ఆసుపత్రికి తరలించారు.
భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించండి
ప్రశాంతి నిలయం: జిల్లాలో వివిధ ప్రాజెక్టుల కోసం రైతుల నుంచి సేకరించిన భూమికి సంబంధించిన పరిహారం వెంటనే అందించాలని కలెక్టర్ శ్యాం ప్రసాద్ ఆదేశించారు. బుధవారం ఆయన జేసీ మౌర్య భరద్వాజ్‌తో కలిసి కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చిలమత్తూరు మండలం టేకులోడు పరిధిలో 607.06 ఎకరాల ప్రభుత్వ భూమిని సేకరించామని, ఆయా భూములను సాగుచేసుకుంటున్న వారికి రూ.76.85 కోట్ల పరిహారం అందించే ప్రక్రియ జరుగుతోందన్నారు. ఇక పట్టా భూముల సేకరణలో 132.21 ఎకరాలకు మార్కెట్ విలువ ప్రకారం రూ.23.18 కోట్లు చెల్లింపుల ప్రక్రియ పూర్తయ్యిందన్నారు. అలాగే మలుగూరు వద్ద 119.84 ఎకరాలకు రూ.15.25 కోట్ల పరిహారం ఇస్తామన్నారు. కొండూరు వద్ద 1,074 ఎకరాలకు సంబంధించిన సర్వే పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. లేపాక్షి వద్ద 313.31 ఎకరాల సేకరణకు పబ్లిక్ నోటీసులు ఇచ్చామన్నారు. గౌడనహళ్లి గ్రామంలో 571 ఎకరాల భూ సేకరణకు ఆమోదం లభించిందని, ముదిగుబ్బ మండలం బండ్లపల్లి వద్ద 224.35 ఎకరాల భూమికి డీకేటీ నోటీసులు జారీ చేసి ఎక్స్‌గ్రేషియా నివేదికల ఆమోదం ప్రక్రియ కొనసాగుతోందన్నారు. హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ నుంచి పుట్టపర్తి నియోజకవర్గంలోని 195 చెరువులకు నీళ్లు అందించే ప్రక్రియలో భాగంగా 6 మండలాల పరిధిలో 37 గ్రామాల్లో 141.50 కిలోమీటర్ల మేర కాలువ పనులు చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే 119 కిలోమీటర్ల మేర సర్వే పూర్తయిందన్నారు.


