24న కదిరిలో జాబ్‌మేళా | - | Sakshi
Sakshi News home page

24న కదిరిలో జాబ్‌మేళా

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

ప్రశాంతి నిలయం: ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24న కదిరి ఎస్‌టీఎస్‌ఎన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ శ్యాంప్రసాద్‌, జేసీ మౌర్య భరద్వాజ్‌ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని పీజీఆర్‌ఎస్‌ హాల్‌లో జాబ్‌మేళా పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాబ్‌ మేళాకు 11 బహుళ జాతీయ కంపెనీలు వస్తున్నాయని చెప్పారు. పది నుంచి బీటెక్‌, డిగ్రీ చదివిన విద్యార్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్లతో ఉదయం 9 గంటలకు హాజరు కావాలని సూచించారు. సెలెక్ట్‌ అయిన అభ్యర్థులకు నెలకు జీతం రూ.15 నుంచి రూ.25 వేల వరకూ ఉంటుందన్నారు. వివరాలకు 9390176421, 9440074407ను సంప్రదించాలన్నారు.

ధర్మవరం, మడకశిర

ఆర్డీఓల నియామకం

ధర్మవరం అర్బన్‌/మడకశిర: ధర్మవరం ఆర్డీఓగా రాంభూపాల్‌రెడ్డితో పాటు మడకశిర ఆర్డీఓగా నాగప్రసన్నలక్ష్మిని నియమించినట్లు మంగళవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ధర్మవరం ఆర్డీఓగా పనిచేసిన మహేష్‌ నాలుగు నెలల క్రితం బదిలీపై వెళ్లారు. ప్రస్తుతం పుట్టపర్తి ఆర్డీఓ సువర్ణ ఇన్‌చార్జ్‌ ఆర్డీఓగా వ్యవహరిస్తున్నారు. నంద్యాలలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పనిచేస్తున్న రాంభూపాల్‌రెడ్డిని ధర్మవరం ఆర్డీఓగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మడకశిర ఆర్డీఓగా నాగ ప్రసన్న లక్ష్మిని నియమించారు. ఇటీవలే మడకశిర కేంద్రంగా రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటైంది. అయితే అప్పట్లో రెగ్యులర్‌ ఆర్డీఓను ప్రభుత్వం నియమించలేదు. ఇన్నిరోజులుగా పెనుకొండ ఆర్డీఓ ఆనంద్‌కుమార్‌ ఇన్‌చార్జ్‌ ఆర్డీఓగా కొనసాగారు. ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌గా పని చేస్తున్న నాగ ప్రసన్నలక్ష్మిని మడకశిర ఆర్డీఓగా నియమించారు. త్వరలోనే వారు బాధ్యతలు స్వీకరించనున్నారు.

కాంట్రాక్టు అధ్యాపకులు హాజరుకండి

కదిరి అర్బన్‌: జిల్లాలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తూ ఐదేళ్లు పూర్తి చేసుకున్న కాంట్రాక్ట్‌ అధ్యాపకులు రెన్యూవల్‌ కోసం బుధవారం పుట్టపర్తి కలెక్టరేట్‌ కార్యాలయం వద్ద హాజరు కావాలని జిల్లా ఐడీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్‌ సలీంబాషా ఒక ప్రకటనలో తెలిపారు.

మడకశిర ఐసీడీఎస్‌ కార్యాలయంలో

ఏసీబీ తనిఖీలు

పౌష్టికాహార పంపిణీలో

జరిగిన అవకతకలపై విచారణ

మడకశిర: మడకశిరలోని ఐసీడీఎస్‌ ప్రాజెక్ట్‌ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు చేశారు. ఏసీబీ సీఐ జయమ్మ ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల దాకా కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానంగా 2021లో ప్రాజెక్ట్‌ పరిధిలో చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు ఇవ్వాల్సిన పౌష్టికాహారం పక్కదారి పట్టిపట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో సీడీపీఓగా విజయకుమారి పని చేశారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు అప్పట్లో విచారణకు ఆదేశించారు. ఏసీబీ అధికారులు అప్పట్లోనే విచారణ చేపట్టి పలు రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన విచారణ తుది దశకు చేరుకుంది. ఈక్రమంలో ఏసీబీ అధికారులు మరోసారి ఐసీడీఎస్‌ కార్యాలయానికి వచ్చి పలు రికార్డులను పరిశీలించారు. 2021లో పనిచేసిన ఐసీడీఎస్‌ అధికారులు, సిబ్బంది కూడా హాజరయ్యారు. అయితే గత విచారణకు ఇది కొనసాగింపు అని, మీడియాకు తెలపాల్సిన విషయాలు ఏమీలేవని సీఐ జయమ్మ పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement