ధర్మవరం: పట్టుచీరలకు ప్రఖ్యాతి గాంచిన ధర్మవరంలో 20 వేలకుపైగా చేనేత మగ్గాలు ఉన్నాయి. అలాగే ఉమ్మడి అనంతపురం జిల్లాలో చేనేత కేంద్రాలైన ధర్మవరం, గోరంట్ల, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం, ఉరవకొండ తదితర ప్రాంతాలలో 48 వేల మందికి పైగా చేనేత రంగంపై ఆధార పడి పని చేస్తున్నారు. గతంలో వీరికి చేతినిండా పని ఉండేది. ప్రభుత్వాల సాయమూ ఉండటంతో నేతన్నలు హాయిగా ఉండేవారు. కానీ చంద్రబాబు సర్కార్ అధికారంలోకి వచ్చాక పరిస్థితి తిరగబడింది. రేషం, వార్పు, జరీ ధరలు 40 శాతం పెరిగిపోయాయి. అమ్మకాలు భారీగా తగ్గాయి. సర్కారు నుంచి సాయం నిలిచిపోయింది. ఉపాధి కరువైన చేనేత కార్మికులు వలస బాట పట్టారు. అప్పుల బాధతో ఎందరో నేతన్నలు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నారు. దీంతో నేతన్నల నుంచి విమర్శలు వెల్లువెత్తుతుండగా... చంద్రబాబు ప్రభుత్వం మరో మోసానికి తెరతీసింది. ‘నేతన్న భరోసా’ పేరుతో ఒక్కో చేనేత కుటుంబానికి రెండేళ్ల నుంచి ఇవ్వాల్సిన రూ.50 వేలు ఎగ్గొట్టి అరకొర నిధులతో తూతూ మంత్రంగా మమ అనిపించేందుకు సిద్ధమైంది.
జగన్ చొరవతో ‘నేతన్న నేస్తం’
2014 – 2019 మధ్య కాలంలో చేనేత రంగాన్ని అప్పటి సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేశారు. ప్రతినెలా ముడిపట్టుపై ప్రభుత్వం చేనేతలకు ఇచ్చే రాయితీ రూ.600 సక్రమంగా అందించలేదు. దీనికి తోడు తాము అధికారంలోకి వస్తే పరిహారాన్ని రూ.వెయ్యికి పెంచుతామని 2014 ఎన్నికలకు ముందు చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక సక్రమంగా అమలు చేయక పోగా 20 నెలల ముడిపట్టు రాయితీ బకాయిలను పెండింగ్‌లో పెట్టి చేనేతలను ఇబ్బందులకు గురి చేశారు. అప్పట్లో ప్రభుత్వ తీరుకు నిరసనగా మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో నేతన్నలు పోరాటం ఉధృతం చేశారు. ధర్మవరంలో ఏకంగా 37 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశారు. నేతన్నల ఉద్యమానికి సంఘీభావం తెలిపిన అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ధర్మవరానికి వచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక పరిహారాన్ని ప్రతినెలా రూ.2 వేలు ఇస్తామని 2017 అక్టోబర్ 17న నేతన్నల సాక్షిగా ధర్మవరంలో హామీ ఇచ్చారు. 2019లో అధికారంలోకి రాగానే తన పుట్టిన రోజున (డిసెంబర్ 21న) ‘నేతన్న నేస్తం’ పథకం పేరుతో ఒకేసారి రూ.24 వేలు నేతన్నల ఖాతాలో ముడిపట్టు రాయితీని జమ చేశారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఏటా సాయం అందించారు. ఈ విధంగా ఐదేళ్ల పాటు ఒక్కో చేనేత కుటుంబానికి రూ.1.20 లక్షల సాయాన్ని అందించారు. ఇలా జిల్లాలోని చేనేత కార్మికులకు రూ.178 కోట్లు, అందులోనూ ధర్మవరం నియోజకవర్గంలోని చేనేత కార్మికులకే రూ.136 కోట్లు ఖాతాల్లో జమ చేశారు.
పేరు మార్చి, నేతన్నలను ఏమార్చి
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 2024, 2025 సంవత్సరాల్లో ‘నేతన్న నేస్తం’ పథకాన్ని అటకెక్కించారు. నేతన్నల నుంచి తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం అవుతున్న తరుణంలో తాజాగా పథకం పేరును ‘నేతన్నకు భరోసా’గా మార్చారు. రెండేళ్ల సాయాన్ని పక్కనపెట్టి ఈ ఏడాది నుంచి రూ.25 వేలు ఇస్తామని చెబుతున్నారు. దీంతో ఒక్కో చేనేత కుటుంబం రెండేళ్ల సాయం రూ.50 వేలు నష్టపోతోంది. పథకం అమలుకు ప్రభుత్వం విడుదల చేసిన జీఓ ప్రకారం రూ.252 కోట్ల నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. ఈ పథకం కింద చేనేతలతో పాటు అనుబంధ రంగాలైన రంగుల అద్దకం, బోట్లు చుట్టేవారు, పాలిష్ చేసే వారు నేత కార్మికులు అందరికీ సాయం వర్తింపజేస్తామని చెబుతున్నారు. ఇన్ని వేల మందికి రూ.252 కోట్లు ఏ మూలకు సరిపోతాయని నేతన్నలు ప్రశ్నిస్తున్నారు. పైగా ఆగస్టు 7న చేనేత దినోత్సవం రోజున కార్మికుల ఖాతాలలో నగదు జమ చేస్తున్నామని చెప్పగా.. ఇంత వరకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ మొదలు కాకపోవడంతో పథకం అమలుపై సందేహాలు నెలకొన్నాయి.
ఆందోళనకు సిద్ధమైన వైఎస్సార్‌సీపీ..
చంద్రబాబు ప్రభుత్వ మోసాన్ని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఆందోళనకు సిద్ధమైంది. చంద్రబాబు ప్రభుత్వం చెప్పిన విధంగా ఒక్కో చేనేత కుటుంబానికి రూ.25 వేల చొప్పున మూడేళ్లకు కలిపి రూ.75 వేలు జమ చేయాలన్న డిమాండ్‌తో నేడు (గురువారం) ధర్మవరంలో భారీ నిరసన ర్యాలీ చేపట్టనున్నట్లు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి తెలిపారు.
రెండేళ్లుగా ‘నేతన్న నేస్తం’
ఊసెత్తని చంద్రబాబు
తాజాగా ‘నేతన్న భరోసా’ పేరుతో ఏడాదికి రూ.25 వేలంటూ ప్రచారం
అరకొర నిధులతో పథకం
తూతూమంత్రంగా ముగించేలా ప్లాన్
చంద్రబాబు మోసంపై
వైఎస్సార్‌సీపీ ఆగ్రహం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ఆధ్వర్యంలో నేడు భారీ నిరసన ర్యాలీ
తీవ్రమైన ఆర్థిక మాంద్యం.. పెరిగిన ముడిపట్టు ధరలతో ధర్మవరం పట్టుచీర మెరుపు తగ్గింది. నేతన్న బతుకు దుర్భరమైంది. ఆదుకుని అండగా నిలవాల్సిన చంద్రబాబు నేతన్నలను మోసం చేశారు. ‘నేతన్న నేస్తం’ పథకం ద్వారా అందించే ఆర్థిక సాయాన్నీ రెండేళ్లుగా నిలిపి వేశారు. నేతన్నల నుంచి ఒత్తిడి పెరగడంతో ‘నేతన్నకు భరోసా’ అంటూ కొత్త రాగం అందుకున్నారు. అరకొర విదిల్చి ప్రచారం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే చంద్రబాబు చేసిన మోసాన్ని వివరిస్తూ
నేతన్నలకు అండగా నిలిచేందుకు
గురువారం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి
భారీ నిరసన ర్యాలీ నిర్వహిస్తున్నారు.


