తండ్రి కళ్లెదుటే కుమారుడి దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

తండ్రి కళ్లెదుటే కుమారుడి దుర్మరణం

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

రాప్తాడు రూరల్‌: ఒక్కగానొక్క కొడుకు.. వ్యాపారంలో తండ్రికి తోడుగా.. కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాడనుకున్నారు.. తండ్రీ కుమారుడు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్‌ నుంచి సొంతూరు లేపాక్షి మండలం పిల్లిగుండ్ల కాలనీకి బయల్దేరారు.. రాప్తాడు మండలం మరూరు సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్ల వద్ద నెమ్మదించిన కొడుకు బైక్‌ను ఐచర్‌ వాహనం మృత్యువు రూపంలో కబళించింది. కళ్లెదుటే కన్నకొడుకు ప్రాణాలు విడుస్తుంటే.. ఆ తండ్రి గుండె ఆగినంత పనైంది. ఈ హృదయ విదారక ఘటన గొల్లపల్లి టోల్‌గేట్‌ సమమీపంలో మంగళవారం చోటు చేసుకుంది.

లేపాక్షి పంచాయతీ పరిధిలోని పిల్లిగుండ్లకాలనీకి చెందిన వెంకటస్వామి, ఆయన కుమారుడు విశాక్‌రాజ్‌ (24) ఔషధ మూలికలు, టూత్‌ బ్రష్‌లు విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. వ్యాపార నిమిత్తం తండ్రీకొడుకులు వేర్వేరు ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్‌కు వెళ్లి తిరుగు పయనమయ్యారు. తీరా రాప్తాడు మండలం గొల్లపల్లి టోల్‌గేట్‌ దాటిన తర్వాత మరూరు సమీపంలోని స్పీడ్‌ బ్రేకర్ల వద్ద విశాక్‌రాజ్‌ తన బైక్‌ను నెమ్మదించగా, వెనుక నుంచి అతివేగంగా వచ్చిన ఐచర్‌ వాహనం అదుపుతప్పి బైక్‌ను ఢీకొట్టింది. దీంతో విశాక్‌రాజ్‌ రోడ్డుపై పడిపోగా, అతడి మీదుగా ఐచర్‌ వాహనం దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. కొద్ది సేపటికే వెనుక వచ్చిన తండ్రి వెంకటస్వామి.. తన కుమారుడు రక్తపు మడుగులో పడి ఉండడాన్ని చూసి బోరున విలపించాడు. కుటుంబానికి ఏకై క కుమారుడైన విశాక్‌రాజ్‌ మృతితో తల్లిదండ్రులు, ముగ్గురు సోదరీమణులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ ఘటనతో పిల్లిగుండ్లకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న రాప్తాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఐచర్‌ వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

విశాక్‌రాజ్‌ (ఫైల్‌)

హైదరాబాద్‌ నుంచి బైక్‌లో వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం

కొడుకు మృతదేహం వద్ద విలపించిన తల్లిదండ్రులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement