కొందరికే ‘తల్లికి వందనం’ | - | Sakshi
Sakshi News home page

కొందరికే ‘తల్లికి వందనం’

Jul 22 2026 2:23 AM | Updated on Jul 22 2026 2:23 AM

పుట్టపర్తి అర్బన్‌: తల్లికి వందనం పథకం కింద నీకు రూ.15 వేలు, నీకు రూ.15 వేలు అంటూ ఎన్నికల ప్రచారంలో కూటమి నేతలు ఊదరకొట్టారు. తీరా అధికారంలోకి వచ్చాక అది కాస్తా రూ.13 వేలే అయింది. అందులోనూ నిబంధనల పేరుతో వేలాది మందికి మొండి చేయి చూపారు. మొదటి విడతలో మాదిరిగానే రెండో ఏడాది సైతం ఎంతో మంది తల్లులకు వెన్నుపోటు పొడిచారు.

నేడు నిధులు విడుదల..

ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు మొత్తాన్ని తల్లి ఖాతాలకు నేడు జమ చేయనున్నారు. ఎన్నికల్లో రూ.15 వేలు ప్రకటించినా కేవలం రూ.13 వేలు మాత్రమే జమ చేస్తుండటం విశేషం. తక్కిన రూ.2 వేలు పాఠశాలల అభివృద్ధికి వినియోగిస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇప్పటి వరకూ ఒక్క పాఠశాలకు కూడా అభివృద్ధికి నిధులు విడుదల చేయలేదు. దీంతో జిల్లాలోని ఎన్నో పాఠశాలల భవనాలు అధ్వానంగా మారాయి.

14,061 మందికి ఎగనామం..

జిల్లాలో ఒకటి నుంచి పదో తరగతి పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్‌, మొదటి, రెండో సంవత్సరం విద్యార్థులకు ఈ పథకం కింద నగదు జమ చేయనున్నారు. ఒకటి నుంచి పది వరకూ 2,33,701 మంది ఉన్నారు. ఇంటర్‌లో 23,255 కలిపి మొత్తం 2,56,956 మంది ఉన్నారు. వీరందరికీ నిధులు జమ చేయాల్సి ఉంది. అయితే కేవలం 2,42,895 మందికి మాత్రమే నిధులు జమ చేస్తున్నారు. దీంతో సుమారు 14,061 మంది విద్యార్థులకు మొండిచేయి చూపినట్లవుతోంది. పథకానికి అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు సుమారు 1,56,296 మంది ఉన్నట్లు అధికారులు చెప్పారు.

మొదటిరోజు జమ కాక పోతే అంతే..

తల్లికి వందనం పథకంలో భాగంగా ప్రభుత్వం బుధవారం విద్యార్థుల తల్లుల ఖాతాలకు నిధులు జమ చేయనుంది. మొదటి రోజు ఖాతాలకు నిధులు జమ కాకుంటే మళ్లీ డబ్బులు పడే పరిస్థితి లేదంటున్నారు. నిధులు జమ కాకపోతే పాఠశాల, ఎంఈఓ, డీఈఓ కార్యాలయాల్లోనూ సమాచారం ఉండదు. సచివాలయాలు ఇతర కార్యాలయాల్లోనూ తల్లికి వందనం గురించి చెప్పేనాథుడే ఉండరు. గత ఏడాది డబ్బులు నేటికీ జమకాని వారు వేలాది మంది ఉన్నారు. వారంతా కార్యాలయాల చుట్టూ తిరిగి అలసిపోయారు.

నిబంధనల పేరుతో

14,061 మందికి డబ్బులు కట్‌

నేడు తల్లుల ఖాతాల్లోకి

డబ్బు జమచేస్తామన్న ప్రభుత్వం

జిల్లాలో 2,42,895 మందికి లబ్ధి

ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకంలో జిల్లాలోని 2,42,895 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది. తల్లులు సుమారు 1,56,296 మంది ఉన్నారు. వారి ఖాతాలు సక్రమంగా ఉంటే పథకాన్ని ప్రారంభించిన వెంటనే నిధులు జమ అవుతాయి. ఖాతాలకు ఆధార్‌, లింక్‌, ఏపీసీఐ ప్రక్రియ, ఆధార్‌కు ఫోన్‌ లింకు చేసుకోవాలని ఇప్పటికే సూచించాం.

– శ్రీలక్ష్మీ, జీఎస్‌డబ్ల్యూస్‌ జిల్లా అధికారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement