జీవితాలతో ‘ఆట’లు | - | Sakshi
Sakshi News home page

జీవితాలతో ‘ఆట’లు

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

సాక్షి, పుట్టపర్తి జూదం జిల్లాలో జూలు విదుల్చుతోంది. అరికట్టాల్సిన వారే ఆడిస్తుండటంతో రాత్రింబవళ్లు పేకాట జోరుగా జరుగుతోంది. కూటమి పార్టీల నాయకుల కనుసన్నల్లోనే పేకాట దందా కొనసాగుతుండగా... పోలీసులు అటువైపు కన్నెత్తి చూడలేని పరిస్థితి నెలకొంది. అయితే ఉన్నతాధికారులు మందలించినప్పడు, పేపర్లలో కథనాలు వచ్చినప్పుడు మాత్రం హడావుడిగా దాడులు చేసి అడపాదడపా కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నారు.

రాత్రి పగలు తేడా లేకుండా...

కూటమి పార్టీల్లోని కొందరు నేతలు సిండికేటుగా మారి రోజుకో చోట పేకాట ఆడిస్తున్నారు. ఈ మేరకు పేకాటరాయుళ్లకు ముందుగానే సమాచారం ఇస్తున్నారు. దీంతో ఉదయం 7 గంటలకే వారి స్థావరానికి చేరిపోతుండగా...అప్పుడే మొదలయ్యే ఆట..అర్ధరాత్రి వరకు జరుగుతోంది. హిందూపురం, మడకశిర, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, తాడిమర్రి, రామగిరి చుట్టుపక్కల రాత్రింబవళ్లు పేకాట జరుగుతోందని సమాచారం. పొరుగు రాష్ట్రం కర్ణాటక నుంచి ఎక్కువ మంది ఆటగాళ్లు వస్తున్నట్లు తెలిసింది. నగదు తెచ్చుకుంటే ఇబ్బందులు ఎదురవుతాయని డిజిటల్‌ లావాదేవీలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకొన్ని చోట్ల రంగు రంగుల కాయిన్‌లను ఇచ్చి.. ఒక్కో రంగుకు రేటు ఫిక్స్‌ చేసి ఆడిస్తున్నారు. అందుకే పోలీసులు ఎక్కడైనా పేకాట స్థావరంపై దాడి చేసినా నగదు పెద్దగా దొరకడం లేదు.

జీవితం ‘ముక్క’లు

కర్ణాటక ప్రాంతానికి చెందిన పేకాటరాయుళ్లు ఆటపై ఆసక్తితో సరిహద్దు దాటి రూ.లక్షలు చేత పట్టుకుని జిల్లాకు వస్తున్నారు. ఏజెంట్లకు కమీషన్లు ముట్టజూపి యథేచ్ఛగా పేకాట ఆడుతున్నారు. పోలీసుల అలసత్వంతోనే.. పేకాట శిబిరాలు ఎక్కడపడితే అక్కడ వెలిసినట్లు తెలుస్తోంది. సరదాగా మొదలయ్యే పేకాట... వ్యసనంగా మారి ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా దెబ్బ తీస్తోంది. అక్కడక్కడా పోలీసులు దాడులు చేస్తున్నా... అధికార పార్టీ నాయకుల ప్రమేయంతో మొక్కుబడిగా కేసులు కట్టి చేతులు దులుపుకొంటున్నారు.

ఆట కట్టిస్తాం

పేకాట స్థావరాలపై ప్రత్యేక నిఘా ఉంచాం. డ్రోన్‌ కెమెరాలతో ప్రత్యేక నిఘా ఉంచుతున్నాం. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గే ప్రసక్తే లేదు. పేకాటరాయుళ్ల ఆగడాలు అరికట్టేందుకు ప్రత్యేక బలగాలను రంగంలోకి దింపాం.

– ఎస్‌.సతీష్‌కుమార్‌, ఎస్పీ

ఈనెల 19వ తేదీన రామగిరి మండలం నసనకోట ముత్యాలమ్మ ఆలయ ప్రాంగణంలో పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 16 మొబైల్స్‌తో పాటు రూ.1.06 లక్ష నగదు స్వాధీనం చేసుకున్నారు. ఆలయానికి ఉమ్మడి అనంతపురం జిల్లాతో పాటు కర్ణాటక నుంచి ప్రతి మంగళ, ఆదివారాల్లో వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇదే అదనుగా కొందరు పేకాట స్థావరాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈనెల 9వ తేదీన తాడిమర్రి మండలం మర్రిమాకులపల్లిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.19 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. జనావాసాల మధ్యలో ఓ ఇంట్లోనే స్థావరం ఏర్పాటు చేసి పేకాట ఆడుతున్నట్లు సమాచారంతో రాత్రి 11 గంటల సమయంలో దాడులు నిర్వహించి పట్టుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.

‘మామూళ్ల’తో కన్నెత్తి చూడని పోలీసులు

కర్ణాటక రాష్ట్రం నుంచి వస్తోన్న పేకాటరాయుళ్లు

జిల్లా వ్యాప్తంగా

జోరుగా సాగుతున్న పేకాట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement