అందరూ ‘ప్రైవేటు’ స్టార్లే! | - | Sakshi
Sakshi News home page

అందరూ ‘ప్రైవేటు’ స్టార్లే!

Jul 21 2026 12:41 AM | Updated on Jul 21 2026 12:41 AM

పుట్టపర్తి అర్బన్‌: పది, ఇంటర్‌లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం నిర్వహించిన ‘షైనింగ్‌ స్టార్స్‌’ అవార్డుల ప్రదానం అపహాస్యమైంది. సగానికిపైగా అవార్డులు ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు కట్టబెట్టడంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అసహనం వ్యక్తం చేశారు. తమ విద్యార్థులు మంచి మార్కులతో మండల ఫస్ట్‌ వచ్చినా ‘షైనింగ్‌ స్టార్స్‌ అవార్డు’ ఇవ్వలేదని, వారి తల్లిదండ్రులకు ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులు వాపోయారు.

దారి తప్పిన లక్ష్యం..

పది, ఇంటర్‌ లో అత్యధిక మార్కులు సాధించిన వారికి ‘షైనింగ్‌ స్టార్స్‌’ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనివల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరిగి రానున్న రోజుల్లో ఉత్తమ ఫలితాలు వస్తాయని భావించింది. ఈ క్రమంలోనే ప్రభుత్వం ‘షైనింగ్‌ స్టార్స్‌’ పేరుతో మెడల్‌, ప్రశంసాపత్రం, రూ.20 వేలు చెక్కు అందివ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాలో పది, ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 237 మంది విద్యార్థులను ఎంపిక చేసింది. వారిని పుట్టపర్తి మండలం జగరాజుపల్లి వద్ద ఉన్న మాహి శ్రీనివాస గార్డెన్స్‌లో అవార్డులతో సత్కరించారు. ముఖ్య అతిథిగా బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత, కలెక్టర్‌ శ్యాం ప్రసాద్‌, ఎమ్మెల్యే పల్లె సింధూర, డీఈఓ కిష్టప్ప తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. పదో తరగతికి సంబంధించి మొత్తం 201 మందికి గాను ఏకంగా 104 మంది ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అవార్డులు అందజేశారు. దీంతో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రభుత్వ ప్రోత్సాహానికి దూరమయ్యారు. ఇక ఇంటర్‌లో అత్యుత్తమ మార్కులు సాధించిన 36 మందికి అవార్డులివ్వగా.. అందులోనూ 22 మంది ప్రైవేటు కళాశాలల విద్యార్థులున్నారు. దీంతో అధికారుల తీరును ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు తప్పుబట్టారు. సర్కారు సొమ్మును ప్రైవేటు విద్యాసంస్థలకు మేలు చేసేలా ఖర్చు చేశారంటూ మండిపడ్డారు. అలాగే ఉదయం 8 గంటలకు కార్యక్రమం ప్రారంభమవుతుందని ప్రకటించిన అధికారులు తీరిగ్గా మధ్యాహ్నం ఒంటిగంటకు కార్యక్రమం ప్రారంభించారు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. కార్యక్రమంలో ఎండీఎం ఏడీ వినయ్‌కుమార్‌, డీఐఈఓ చెన్నకేశవప్రసాద్‌, విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

షైనింగ్‌ స్టార్స్‌ అవార్డుల

ప్రదానంలో వివక్ష

మండల ఫస్ట్‌ వచ్చిన సర్కారు బడుల విద్యార్థులకూ మొండిచేయి

అపహాస్యమైన అవార్డుల కార్యక్రమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement