పరిగి: ‘‘కియా పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న పరిగికి చెందిన వడ్డే సునీల్‌ను గతేడాది ఆగస్టు 14న కొందరు హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సిన మంత్రి సవిత...హంతకులను రక్షించారు. ఆమెను వెంటనే మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలి’’ అని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషశ్రీచరణ్ అన్నారు. సోమవారం ఆమె పరిగి పోలీస్‌స్టేషన్ వద్ద మృతుడు సునీల్ తల్లి లక్ష్మీదేవి, కుటుంబసభ్యులతో కలిసి విలేకరులతో మాట్లాడారు. సునీల్ హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించి నిందితులపై ఇప్పటివరకూ చర్యలు తీసుకోకపోవడం చూస్తే పోలీసుల వైఖరి ఏమిటో తెలుస్తోందన్నారు. ఘటన జరిగిన మూడ్రోజులకు మృతుడు సునీల్ తల్లిదండ్రులను మంత్రి సవిత పెనుకొండకు పిలిపించుకుని ఇల్లు, డబ్బులు, ఉద్యోగం ఇస్తామని చెప్పడంలో ఆంతర్యమేమిటన్నారు. దీన్ని బట్టి చూస్తే మంత్రి సవిత అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు తెలుస్తోందన్నారు. హత్యకు, మంత్రి సవితకు ఉన్న సంబంధం ఏమిటో పోలీసులు తేల్చాలన్నారు. సుద్దగుంటపల్లి మారుతి అనే వ్యక్తి ఈ కేసును తప్పుదోవ పట్టించారన్నారు. బాధిత కుటుంబసభ్యులకు ఫోన్ చేసి కాంప్రమైజ్ కావాలని భయాందోళనలకు గురి చేసిన మారుతిపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా మంత్రి సవితపై పోలీసులు కేసు నమోదు చేసి, అరెస్టు చేయాలన్నారు. పెనుకొండలో ఇటీవలే టెంపో శీన అనే దళితుడిపై టీడీపీకి చెందిన త్రివేంద్ర నాయుడు దాడి చేసిన ఘటనపై పోలీసు ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. టీడీపీ ఆగడాలపై న్యాయపోరాటం చేస్తామన్నారు. అనంతరం మృతుడి తల్లి లక్ష్మీదేవి మాట్లాడుతూ...తన కుమారుడు సునీల్‌ను కొట్టి చంపి, ఉరి వేసిన వారిని వెంటనే అరెస్టు చేసి న్యాయం చేయాలని కోరారు. అంతకుముందు ఉషశ్రీచరణ్ బాధిత కుటుంబంతో కలిసి పరిగి పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఎస్‌ఐని కలిశారు. నిందితులను అరెస్ట చేసి సకాలంలో కోర్టులో చార్జ్ షీటు దాఖలు చేయాలని కోరారు.
వడ్డే సునీల్‌ను హత్య చేసి
ఆత్మహత్యగా చిత్రీకరించారు
కేసులోని నిందితులకు
మంత్రి అండగా నిలిచారు
టీడీపీ ఆగడాలపై
న్యాయపోరాటం చేస్తాం
మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్


