ధర్మవరం: పట్టుచీరలకు ధర్మవరం పెట్టింది పేరు. ఇక్కడి చేనేత కార్మికులు అత్యాధునిక డిజైన్లతో అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచారు. అందుకే ఇక్కడి నేసేపేటలోని 1,650 దుకాణాల (సిల్క్‌హౌస్‌లు) నుంచి పట్టుచీరలు దేశంలోని వివిధ రాష్ట్రాలతో పాటు ఇతర దేశాలకూ ఎగుమతి అవుతుంటాయి. ఈ సిల్క్‌హౌస్‌ల యజమానులు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల పరిధిలోని చేనేత కేంద్రాలైన ధర్మవరం, హిందూపురం, సోమందేపల్లి, గోరంట్ల, సిండికేట్ నగర్, యాడికి, నార్పల, కోటంక, ముదిరెడ్డిపల్లి, అన్నమయ్య జిల్లా మదనపల్లె తదితర ప్రాంతాల్లోని చేనేత కార్మికులు, మాస్టర్ వీవర్‌ల నుంచి పట్టుచీరలను కావాల్సిన డిజైన్లలో నేయించుకుని కొనుగోలు చేస్తారు. వీటిని దేశంలోని వివిధ పట్టణాలు, నగరాలలోని పట్టుచీరల షోరూంల యజమానులకు హోల్‌సేల్‌గా విక్రయిస్తుంటారు. విదేశాల్లోని షోరూంల యజమానులు కూడా ధర్మవరం వచ్చి తమకు నచ్చిన డిజైన్లతో చీరలు నేయించి తీసుకువెళ్తుంటారు. చేనేత మగ్గంపై తయారైన పట్టుచీరలు రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు ధర పలుకుతుంటాయి. ముఖ్యంగా ముహుర్తాల సీజన్‌లో ధర్మవరం మార్కెట్‌లో చీరల విక్రయాలు జోరుగా సాగుతాయి.
దెబ్బతీసిన సెంటిమెంట్..
ధర్మవరం పట్టుచీరలపై సెంటిమెంట్ దెబ్బకొట్టింది. ఆర్థిక మాంద్యంతో పాటు అఽధిక జ్యేష్టం, ఆషాఢమాసం కారణంతో నాలుగు నెలలుగా శుభకార్యాలకు మంచి ముహూర్తాలు లేకపోవడంతో పట్టుచీరల విక్రయాలు బాగా తగ్గాయి. శుభకార్యాల సీజన్‌లో ప్రతి వారం సగటున రూ.40 కోట్ల లావాదేవీలు జరిగేవని, ప్రస్తుతం రూ.20 కోట్ల పట్టుచీరల విక్రయాలు కూడా జరగడం లేదని వ్యాపారులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో నేత కార్మికులు తయారు చేసిన పట్టు చీరలను వ్యాపారులు నిల్వ చేసుకోవాల్సి వస్తోందని, కార్మికులకు డబ్బులు కూడా సకాలంలో అందించలేని దుస్థితి నెలకొందంటున్నారు.
నగదు వ్యాపారానికే ప్రాధాన్యం..
ధర్మవరం వ్యాపారులు దేశంలోని వివిధ నగరాల్లోని షోరూంలకు పట్టుచీరలను అరువుకు ఇచ్చేవారు. చీరలు ఇచ్చిన రెండు, మూడు నెలల తర్వాత డబ్బులిచ్చినా సర్దుకునేవారు. అందుకే వ్యాపారమూ బాగా జరిగేది. అయితే పలు ప్రాంతాల్లోని పట్టుచీరల షోరూం యజమానులు డబ్బులు ఎగ్గొట్టడంతో.. లాభం తక్కువైనా నగదు వ్యాపారానికే మొగ్గు చూపుతున్నారు.
ముహూర్తాల సీజన్‌పైనే ఆశ..
రానున్న శ్రావణం, దసరా, దీపావళి పండుగలపై వ్యాపారులు గంపెడు ఆశపెట్టుకున్నారు. ముహూర్తాల సీజన్‌లో తప్పకుండా పట్టుచీరల విక్రయాల జోరందుకుంటాయని వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఎల్‌నినో ప్రభావంతో ఈ సారి పంటలు సక్రమంగా పండే అవకాశం లేదన్న వార్తలతో వ్యాపారుల్లో కలవరం మొదలైంది.
పట్టుచీరల ఎగుమతుల్లో ధర్మవరం మార్కెట్ దేశంలోనే పేరుగాంచింది. ఇతర రాష్ట్రాల వ్యాపారుల రాకపోకలతో నిత్యం కళకళలాడుతూ ఉండేది. కానీ నేడు కొనుగోలుదారులు రాక వెలవెలబోతోంది. వరుసగా అధిక జ్యేష్టం, ఆషాఢ మాసం సెంటిమెంట్ దెబ్బకు సిల్క్‌హౌస్‌లన్నీ కళా విహీనంగా మారాయి. శుభకార్యాలు లేక పోవడంతో పట్టుచీరల అమ్మకాలు మందగించాయి. ధర్మవరంలోని నేసేపేటలోని ఏ షాపులో చూసిన పట్టుచీరల నిల్వలు పేరుకుపోయాయి. దీంతో వ్యాపారులు రానున్న శ్రావణంలో వచ్చే ముహూర్తాల సీజన్‌పై ఆశలు పెట్టుకున్నారు.
పట్టుచీరపై సెంటిమెంట్ దెబ్బ
నిరాశాజనకంగా
ధర్మవరం సిల్క్ మార్కెట్
మందగించిన చీరల అమ్మకాలు
ఇబ్బందులు పడుతున్న వ్యాపారులు
అధిక జ్యేష్టం, ఆషాఢం
ప్రభావమే కారణం
షోరూంల డిస్కౌంట్ సేల్‌తో
వ్యాపారులకు తీవ్ర నష్టం
పలు నగరాల నుంచి వస్తున్న షోరూం నిర్వాహకులు ఆషాఢం డిస్కౌంట్ సేల్ పేరుతో చీర అసలు ధరలోనే 20 శాతం కోత విధించి కొనుగోలు చేస్తుండటంతో స్థానిక పట్టు వ్యాపారులు తీవ్రంగా నష్టపోతున్నారు. నష్టాలను కార్మికులకుపై మోపితే వ్యవస్థ నడవడమే కష్టమౌతుండటంతో వ్యాపారులే నష్టాలను భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది.


