నెల్లూరు(బారకాసు): నగరంలోని మైపాడు రోడ్డులో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సురక్షిత తాగునీటి సరఫరా పనులు చేపట్టారు. ఇవి పూర్తయిన అనంతరం ఆయా ప్రాంతాల్లో సీసీ రోడ్లను పునర్నిర్మించారు. అయితే నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించకపోవడంతో కొద్దిరోజులకే రోడ్డు పగుళ్లు ఏర్పడి కుంగిపోయే పరిస్థితి నెలకొంది. దీనిపై గత నెల 27న ‘ఇష్టారాజ్యంగా సిమెంట్ రోడ్డు నిర్మాణం’ శీర్షికన ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. అయితే సంబంధిత అధికారులు రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించి నాణ్యతగా ఉన్నాయని, ఎలాంటి ఇబ్బందులు లేవని పేర్కొన్నారు. కాగా రోడ్డు నిర్మించిన 15 రోజులకే ‘సాక్షి’ కథనంలో పేర్కొన్నట్లుగానే పగుళ్లు ఏర్పడి కుంగిపోయింది. దీనిపై ఈనెల 7న ‘నారాయణా.. ఇదేనా నాణ్యత’ శీర్షికన మరో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించి పగుళ్లు ఏర్పడి కుంగిపోయిన సీసీ రోడ్డును తొలగించి అదే ప్రాంతంలో తిరిగి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని సంబంధిత కాంట్రాక్టర్‌ను ఆదేశించినట్లు తెలిసింది. నాణ్యత విషయంలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించినట్లు సమాచారం.
రోడ్డు ప్రమాదంలో
ఇద్దరికి గాయాలు
వెంకటాచలం: మోటార్‌బైక్ అదుపుతప్పి ఇద్దరు గాయపడిన ఘటన మండలంలోని కనుపూరు సమీపంలో బుధవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. నెల్లూరులోని పొదలకూరు రోడ్డు ప్రాంతానికి చెందిన సోని, అన్వర్ పని నిమిత్తం బైక్‌పై కసుమూరుకు వచ్చారు. తిరిగి నెల్లూరుకు వెళ్తుండగా కనుపూరు సమీపంలోని మలుపు వద్ద బైక్ అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో సోని, అన్వర్‌కు గాయాలు కాగా స్థానికులు వారిని చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు.
జిల్లాకు తల్లీబిడ్డ
ఎక్స్‌ప్రెస్‌ల మంజూరు
నెల్లూరు(అర్బన్): జిల్లాకు తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ (102) వాహనాలు 9 మంజూరయ్యాయి. వాటిని బుధవారం డీఎంహెచ్‌ఓ సుజాత, పెద్దాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ మాధవి, ఐసీడీఎస్ పీడీ హేనాసుజన్ నెల్లూరులోని పెద్దాస్పత్రిలోని ఎంసీహెచ్ బ్లాక్‌లో జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ మాట్లాడుతూ కాన్పు జరిగిన తర్వాత తల్లీబిడ్డను ప్రభుత్వాస్పత్రుల నుంచి ఇంటికి ఎలాంటి ఆటంకం లేకుండా ఈ వాహనాలు తీసుకెళ్తాయన్నారు. 4 సర్వజన ఆస్పత్రికి, రెండు ఆత్మకూరులోని జిల్లా ఆస్పత్రికి, గూడూరు, కావలి, పొదలకూరుకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించడం జరిగిందన్నారు. కాగా ఇప్పటి వరకు నిర్వహిస్తున్న అరబిందో కాంట్రాక్ట్‌కు సంబంధించిన పాత వాహనాలు పెద్దాస్పత్రి ఆవరణలో ఉన్నాయని, వాటిని ఆ యాజమా న్యం త్వరలోనే తీసుకెళ్తుందని తెలిపారు.
హైవేపై ట్రాఫిక్‌కు
అంతరాయం
మనుబోలు: మండలంలోని జాతీయ రహదారిపై వెళ్తున్న బస్సు.. మరో బస్సును ఢీకొనడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. స్థానికుల కథనం మేరకు.. బుధవారం గూడూరు వైపు నుంచి విజయవాడకు వెళ్తున్న ఆర్టీసీ బస్సును అదే మార్గంలో వెనుక వస్తున్న ప్రైవేట్ బస్సు ఢీకొంది. ఇండియన్ పెట్రోల్ బంక్ దగ్గర జరిగిన ఈ ప్రమాదంలో వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ట్రాఫిక్‌కు అంతరాయం కలగడంతో హైవే సిబ్బంది, పోలీసులు స్పందించి పునరుద్ధరించారు.


