నెల్లూరురూరల్: స్వాతంత్య్ర దినోత్సవం నేపథ్యంలో జిల్లాలో భారీ తిరంగా ర్యాలీతో సంబరాలకు శ్రీకారం చుట్టారు. కలెక్టర్ హిమాన్షు శుక్లా ఆధ్వర్యంలో నెల్లూరులో 275 అడుగుల జాతీయ జెండాతో నిర్వహించిన ర్యాలీని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి బుధవారం ప్రారంభించారు. దేశభక్తి నినాదాలతో ర్యాలీ వీఆర్సీ సెంటర్ వరకు కొనసాగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈనెల 15వ తేదీ వరకు జిల్లాలో వివిధ ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో దేశభక్తి, జాతీయ సమైక్యత, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలపై గౌరవాన్ని మరింత పెంపొందించడమే తిరంగా ర్యాలీ ప్రధాన ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ, ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, దగుమాటి వెంకట కృష్ణారెడ్డి, కాకర్ల సురేష్, జేసీ మొగిలి వెంకటేశ్వర్లు, డీఆర్వో విజయ్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ వైఓ నందన్, అధికారులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.


