● ర్యాలీ నిర్వహించిన జూనియర్ డాక్టర్లు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం తమ డిమాండ్లను పరిష్కరించే వరకు సమ్మెను విరమించే ప్రసక్తే లేదని జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ హనీష్ కుమార్ స్పష్టం చేశారు. స్టై ఫండ్‌ను తక్షణమే 30 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మె బుధవారానికి మూడో రోజుకు చేరుకుంది. ఇందులో భాగంగా నెల్లూరు సర్వజన ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్లు విధులను బహిష్కరించి ఆస్పత్రి, మెడికల్ కళాశాల ఆవరణంతో పాటు సమీప ట్రంకురోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా హనీష్ కుమార్ మాట్లాడుతూ తాము గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదన్నారు. ప్రభుత్వ జీఓ ప్రకారం ప్రతి రెండేళ్లకోసారి స్టై ఫండ్‌ను పెంచాల్సి ఉందని తెలిపారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దాటడంతోపాటు మరో ఎనిమిది నెలలు గడిచినా స్టై ఫండ్ పెంపుపై ప్రభుత్వం దృష్టి సారించలేదన్నారు. ఈ విషయంపై పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెకు దిగాల్సి వచ్చిందని తెలిపారు. స్టై ఫండ్‌ను 30 శాతం పెంచడంతోపాటు డాక్టర్ల ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు మించకుండా చూడాలన్నారు. ఎంబీబీఎస్, పీజీ పూర్తి చేసిన వైద్యులతోనే తమకు బోధన చేయించాలని కోరుతున్నట్లు తెలిపారు. ఈ మూడు ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించాలని డిమాండ్ చేశారు. లేకపోతే అత్యవసర సేవలను సైతం నిలిపివేసి పూర్తిస్థాయిలో ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో డాక్టర్లు భార్గవ్, నిర్మల్, భావన, కీర్తి తదితరులు పాల్గొన్నారు.
● జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడంతో ఆస్పత్రికి వచ్చే రోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సీనియర్ వైద్యులు అందుబాటులో లేకపోవడం, జూనియర్ డాక్టర్లు విధులకు హాజరుకాకపోవడంతో రోగులకు వైద్య సేవలు సక్రమంగా అందడం లేదనే ఆరోపణలున్నాయి.


