నెల్లూరు సిటీ: జొన్నవాడ ఆర్చి సమీపంలో గుర్తుతెలియని వ్యక్తి కలుపు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడని ఘటన ఘటన బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రూరల్ నియోజకవర్గం దేవరపాళెం గ్రామ పరిధిలోని జొన్నవాడ ఆర్జి వద్ద గుర్తుతెలియని వ్యక్తి కలుపు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. అటువైపు వెళ్తున్న వారు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి వయసు సుమారు 50 సంవత్సరాలు ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
మద్యం మత్తులో
కాలువలో పడి..
● వ్యక్తి మృతి
విడవలూరు: మద్యం మత్తులో కాలువలో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన మండల కేంద్రంలో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. నెల్లూరు ఎన్టీఆర్ నగర్‌కు చెందిన తిరువాల శ్రీనివాసులు (55) కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి భార్య వెంకటరమణమ్మ, ఒక కుమార్తె, ఇద్దరు కుమారులున్నారు. శ్రీనివాసులుకు విడవలూరు కామాక్షి నగర్‌లో ఇంటి స్థలం ఉంది. దానిని విక్రయించేందుకు తరుచూ విడవలూరుకు వచ్చి వెళ్తూ ఉండేవాడు. ఈ క్రమంలో బుధవారం ఉదయం విడవలూరు వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయలుదేరిన శ్రీనివాసులు మధ్యాహ్నం కామాక్షి నగర్ ఒకటో వీధి వద్ద ఉన్న కాలువ వద్ద కూర్చొని మద్యం తాగాడు. మత్తులో ఉన్న అతను ప్రమాదవశాత్తు తూలి కాలువ నీటిలో బోర్లా పడిపోవడంతో ఊపిరి ఆగి అక్కడకక్కడే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని శ్రీనివాసులు మృతదేహాన్ని చూపి బోరున విలపించారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్సై సాయి కల్యాణ్ కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


