అడిగేదెవరు.. ఆపేదెవరు? | - | Sakshi
Sakshi News home page

అడిగేదెవరు.. ఆపేదెవరు?

Aug 13 2026 12:39 AM | Updated on Aug 13 2026 12:39 AM

పట్టించుకోని అధికారులు

చేపల గుంతల పేరుతో ఆక్రమణలు

కలుషితమవుతున్న నీరు

కలిగిరి: నిబంధనలతో మాకేంటి.. అధికారుల అనుమతులు అవసరం లేదు.. మమ్మల్ని అడ్డుకునేది ఎవరు అనే తీరులో అక్రమార్కులు చెరువుల నుంచి రాత్రి సమయంలో టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. గంగిరెడ్డిపాళెం పంచాయతీ పరిధిలోని పెద్దిరెడ్డిగుంట చెరువు, మాలపాటివారి చెరువుల నుంచి భారీగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. కలిగిరి, వింజమూరు మండలాల్లో ఉన్న ఇటుక బట్టీలకు ఈ చెరువుల నుంచి గ్రావెల్‌ను తరలిస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో చుట్టుపక్కల లేఅవుట్లకు కూడా ఇక్కడి నుంచే గ్రావెల్‌ను అధికంగా తోలుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. గత నాలుగు రోజులుగా ఈ తంతు జరుగుతున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. మంగళవారం అర్ధరాత్రి టిప్పర్ల ద్వారా గ్రావెల్‌ తరలించడానికి ప్రయత్నించడాన్ని స్థానికులు ఇరిగేషన్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. స్థానిక జేసీబీ, టిప్పర్‌ వాహనాల నిర్వాహకులే అక్రమ గ్రావెల్‌ దందాలో కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.

భారీ గోతులు

చెరువుల లోపలి వైపు కట్టల సమీపంలో భారీగా గ్రావెల్‌ను తరలిస్తున్నారు. దీంతో పెద్ద గోతులు ఏర్పడ్డాయి. చెరువులు నిండితే అవి నీటితో నిండి ప్రమాదకరంగా మారుతాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పశువులు గోతుల్లో పడి మృత్యువాత పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

స్పందన లేదు

అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న సమాచారాన్ని ఇరిగేషన్‌ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదని స్థానికులు అంటున్నారు. గ్రావెల్‌ తరలింపు పూర్తయిన తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి హడావుడి చేస్తున్నారని విమర్శిస్తున్నారు.

దగదర్తి: మండల పరిధిలోని రామన్న చెరువులో ఇష్టారాజ్యంగా గుంతలు తవ్వి మట్టిని తరలిస్తున్నారు. వేల ఎకరాలకు సాగునీరు అందించే ఆయకట్టు కలిగిన ఈ చెరువులోని మట్టిని తవ్వి ప్రైవేట్‌ భూములను చదును చేసేందుకు తరలిస్తున్నారు. దాని పక్కనే సుమారు 70 ఎకరాల్లో చేపల గుంతలు సాగు చేస్తున్నారు. వాటిని లీజుకు తీసుకున్న కొంతమంది వ్యక్తులు, చెరువు పరిధిలోకి సైతం విస్తరించి గుంతలు ఏర్పాటు చేస్తున్నారు. రాత్రివేళల్లో చెరువులో మట్టి తవ్వకాలు చేస్తున్నారు. దీంతో పశువులకు ప్రమాదం పొంచి ఉందని ఆవేదన రైతులు వ్యక్తం చేస్తున్నారు.

వ్యర్థాలతో నీటి కాలుష్యం

చేపల గుంతల్లో ఫంగస్‌ చేపల పెరుగుదల కోసం జంతు, కోళ్ల వ్యర్థాలను మేతగా వినియోగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అదేవిధంగా చేపలు త్వరగా పెరగాలనే ఉద్దేశంతో కొన్ని రసాయనాలను కూడా వాడుతున్నట్లు చెబుతున్నారు. ఈ వ్యర్థాలు, రసాయనాలు చెరువు నీటిలో కలిసే అవకాశం ఉండటంతో నీటి నాణ్యత దెబ్బతిని, సాగునీటిపై ఆధారపడుతున్న వేలాది ఎకరాల ఆయకట్టు రైతులకు భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

ఇరిగేషన్‌ అధికారుల తీరుపై ప్రశ్నలు

చెరువు పరిధిలో జరుగుతున్న మట్టి తవ్వకాలు, గుంతల ఏర్పాటు వ్యవహారంపై సంబంధిత ఇరిగేషన్‌ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆయకట్టు రైతులు ఆరోపిస్తున్నారు. సుమారు 2 వేల ఎకరాలకు పైబడి ఉన్న చెరువు హద్దులను గుర్తించి అక్రమ తవ్వకాలను అడ్డుకోవడంతోపాటు, ఇప్పటికే తవ్విన గుంతలను పరిశీలించి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

చెరువులో మట్టిని తరలించడంతో ఏర్పడిన గుంతలు

యథేచ్ఛగా చెరువుల నుంచి

గ్రావెల్‌ తరలింపు

ఇటుక బట్టీలకు తోలి సొమ్ము

చేసుకుంటున్న అక్రమార్కులు

చెరువుల్లో భారీ గోతులతో

పొంచి ఉన్న ప్రమాదాలు

చోద్యం చూస్తున్న ఇరిగేషన్‌ అధికారులు

కూటమి ప్రభుత్వంలో ప్రకృతి వనరుల దోపిడీ ఆగడం లేదు. తెలుగుదేశం నాయకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు ఉంటున్నారు. గ్రావెల్‌ తవ్వకాలతో భవిష్యత్‌లో ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసినా అక్రమార్కులు లెక్క చేయడం లేదు.

పోలీసులకు ఫిర్యాదు చేశాం

గంగిరెడ్డిపాళెం పరిధిలోని పెద్దిరెడ్డిగుంట, మాలపాటివారి చెరువుల నుంచి అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తున్న విషయంపై పోలీసుల ఫిర్యాధు చేశాం. వాటి నుంచి ఇటుక బట్టీలు, లేఅవుట్లకు గ్రావెల్‌ తరలిస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. చెరువులు, వాగుల్లో అనుమతులు లేకుండా అక్రమంగా గ్రావెల్‌ తరలిస్తే కేసులు పెడతాం.

– శ్రీనాఽథ్‌, ఇరిగేషన్‌ ఏఈ, కలిగిరి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement