కలెక్టర్ హిమన్షు శుక్లా తొలిసారిగా ఏప్రిల్ 15న ఆత్మకూరు మండలం బోయలచిరివెళ్లలో పల్లెవీక్షణ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా జగనన్న కాలనీవాసులు తమ సమస్యలను కలెక్టర్‌కు విన్నవించారు. ప్రధానంగా రోడ్డు, తాగునీటి సౌకర్యాలను కల్పించాలని విన్నవించారు. బోయలచెరివెళ్ల సమీపంలో 67వ నంబరు జాతీయ రహదారి ఉంది. జాతీయ రహదారి పక్కనున్న తారురోడ్డు నుంచి సుమారు కి.మీ. దూరం ఉన్న జగనన్న కాలనీ వరకు సిమెంట్ రోడ్డు నిర్మించి రాకపోకల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. కాలనీలో అసంపూర్తిగా నిలిచిపోయిన జల్‌జీవన్ మిషన్ పనులు పూర్తిచేయించి తాగునీటిని అందించాలని కోరారు. అయితే కలెక్టర్ వచ్చి వెళ్లి నాలుగు నెలలు గడిచినా ఏ సమస్యలకు పరిష్కారం లభించకపోవడంపై కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టరే పట్టించుకోకపోతే ఇక అధికారులు ఏమి స్పందిస్తారని వాపోతున్నారు.


